విక్టరీ వెంకటేష్ హీరో అవ్వడానికి కారణం సూపర్‌స్టార్ కృష్ణ. ఎలాగంటే..?
on Dec 12, 2025
(డిసెంబర్ 13 విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా..)
సినిమాలపై ఆసక్తి లేకపోయినా కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చిత్రరంగంలోకి ప్రవేశించి అనూహ్య విజయాలు సాధించిన వారిలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ ఎంతోమంది ఉన్నారు. అలా నటనపై అవగాహనగానీ, ఆసక్తిగానీ లేకుండా హీరో అయిపోయిన వారిలో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. 1986లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. ఈ 39 సంవత్సరాల్లో 76 సినిమాల్లో నటించారు. వీటిలో చంటి హిందీ రీమేక్‌గా వచ్చిన ‘అనాడి’, యమలీల హిందీ రీమేక్‌గా వచ్చిన ‘తక్‌దీర్‌వాలా’ ఉన్నాయి.
1963లో నిర్మాతగా చిత్ర రంగ ప్రవేశం చేసిన మూవీమొఘల్ డా.డి.రామానాయుడు.. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి అగ్రనిర్మాతగా ఎదిగారు. అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు సురేష్, వెంకటేష్. వీరిద్దరి పేరుమీద స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపైనే సినిమాలు నిర్మించేవారు. ఈ సంస్థ లోగోపై ఇద్దరు పిల్లలు, ఎస్.. పి అనే అక్షరాలు ఉంటాయి. ఎస్ అక్షరంపై ఉన్న వెంకటేష్ స్టార్‌గా, పి అనే అక్షరంపై ఉన్న సురేష్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.
1960 డిసెంబర్ 13న కారంచేడులో డి.రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు జన్మించారు వెంకటేష్. అతని స్కూల్, కాలేజీ విద్యాభ్యాసం మద్రాస్‌లోనే జరిగింది. ఆ తర్వాత అమెరికాలో ఎంబిఎ పూర్తి చేశారు. స్టడీస్ పూర్తయిన తర్వాత ఇండియా వచ్చి అన్నయ్య సురేష్‌లా నిర్మాతగా లేదా బిజినెస్‌మేన్‌గా సెటిల్ అవ్వాలనుకున్నారు.
అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తూ వస్తున్న రామానాయుడు.. 1986లో కృష్ణ హీరోగా ఒక సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేశారు. అయితే అప్పటికి కృష్ణ చాలా సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఆయన డేట్స్ రామానాయుడుకి దొరకలేదు. అదే సమయంలో కృష్ణ చెప్పిన ఒక్క మాటతో వెంకటేష్ హీరో అయిపోయారు. ‘ఇప్పట్లో నా డేట్స్ ఖాళీ లేవు. అయినా మీ ఇంట్లోనే హీరోని పెట్టుకొని మరొకరితో సినిమా ఎందుకు.. మీ అబ్బాయి వెంకటేష్ బాగానే ఉన్నాడు. అతన్ని హీరో చేయండి’ అని సలహా ఇచ్చారు కృష్ణ.
అమెరికా నుంచి వచ్చిన వెంకటేష్‌తో అదే విషయం చెప్పారు రామానాయుడు. వెంకటేష్ షాక్ అయి తను హీరో ఏంటి అనుకున్నారు. ఎక్కువ కాలం అమెరికాలోనే ఉండడం వల్ల ఇంగ్లీషే ఎక్కువగా మాట్లాడేవారు. నటనలో అనుభవం లేకుండా, తెలుగు రాకుండా సినిమాలు ఎలా చెయ్యగలను అని తండ్రిని అడిగారు వెంకటేష్. కానీ, రామానాయుడు మాత్రం కొడుకుని హీరోని చెయ్యాలనే నిర్ణయించుకున్నారు. దానికి తగినట్టుగా వెంకటేష్‌కి శిక్షణ ఇప్పించారు. 1986లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా వెంకటేష్‌ని హీరోగా పరిచయం చేశారు రామనాయుడు. నటన కొత్త కావడంతో నటించడంలో, డైలాగులు చెప్పడంలో బాగా తడబడ్డారు. మొత్తానికి సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. ‘కలియుగ పాండవులు’ సూపర్‌హిట్ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. దాంతో వెంకటేష్‌కి కూడా ధైర్యం వచ్చింది.
అంతకుముందే 1971లో వచ్చిన ‘ప్రేమనగర్’ చిత్రంలో బాలనటుడిగా కనిపించారు వెంకటేష్. ఇదే సినిమాను తమిళ్‌లో ‘వసంత మాళిగై’గా రీమేక్ చేశారు రామానాయుడు. ఇందులో కూడా వెంకటేష్ నటించారు. ‘కలియుగ పాండవులు’ హిట్ తర్వాత అక్కినేని నాగేవ్వరరావుతో కలిసి ‘బ్రహ్మరుద్రులు’ చేశారు. ఆ మరుసటి ఏడాది 5 సినిమాల్లో హీరోగా నటించారు. అందులో ‘శ్రీనివాసకళ్యాణం’ వెంకటేష్‌కి మంచి పేరు తెచ్చింది. ఆ వెంటనే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘స్వర్ణకమలం’ వంటి క్లాస్ సినిమాతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
1990లో వచ్చిన ‘బొబ్బిలిరాజా’ చిత్రం సాధించిన ఘనవిజయంతో కమర్షియల్ హీరోగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన చేరారు వెంకటేష్. ఆ తర్వాత వచ్చిన శత్రువు, కూలీ నెం.1, క్షణక్షణం, చంటి సుందరకాండ, కొండపల్లిరాజా, అబ్బాయిగారు వంటి సినిమాలతో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు. ఆ క్రమంలోనే ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, రాజా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలతో ఫ్యామిలీ స్టార్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వరకు అన్నిరకాల సినిమాలు చేస్తూ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు విక్టరీ వెంకటేష్.
యాక్షన్, సెంటిమెంట్, కామెడీలను అద్భుతంగా పండిరచగల హీరోల్లో వెంకటేష్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇటీవలికాలంలో ఎఫ్2, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల్లోనూ తన కామెడీతో అలరించారు. అలాగే ఈనాడు, దృశ్యం సిరీస్, నారప్ప, గురు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న వెంకటేష్‌కి సక్సెస్‌ల శాతం ఎక్కువ. అందుకే విక్టరీని తన పేరుగా మార్చుకొని విక్టరీ వెంకటేష్ అయ్యారు. అలాగే ఎక్కువ రీమేక్‌లు చేసిన హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎక్స్‌పెరిమెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేష్.. ఆ తరహా సినిమాలు ఎన్నో చేసి సక్సెస్ సాధించారు.
ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఏడాది ముందే 1985లో వెంకటేష్ వివాహం నీరజతో జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వెంకటేష్.. షూటింగ్ తర్వాత కుటుంబ సభ్యులతో గడిపేందుకే ఇష్టపడతారు.
ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే.. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇటీవల ప్రారంభమైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు విక్టరీ వెంకటేష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



