వెంకటేష్ కోసం రిజిస్టర్ చేసిన టైటిల్‌తో చిరంజీవి సినిమా.. అది హిట్టా? ఫట్టా?
on Nov 26, 2024
పాతరోజుల్లో ఒక సినిమా స్టార్ట్ చెయ్యాలంటే కథను పూర్తి స్థాయిలో తయారు చేసుకున్న తర్వాతే సెట్స్‌పైకి వెళ్లేవారు. మరీ ముఖ్యంగా ఆ సినిమాకి టైటిల్ ముందే డిసైడ్ చేసుకునేవారు. ఆ తర్వాతి రోజుల్లో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో టైటిల్‌ను ఎనౌన్స్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో ఒకే టైటిల్‌ను రెండు సినిమాలకు అనుకోవడం, అది వివాదంగా మారడం కూడా మనం చూశాం. అలా వెంకటేష్ కోసం అనుకున్న టైటిల్‌ను మెగాస్టార్ చిరంజీవి సినిమా పెట్టడం జరిగింది. అదే ‘రుద్రవీణ’. ఈ టైటిల్ వెనుక వున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాం.
యువచిత్ర బేనర్ అధినేత కె.మురారి.. బాలకృష్ణ హీరోగా జంధ్యాల దర్శకత్వంలో సీతారామకళ్యాణం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదే సమయంలో సుహాసిని ప్రధాన పాత్రలో క్రాంతికుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘స్వాతి’ చిత్రం విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా మురారికి కూడా బాగా నచ్చింది. వెంటనే దర్శకుడు క్రాంతికుమార్ దగ్గరకు వెళ్లి తర్వాతి సినిమా తనకే చెయ్యాలని అడ్వాన్స్ ఇచ్చారు. నాథనియల్ హాతోర్న్ రచించిన ‘స్కార్లెట్ లెటర్’ నవల 1850లో ప్రచురితమైంది. ఆరోజుల్లోనే ఈ నవల 7,800 కాపీలు అమ్ముడయ్యాయి. ఈ కథలో ఓ మహిళ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటుంది. దాన్ని తీసుకొని సంగీత ప్రధాన చిత్రంగా రూపొందిస్తే బాగుంటుందని భావించారు మురారి. ‘రుద్రవీణ’ అనే టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేశారు.
అదే సమయంలో మూవీ మొఘల్ డి.రామానాయుడు తన చిన్న కుమారుడు వెంకటేష్‌ని హీరోగా పరిచయం చేస్తూ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్‌తో రెండో సినిమాను తను నిర్మిస్తానని చెప్పి రామానాయుడికి అడ్వాన్స్ ఇచ్చారు మురారి. ఆ సినిమాకి డైరెక్టర్ క్రాంతికుమార్ అని తెలుసుకొని రామానాయుడు అంత ఆసక్తి కనబరచలేదు. అయినా అడ్వాన్స్ తీసుకొని డైరెక్టర్ విషయం తర్వాత మాట్లాడదాం అన్నారు. అప్పటివరకు పూర్తి కమర్షియల్ సినిమాలు చేస్తూ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఒక విభిన్నమైన కథాంశంతో సినిమా చెయ్యాలనుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన అంజన ప్రొడక్షన్స్ బేనర్‌పై కె.బాలచందర్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించారు. షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాకి అప్పటికి టైటిల్ అనుకోలేదు. వాహిని స్టూడియోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కి మురారి వెళ్లారు. అప్పుడు చిరంజీవి కొందరు నిర్మాతలతో మాట్లాడుతున్నారు. మురారి రుద్రవీణ టైటిల్‌ను రిజిస్టర్ చేశారని వారి ద్వారా చిరంజీవికి తెలిసింది. తను చేస్తున్న సినిమాకి ఆ టైటిల్ అయితే బాగుంటుంది అన్నారు చిరంజీవి. అది విన్న మురారి ఆ టైటిల్‌ను వెంకటేష్‌తో చేస్తున్న సినిమా కోసం రిజిస్టర్ చేశానని చెప్పారు.
రుద్రవీణ టైటిల్ ఇవ్వమని అడిగేందుకు చిరంజీవి కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ టైటిల్ తనకు నచ్చిందన్న విషయం ఆయనకు తెలుసు కాబట్టి తనంతట తానే ఇస్తారని భావించారు చిరంజీవి. కానీ, తన సినిమాకు ఆ టైటిల్ రిజిస్టర్ చేశానని చెప్పడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు నిర్మాత కె.ఎస్.రామరావు నుంచి మురారికి ఫోన్ వచ్చింది. తన సొంత బేనర్‌లో నిర్మిస్తున్న సినిమాకి రుద్రవీణ టైటిల్ కావాలని చిరంజీవి అడుగుతున్నారన్న విషయాన్ని చెప్పారు కె.ఎస్.రామారావు. అప్పుడు మురారి మరో మాట మాట్లాడకుండా చిరంజీవి ఇంటికి వెళ్లి రుద్రవీణ టైటిల్‌ను అంజన ప్రొడక్షన్స్‌కి ఇస్తున్నట్టు లెటర్ రాసిచ్చారు.
ఇక వెంకటేష్‌తో మురారి అనుకున్న సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించి పేపర్‌లో యాడ్ ఇచ్చారు. వెంకటేష్ నిలబడి ఉండగా అతని కాళ్ళ దగ్గర వీణ ఫోటోను పెట్టి ఆ యాడ్‌ని ఇచ్చారు. అది చూసి సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్.. అలా చేయడం చాలా పాపం అని మురారిని మందలించారు. ఈ సినిమా కథా చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజశేఖర్ నటించిన ‘అంకుశం’ రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. తాను వెంకటేష్‌తో నిర్మించే సినిమాలో తమ్ముడి వేషం వెయ్యమని రాజశేఖర్‌ని అడిగారు మురారి. దానికి రాజశేఖర్ ఒప్పుకున్నారు. ఈ సినిమా కథా చర్చల్లో జి.సత్యమూర్తి కూడా పాల్గొన్నారు. ఈ సినిమా అనుకున్న రోజు నుంచీ క్రాంతికుమార్‌కి, మురారికి అస్సలు పడేది కాదు. ప్రతిరోజూ ఇద్దరూ గొడవపడేవారు. తమ కాంబినేషన్‌లో సినిమా జరగడం చాలా కష్టం అని ఇద్దరూ గ్రహించారు. దాంతో ఆ సినిమాను ఆపేశారు. ఇక వెంకటేష్ కోసం అనుకున్న టైటిల్‌తో రూపొందిన ‘రుద్రవీణ’ బక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. అయితే ఈ సినిమాకి మూడు జాతీయ అవార్డులు, నాలుగు నంది అవార్డులు లభించాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా జాతీయ, నంది అవార్డులు అందుకున్నారు.
Also Read