Home

»

Featured News

ఒకే క‌థ‌తో రెండు సూప‌ర్‌హిట్ సినిమాలు చేసిన డైరెక్ట‌ర్ గురించి మీకు తెలుసా?

Sep 17, 2026 7:01PM

తెలుగు చిత్రపరిశ్రమలో హాస్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ వంటి నటులతో అనేక మరపురాని కామెడీ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. 1981లో చంద్రమోహన్, ప్రభ, గిరిబాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'నేను మా ఆవిడ' చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి తన సత్తా చాటారు.

ఇదిలా ఉంటే.. రేలంగి న‌ర‌సింహారావు మొద‌టి సినిమా ‘నేను మా ఆవిడ’ క‌థ‌తోనే మ‌ళ్లీ 1994లో రాజేంద్ర‌ప్ర‌సాద్, య‌మున జంట‌గా బ్ర‌హ్మ‌చారి మొగుడు అనే సినిమా చేశార‌ని మీకు తెలుసా? రెండింటి కాన్సెప్ట్ ఒక‌టే. నేను మా ఆవిడ సినిమాలో అద్దె ఇల్లు కోసం త‌న‌కు పెళ్ల‌యింద‌ని ఒక అమ్మాయి ఫోటోను ఇంటి ఓన‌ర్‌కి చూపిస్తాడు. అలా ఆ ఇంట్లో దిగుతాడు. కొన్నాళ్ళ‌కు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే చంద్ర‌మోహ‌న్ భార్య‌ను అంటూ దిగుతుంది. అక్క‌డి నుంచి ఆమెను వ‌దిలించుకోవ‌డానికి చంద్ర‌మోహ‌న్ ప‌డే బాధలు న‌వ్వు తెప్పిస్తాయి.

ఇక ‘బ్ర‌హ్మ‌చారి మొగుడు’ సినిమా విష‌యానికి వ‌స్తే.. రాజేంద్ర‌ప్ర‌సాద్ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. ఆ య‌జ‌మాని చెల్లెల్ని ఒక కుర్రాడు పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేస్తాడు. అప్ప‌టి నుంచి బ్ర‌హ్మ‌చారులంటే ఆయ‌న‌కు విప‌రీత‌మైన కోపం. అందుకే రాజేంద్ర‌ప్ర‌సాద్‌ని చుల‌క‌నగా చూస్తుంటాడు. 

పెళ్లి చేసుకుంటే ఏ స‌మ‌స్యా ఉండ‌ద‌ని, పెళ్లి చేసుకోబోతున్నాన‌ని య‌జ‌మానికి చెప్ప‌మ‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ కొలీగ్ స‌ల‌హా ఇస్తాడు. దాంతో ఒక ఫోటో స్టూడియో నుంచి అమ్మాయి ఫోటో తీసుకొని ఇద్ద‌రి ఫోటోల‌తో శుభలేఖ‌లు ప్రింట్ చేయిస్తాడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. ఆ త‌ర్వాత మ‌నం ముందు చెప్పుకున్న క‌థ‌లోలాగే రాజేంద్ర‌ప్ర‌సాద్ భార్య‌నంటూ య‌మున దిగుతుంది. ఇక అక్క‌డి నుంచి రాజేంద్ర‌ప్ర‌సాద్ ప‌డే బాధ‌లు కామెడీగా ఉంటాయి.

ఈ రెండు సినిమాల మూల క‌థ ఒక్క‌టే. కానీ, న‌టీన‌టులతోపాటు బ్యాక్‌డ్రాప్ కూడా మార‌డంతో కొత్త సినిమా అనే ఫీల్ క‌లుగుతుంది. నేను మా ఆవిడ రిలీజ్ అయిన 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత బ్ర‌హ్మ‌చారి మొగుడు విడుద‌లైంది. అన్ని సంవ‌త్స‌రాల గ్యాప్ ఉండ‌డం, అప్ప‌ట్లో మీడియా కూడా విస్త‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ రెండు సినిమాల విష‌యం చ‌ర్చ‌కు రాలేదు. ఏది ఏమైనా ఒకే కాన్సెప్ట్‌తో రెండు సినిమాలు చేసి రాజేంద్ర‌ప్ర‌సాద్, చంద్ర‌మోహ‌న్‌ల‌కు సూప‌ర్‌హిట్స్ ఇచ్చిన ఘ‌న‌త మాత్రం రేలంగి న‌ర‌సింహారావుకే ద‌క్కుతుంది.

 

 

[two superhits with one story, director relangi narasimha rao, rajendra prasad, chandramohan, nenu maa aavida, brahmachari mogudu]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com