Home

»

Featured News

అక్కినేని అభ్యంత‌రం చెప్పిన ఆ రెండు పాట‌లు సూప‌ర్‌హిట్ అయ్యాయి.!

Sep 20, 2026 9:55AM

(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా..)

న‌టుడిగా 73 సంవ‌త్స‌రాల సుదీర్ఘ‌మైన కెరీర్‌ను కొన‌సాగించిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావు.. త‌ను చేసే సినిమాల విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. క‌థ ద‌గ్గ‌ర నుంచి సినిమాలోని పాట‌లు, వాటి సాహిత్యం విష‌యంలోనూ శ్ర‌ద్ధ వ‌హిస్తారు. అలా కొన్ని సినిమాల్లోని పాట‌ల‌ను తొల‌గించిన సంద‌ర్భాలు ఉన్నాయి. 

రెండు పాట‌ల విష‌యంలో మాత్రం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, సంగీత ద‌ర్శ‌కుడు క‌న్విన్స్ చేసి అక్కినేనిని ఒప్పించారు. అలా ఆ రెండు పాట‌లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి చాలా పెద్ద హిట్ అయ్యాయి. పాట‌ల ప‌రంగా, చిత్రీక‌ర‌ణ ప‌రంగా ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న ఆ రెండు పాట‌ల గురించి తెలుసుకుందాం.

1959లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, జ‌మున జంట‌గా తాతినేని ప్ర‌కాశ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా ‘ఇల్ల‌రికం’. ప్ర‌సాద్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎ.వి.సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. టి.చ‌ల‌ప‌తిరావు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా చాలా పెద్ద విజ‌యం సాధించి 23 కేంద్రాల్లో 100 రోజులు ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. మ్యూజిక‌ల్‌గా కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నిలువ‌వే వాలు క‌నుల దానా..’ అంటూ సాగే పాట ఎంతో పాపుల‌ర్ అయింది. మారు వేషంలో ఉన్న అక్కినేని.. జ‌మున‌ను ఆట ప‌ట్టిస్తూ పాడే పాట ఇది. కొస‌రాజు ఈ పాట‌ను ర‌చించారు. 

ఈ పాట‌పై అక్కినేని అభ్యంత‌రం చెప్పారు. పాత్ర ప‌రంగా ఎంతో మంచివాడైన హీరో.. అలా హీరోయిన్‌ని టీజ్ చేస్తూ పాట పాడితే పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది అన్నారు. ఆ సంద‌ర్భంలో ఆ పాట ఎంతో అవ‌స‌రం అని ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు క‌న్విన్స్ చేయ‌డంతో చివ‌రికి అక్కినేని ఓకే చెప్పారు. ఇల్ల‌రికం ప్రివ్యూ చూసిన అక్కినేని అన్న‌పూర్ణ‌.. ప్రత్యేకించి ‘నిలువవే వాలు క‌నుల‌దానా..’ పాట గురించి ప్ర‌స్తావించారు. పాట చాలా బాగుంద‌ని, ప్రేక్ష‌కుల‌కు కూడా విప‌రీతంగా న‌చ్చుతుంద‌ని చెప్పారు. ఆమె చెప్పిన మాటే నిజ‌మై రాష్ట్రమంత‌టా ఆ పాట మారుమోగిపోయింది.

1971లో విడుద‌లైన ‘ప్రేమ‌న‌గ‌ర్’ చిత్రం అక్కినేని కెరీర్‌లోనే ఓ మైల్ స్టోన్‌లా నిలిచింది. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ సినిమాలోని పాట‌లు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి.  ఎఎన్నార్‌, వాణిశ్రీ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు కె.ఎస్‌.ప్ర‌కాశ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, డి.రామానాయుడు నిర్మించారు. ఆత్రేయ సాహిత్యం అందించ‌గా, కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీతం అందించారు.

హీరో తాగిన మైకంలో ఉండగా, జ్యోతిల‌క్ష్మి అత‌న్ని ఆక‌ర్షించేందుకు ఒక పాట అందుకుంటుంది. ‘లే లే లే నా రాజా’ అంటూ సాగే ఈ పాట‌పై అక్కినేని అభ్యంత‌రం చెప్పారు. దానికి కార‌ణం.. అప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన పాట‌ల‌కు భిన్నంగా సాహిత్యం, సంగీతం ఉండ‌డ‌మే. అందులోనూ అప్ప‌టి మూడ్‌కి ఆ పాట సెట్ అవుతుందా లేదా అనే సందేహం కూడా ఆయ‌న‌లో ఉంది. దీనిపై నిర్మాత రామానాయుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ‌రావు క‌న్విన్స్ చేసిన విధానం అక్కినేనికి న‌చ్చి ఓకే చెప్పారు. ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన ఈ పాట ‘ప్రేమ‌న‌గ‌ర్’ విడుద‌లైన త‌ర్వాత థియేట‌ర్ల‌ను ఊపేసింది. కుర్ర‌కారుకు హుషారు తెప్పించిన ఈ పాట క్ల‌బ్ సాంగ్స్‌లో అతి పెద్ద చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

 

 

 

[akkineni nageswara rao jayanthi, anr jayanthi on sept 20, illarikam movie songs, prema nagar movie songs, anr acted movies]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com