(సెప్టెంబర్ 12 అక్కినేని అమల పుట్టినరోజు సందర్భంగా..)
భారతీయ చిత్రసీమలో తనదైన నటన, సహజ సిద్ధమైన అందంతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ప్రముఖ సీనియర్ నటి అక్కినేని అమల సెప్టెంబర్ 12న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్రపరిశ్రమ ప్రముఖులు, అక్కినేని అభిమానులు ఆమెకు సామాజిక మాధ్యమాల వేదికగా పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వెస్ట్ బెంగాల్‌లోని కలైకుండలో బెంగాలీ అయిన ఎం.కె.ముఖర్జీ, ఐరిష్‌కు చెందిన మీతిమ్ కన్నోలి దంపతులకు జన్మించారు అమల. ఆమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. ఆ ఈ కుటుంబం చెన్నయ్ వచ్చి స్థిరపడింది. అక్కడే అమల పెరిగారు. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో భరతనాట్యం విభాగంలో డిగ్రీ పొందారు.
భరతనాట్య కళాకారిణిగా కెరీర్ ప్రారంభించిన అమల, తమిళ చిత్రం 'మైథిలి ఎన్నై కాదలి' ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా వెలుగొందారు.
తెలుగు తెరపై అక్కినేని నాగార్జునతో కలసి నటించిన 'శివ', 'నిర్ణయం' వంటి చిత్రాలు అమల కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చినప్పటికీ, తనలోని నటిని ఎప్పుడూ సజీవంగానే ఉంచుకున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం అందుకున్నారు. ఇటీవలే వచ్చిన 'ఒకే ఒక జీవితం' సినిమాలో తల్లి పాత్రలో ఆమె ఒలికించిన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను తీవ్రంగా హత్తుకున్నాయి.
కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా రంగంలోనూ అమల ఎంతో చురుగ్గా ఉంటారు. 'బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్' ద్వారా మూగజీవాల పరిరక్షణకు, జంతు సంక్షేమానికి ఆమె చేస్తున్న కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.నేడు అమల పుట్టినరోజు సందర్భంగా అక్కినేని అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమె ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఆమె మరిన్ని మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించాలని అందరూ కోరుకుంటున్నారు.




