ఎస్వీఆర్ ఇస్తానన్న గార్డెన్‌ను ఆయన పోయిన పదిహేనేళ్లకు దక్కించుకున్న శారద!
on Jun 25, 2021

నేడు ఊర్వశి శారద పుట్టినరోజు. విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావుతో కలిసి శారద నటించిన సినిమాలు చాలా తక్కువ. ఆయనతో కలిసి శారద నటించిన మొదటి చిత్రం 'అభిమానవంతులు'. ఆఖరి చిత్రం 'జమీందారుగారి అమ్మాయి'. ఈ చివరి సినిమాలో ఆ ఇద్దరూ తండ్రీకూతుళ్లుగా నటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంతకు ముందు పెద్దగా పరిచయంలేని వాళ్లిద్దరూ 'జమీందారుగారి అమ్మాయి' సినిమాకు పనిచేసిన పది రోజుల్లోనే ఎంతో సన్నిహితులయ్యారు. ఎస్వీఆర్ ఎప్పుడూ "అమ్మాయీ, అమ్మాయీ.." అని పిలుస్తూ ఎంతో ప్రేమనీ, ఆప్యాయతనీ ప్రదర్శిస్తూ ఆమెను సొంత కూతురిలా చూసుకునేవారు.
ఆ సందర్భంలో శారదతో ఆయన ఓ మాట అన్నారు.. "కేళంబాకంలో నాకో గార్డెన్ ఉంది. దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు వీలుకావడం లేదు. ఆ గార్డెన్‌ను నీకిచ్చేస్తాను. నువ్వయితే బాగా చూసుకోగలవు" అని. ఆయనలా అనడం చూసి శారద నవ్వుకొనేవారు. పదిరోజుల్లోనే తండ్రీకూతుళ్లలాగా ఇంత దగ్గరవ్వడం చూసి, ఇంతకాలంగా ఫీల్డులో ఉంటూ ఎప్పుడూ ఇంత దగ్గర కాలేకపోయాం ఎలా?.. అని ఆ ఇద్దరికీ అనిపించేది.
ఇది జరిగిన కొద్ది రోజులకే ఎస్వీఆర్ కన్నుమూశారు. ఆయన మరణవార్త శారదకు శరాఘాతం. ఆ తర్వాత పదిహేనేళ్లకు రంగారావుగారి గార్డెన్స్‌ను ఆమె తీసుకున్నారు. అది తన అమ్మమ్మ పేరిట ఆమె కొన్నారు. ఆ గార్డెన్స్‌కు ఎస్వీ రంగారావు పేరు ఉండేది. ఆయన పేరును తీసేయాలంటే బాధనిపించి, అలాగే ఉంచేశారు శారద. "ఆయన ఎప్పుడో ఇస్తానన్న గార్డెన్, ఆయన పోయిన పదిహేనేళ్లకు మళ్లీ నాకే లభించడం అనేది ఒక చిత్రమైన అనుభూతిని కలిగించే సందర్భం. ఆయన ఆప్యాయతనీ, అభిమానాన్నీ గుర్తచేసే సందర్భంగా భావిస్తుంటాను." అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శారద.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



