విదేశాలకు వెళ్లినా ఇదే డైట్.. 75 ఏళ్ల రజినీకాంత్ హెల్త్ సీక్రెట్ ఇదే!
on Dec 11, 2025
(డిసెంబర్ 12 రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా..)
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనేది ఏ రంగంలో ఉన్నవారికైనా అవసరమే. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రస్తుతం తాము ఏ స్థితిలో ఉన్నామో చూసుకొని ఆనందించడం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన మూలాలు ఏమిటి అనేది గుర్తెరిగి ప్రవర్తించడంలోనే పరమార్థం ఉంటుంది. అలా ఆలోచించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో సూపర్‌స్టార్ రజినీకాంత్ ఒకరు. ఒక సాధారణ వ్యక్తి నుంచి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకొని ఒక శక్తిగా ఎదిగినప్పటికీ తనేమిటో, తనకున్న పరిధులేమిటో రజినీకి పూర్తిగా తెలుసు. అందుకే హంగు, ఆర్భాటాల జోలికి వెళ్ళకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకే ఆయన ఇష్టపడతారు.
స్టార్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారెవరైనా ఎంతో లగ్జరీగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. వారు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతీ విషయంలోనూ అది కనిపిస్తుంది. కానీ, రజినీకాంత్ జీవితం వేరు, ఆయన వ్యక్తిత్వం వేరు, ఆయన జీవన విధానం వేరు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆయన దిన చర్య గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. స్టార్స్ ఇలా కూడా ఉంటారా అనిపించేలా తన రోజును గడుపుతారు రజినీ.
ఉదయం నిద్ర లేవగానే రాగి చెంబులోని నీరు తాగుతారు. ఆ తర్వాత యోగా, మెడిటేషన్ చేస్తారు. టిఫిన్‌కి బదులుగా ఫ్రూట్స్ తింటారు. ఆరోజు షూటింగ్‌కి వెళ్లాల్సి వస్తే ఓట్స్‌ని టిఫిన్‌గా తీసుకుంటారు. మధ్యాహ్నం లంచ్‌లో పుల్కాలు, కొంచెం రైస్ మాత్రమే తీసుకుంటారు. ఆయన దిన చర్యలో స్నాక్స్ అనే మాటకు తావులేదు. ఇక డిన్నర్‌లో ఫ్రూట్స్ లేదా స్ప్రౌట్స్ తీసుకుంటారు. షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లినా ఇదే మెనూ మెయిన్‌టెయిన్ చేస్తారు.
ఆయన బెడ్‌రూమ్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. గది అంతా దేవుని పటాలతో నిండి ఉంటుంది. రజినీ పడుకునేందుకు నేలపై ఒక మామూలు పరుపు, నూలు తాళ్ళతో అల్లిన మంచం ఉంటుంది. నిద్రపోయేందుకు వాటినే వినియోగిస్తుంటారు. ఆయనకు భక్తి భావం ఎక్కువ. తన ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు ఏదో ఒక దేవాలయానికి వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటారు. అలా తిరుమలకు కూడా ఎన్నోసార్లు వచ్చారు.
సంవత్సరంలో ఒకసారి తన స్నేహితులతో కలిసి ఏదో ఒక వెకేషన్‌కి వెళ్తారు. ఆ సమయంలో ఎంతో సాధారణమైన దుస్తుల్లో ఉంటారు. తను స్టార్ అవ్వకముందు ఎంత సింపుల్‌గా ఉండేవారో అదే తరహా డ్రెస్ వేసుకుంటారు. ప్రయాణం మధ్యలో ఏదైనా తినాల్సి వస్తే రోడ్డు పక్కనే తన స్నేహితులతో కలిసి తింటారు. ఆ సమయంలో రజినీని చూసిన వారికి అతనో సూపర్‌స్టార్‌లా కాకుండా సామాన్య వ్యక్తిగా కనిపిస్తారు.
రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రాఘవేంద్రస్వామి, మహావతార్ బాబాజీ, రమణ మహర్షిలను తన గురువులుగా భావిస్తారు రజినీ. అందుకే రాఘవేంద్రస్వామి చిత్రాన్ని తనే స్వంతంగా నిర్మించారు. అలాగే మహావతార్ బాబా గురించి ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో బాబా చిత్రానికి కథ అందించారు. ఇప్పటికీ అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లి అక్కడి సాధువులను, స్వాములను కలుసుకుంటూ ఉంటారు. వారి నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటారు.
రజినీకాంత్ పెళ్లి కూడా ఎంతో విచిత్రంగా జరిగింది. ఆయనకు స్టార్‌డమ్ వచ్చిన తర్వాత తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎంతో మంది ధనికులు ప్రయత్నించారు. కానీ, వాళ్ళను సున్నితంగా తిర్కరించారు. ఒక కాలేజీ తరఫున రజినీని ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన లతా రంగాచారిని వివాహం చేసుకున్నారు రజినీ.
సాధారణంగా స్టార్ హీరోలు కొన్ని సందర్భాల్లో విరాళాలు అందిస్తుంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఇవన్నీ మనం మీడియా ద్వారా తెలుసుకుంటాం. కానీ, రజినీకాంత్ పద్ధతి అది కాదు. తను స్టార్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో దానాలు చేశారు. కానీ, ఒక్కటి కూడా ప్రచారంలోకి రాదు. అది ఆయనకు ఇష్టం ఉండదు. తాను చేసిన దానాన్ని ప్రచారం చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అనేది ఆయన అభిప్రాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



