ENGLISH | TELUGU  

బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌స్టార్‌గా.. రజినీకాంత్‌ 50 ఏళ్ళ సినీ ప్రస్థానం ఎలా సాగిందంటే..!

on Aug 15, 2025

ఒక సాధారణ బస్‌ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి ఇండియాలోనే చెప్పుకోదగ్గ నటుడిగా ఎదిగారు రజినీకాంత్‌. తలైవా అనీ, సూపర్‌స్టార్‌ అనీ రజినీని అభిమానులు పిలుచుకుంటారు. రజినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హీరోయిజానికి, స్టైల్‌కి కొత్త నిర్వచనం చెప్పారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పరుచుకొని ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. నటన కంటే తన లుక్‌తో, రకరకాల మేనరిజమ్స్‌తో ఆడియన్స్‌ని కట్టిపడెయ్యడం రజినీకి వెన్నతో పెట్టిన విద్య. 1975 ఆగస్ట్‌ 15న విడుదలైన తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకొని అప్పటి నుంచి ఇప్పటివరకు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్‌ జూబ్లీని జరుపుకుంటున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సినీ జీవితం ఎలా ప్రారంభమైంది, ఎలాంటి విజయాలు ఆయన సొంతం చేసుకున్నారు వంటి విషయాలు తెలుసుకుందాం.

1950 డిసెంబర్‌ 12న అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించారు రజినీకాంత్‌. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. రజినీకాంత్‌ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. వీరు మహారాష్ట్ర, పుణె సమీపంలోని మావడి కడెపత్తార్‌ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజినీకాంత్‌ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్‌ బాలూభాయి. 1956లో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్‌లో స్థిరపడిరది. 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు రజినీకాంత్‌. 

రజినీకాంత్‌ గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. చిన్నతనంలో చురుకైన విద్యార్థిగా ఉండేవారు. క్రికెట్‌, ఫుట్‌ బాల్‌, బాస్కెట్‌ బాల్‌ వంటి ఆటల మీద ఆసక్తి కలిగి ఉండేవారు. ఇదే సమయంలో రజినీకాంత్‌ సోదరుడు ఆయన్ని రామకృష్ణ మఠంలో చేర్పించారు. అక్కడ ఆయనకు వేదాల గురించి, సంప్రదాయాల గురించి, చరిత్ర గురించి బోధించేవారు. దాంతో ఆయనకు చిన్నతనంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగింది. ఆధ్యాత్మిక పాఠాలతో పాటు నాటకాలలో కూడా పాల్గొనేవారు. అలా నటన పట్ల క్రమంగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది.

పాఠశాల విద్య పూర్తయిన తర్వాత రజనీకాంత్‌ ఎన్నో పనులు చేశారు. కూలీగా కూడా పనిచేశారు. తర్వాత బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌లో బస్‌ కండక్టర్‌గా ఉద్యోగం లభించింది. నటనపై తనకున్న ఆసక్తితో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అతని నిర్ణయానికి కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ, అతని స్నేహితుడు రాజ్‌ బహదూర్‌తోపాటు మరికొందరు స్నేహితులు ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే దర్శకుడు కె.బాలచందర్‌ అతని ప్రతిభను గుర్తించారు. అప్పటికే తమిళ్‌లో శివాజీ గణేశన్‌ హీరోగా ఉండడంతో శివాజీ పేరును రజినీకాంత్‌గా మార్చారు. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రంలోని ఓ పాత్ర పేరును రజినీకి పెట్టారు. ఆ తర్వాత బాలచందర్‌ సలహాతో తమిళ్‌ నేర్చుకున్నారు రజినీ. 

కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్‌ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు రజినీకాంత్‌. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శ్రీవిద్య మాజీ భర్తగా రజినీకాంత్‌ చిన్నపాత్ర చేశారు. ఈ సినిమాలోని రజినీకాంత్‌ నటనను అందరూ ప్రశంసించారు. ఆ తర్వాత 1976లో పుటన్న కణగల్‌ దర్శకత్వంలో వచ్చిన కథాసంగమ చిత్రంలో రౌడీగా నటించారు. అదే సంవత్సరం బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా అంతులేని కథ రజినీకి నటుడిగా చాలా మంచి పేరు తెచ్చింది. అలా వరసగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. సిగరెట్‌ని గాలిలోకి ఎగరేసి కాల్చే స్టైల్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. 1977లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన అవర్‌గళ్‌, భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 16 వయదినిలే చిత్రాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు పోషించారు. తెలుగులో రజినీకాంత్‌ హీరోగా నటించిన మొదటి సినిమా చిలకమ్మ చెప్పింది. 

రజినీకాంత్‌ ఎక్కువగా తమిళ్‌ సినిమాలే చేసినప్పటికీ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా తెలుగులో రజినీకి వీరాభిమానులున్నారు. సూపర్‌స్టార్‌గా ఒక రేంజ్‌ సంపాదించుకున్న తర్వాత తమిళ్‌లో అయినా, తెలుగులో అయినా రజినీకాంత్‌ సినిమా రిలీజ్‌ అవుతోందంటే అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇండియాలోనే కాకుండా తన సినిమాలతో జపాన్‌ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నారు రజినీ. జపాన్‌లో ఆయనకు లెక్కకు మించిన అభిమానులున్నారు. తన ఇమేజ్‌కి తగిన కథలు ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. ముత్తు, బాషా, నరసింహ, చంద్రముఖి, రోబో వంటి సినిమాలు రజినీ కెరీర్‌లో ఎవర్‌గ్రీన్‌ హిట్స్‌గా నిలిచాయి. 74 ఏళ్ళ వయసులోనూ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలకు సైతం పోటీనిస్తున్నారు రజినీకాంత్‌.

50 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ళకుండా మంచి మనసున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు రజినీ. అతనిలో అభిమానులకు నచ్చేది అతని సింప్లిసిటీ. సాటి మనిషిని గౌరవించడంలో రజినీ ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఇండియాలోనే హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌ అందుకుంటున్న వారిలో మొదటివారిగా నిలిచారు రజనీకాంత్‌. యంగ్‌ డైరెక్టర్లు రజినీకాంత్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని కలలు కంటూ ఉంటారు. ఈమధ్యకాలంలో రజినీ చేసిన సినిమాలన్నీ యంగ్‌ డైరెక్టర్స్‌ రూపొందించినవే కావడం విశేషం. రజినీకాంత్‌ గోల్డెన్‌ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా ‘కూలీ’ చిత్రం విడుదలై మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.