Home

»

Featured News

మూవీ మొఘ‌ల్ డి.రామానాయుడికి పున‌ర్జన్మ నిచ్చిన ‘ప్రేమనగర్’ చిత్రానికి 55 ఏళ్లు.!

Sep 24, 2026 8:04PM

తెలుగు సినీ ప్రస్థానంలో క్లాసిక్ చిత్రాల ప్రస్తావన వస్తే 'ప్రేమనగర్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. 1971 సెప్టెంబ‌ర్ 24న విడుదలైన ఈ సంచలన చిత్రం 55 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. తెలుగు చిత్రసీమలోని ఎన్నో రికార్డులను తిరగరాయడమే కాకుండా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. అసలు ఈ బ్లాక్ బస్టర్ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన వెనుకటి కథలు, తెరవెనుక జరిగిన విశేషాలు ప్రతి సినీ అభిమానికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

నిజానికి  'ప్రేమనగర్' చిత్రాన్ని ప్రముఖ నవలా రచయిత్రి తారకపూడి కౌసల్యదేవి రాసిన నవల ఆధారంగా నిర్మించారు. మొదట ఈ సినిమా హక్కులను తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేసి, అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, వి. మధుసూదనరావు దర్శకత్వంలో, కేఆర్ విజయ కథానాయికగా సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. స్క్రిప్ట్ పనులు కూడా ఆచార్య ఆత్రేయ ఆధ్వర్యంలో మొదలయ్యాయి. కానీ, అనుకోకుండా ఆ ప్రొడ్యూసర్ కి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు రావడంతో ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఆగిపోయింది.

అదే సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. రామానాయుడు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఆయన నిర్మించిన బొమ్మలు చెప్పిన కథ, ప్రతిజ్ఞా పాలన, సిపాయి చిన్నయ్య, అలాగే ద్రోహి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ముఖ్యంగా జగ్గయ్యతో తీసిన 'ద్రోహి' సినిమా 'దసరా బుల్లోడు' ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. దసరా బుల్లోడు హవాకు చుట్టుపక్కల విడుదలైన 3-4 సినిమాలు కొట్టుకుపోయాయి. విజయవాడ నవయుగ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో డిస్ట్రిబ్యూటర్లు "మా పెట్టుబడి వచ్చేస్తుంది, మీ డబ్బులే అనుమానం" అని చెప్పడంతో రామానాయుడు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది తన సినీ ప్రయాణంలో చివరి ప్రయత్నమని, ఈ సినిమా ఫలితాన్ని బట్టి ఇండస్ట్రీలో కొనసాగాలా లేదా మానేయాలా అనేది తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ సమయంలో రామానాయుడు..  ఏఎన్నార్‌ని కలిసి తన పరిస్థితిని వివరించారు. దసరా బుల్లోడు బడ్జెట్ కంటే మరొక ₹1,00,000 (ఒక లక్ష రూపాయలు) ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే ఒక లైఫ్ అండ్ డెత్ ప్రాజెక్ట్ చేస్తానని కోరారు. అప్పుడు ఏఎన్నార్..  రామానాయుడుకి ఈ  'ప్రేమనగర్'  నవల గురించి చెప్పి ఆత్రేయతో మాట్లాడమని సలహా ఇచ్చారు. కథ నచ్చడంతో రామానాయుడు తనకు సెంటిమెంట్ ఉన్న దర్శకుడు కె.ఎస్.ప్రకాష్‌రావుని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు. కథానాయికగా దసరా బుల్లోడు జోడీ అయిన వాణిశ్రీని తీసుకున్నారు.

ఈ సినిమా తయారీలో పాటల విషయంలో ఆసక్తికర ఘట్టాలు జరిగాయి. సినిమా ఓపెనింగ్ బర్త్ డే సాంగ్ 'నేను పుట్టాను లోకం మెచ్చింది' పాట రాయడానికి మొదట ఆత్రేయ నిరాకరించారు. రెగ్యులర్ హ్యాపీ బర్త్ డే పాటలు రాయనని అనడంతో వేరే రచయితతో రాయించారు. కానీ అది సరిగ్గా కుదరకపోవడంతో 15 రోజుల కసరత్తు తర్వాత మళ్లీ ఆత్రేయ దగ్గరకే వెళ్లగా, ఆయన 'నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది' అనే అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అలాగే 'మనసు గతి ఇంతే' పాట ట్యూన్ విషయంలో ఏఎన్నార్  స్వయంగా జోక్యం చేసుకుని, సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ తో మాట్లాడి ఆత్రేయ ద్వారా మరింత లోతుగా తిరగరాయించారు.

సినిమా ఓపెనింగ్ షాట్‌లో దువ్వూరి రామిరెడ్డి 'అంతము లేని ఈ భువనమంతా' అనే పద్యాన్ని ఘంటసాలతో విమానం బ్యాక్ డ్రాప్ లో పాడించి అద్భుతమైన క్లాసిక్ లుక్ ఇచ్చారు. ఆత్రేయ రాసిన 'తేట తేట తెలుగులా', 'ఎవరి కోసం' వంటి పాటలతో పాటు 'లేలే లేలే నా రాజా' అనే ఐటమ్ సాంగ్ కూడా అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయ్యి విపరీతమైన జనాదరణ పొందింది. కేవీ చలం, రాజబాబు, రమాప్రభల కామెడీ ట్రాక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

మొత్తానికి 1971 సెప్టెంబర్ 24న విడుదలైన  'ప్రేమనగర్'  సినిమా 'దసరా బుల్లోడు' రికార్డులను సైతం తుడిచిపెట్టేసి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. రాముడు భీముడు, ప్రేమ నగర్ సినిమాలు తన రెండు కళ్ళు అని రామానాయుడు చెప్పేవారు. ఈ చిత్రం రిపీట్ రన్స్ లో కూడా దాదాపు 5-6 రోజుల పాటు థియేటర్లను హౌస్ ఫుల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కాసుల వర్షం కురిపించింది. దశాబ్దాలు గడిచినా  'ప్రేమనగర్' చరిత్ర సృష్టించిన విధానం తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ చిరస్మరణీయమే!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com