ఇటీవలికాలంలో కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు, పాత్రల రూపకల్పన విషయంలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇది కొన్ని దశాబ్దాల కాలం క్రితమే ఉందని 1972లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రం వల్ల తెలుస్తోంది. ఈ సినిమాలో శోభన్‌బాబు శ్రీరాముడిగా నటించారు. వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాపు తనదైన దృశ్యశైలిలో ఈ కథను తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా విషయంలో అప్పట్లో ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రామాయణంలో వానరులు కీలక పాత్ర పోషిస్తారు. రాముడికి అండగా నిలిచిన వానర వీరుల గురించి, వారి కుటుంబాల గురించి కూడా కథలో ప్రస్తావనలు ఉంటాయి. అయితే సినిమాలో వానరుల భార్యలను పూర్తిగా వానర రూపంలో కాకుండా మానవ రూపంలో చూపించడంపై కొందరు సందేహం వ్యక్తం చేశారు. అదే విషయాన్ని బాపు దృష్టికి తీసుకెళ్లారు.
దీనికి బాపు చెప్పిన సమాధానం అప్పటి సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది. ‘వానరులు కామరూపులు అని పురాణాలు చెప్తున్నాయి. వారు ఏ రూపం కావాలని కోరుకుంటే ఆ రూపంలో ఉండే అవకాశం ఉంది. అందుచేత వానరుల భార్యలను మనుషుల రూపంలో చూపించడం జరిగింది. అదీకాక, ఒక స్త్రీ రూపానికి కోతి ముఖం పెడితే బాగుండదు. అందుకే వానరుల భార్యలను నరరూపాల్లో చూపించాం’ అని సమాధానమిచారు. దీన్నిబట్టి కథా సందర్భానికి, తెరపై పాత్రల ప్రదర్శనకు అనుగుణంగా ఆ రూపకల్పన చేశారని తెలుస్తోంది.
సినిమా అనేది కేవలం పుస్తకంలోని ప్రతి అంశాన్ని యథాతథంగా తెరపైకి తీసుకురావడం మాత్రమే కాదని, దృశ్య మాధ్యమానికి అనుగుణంగా కొన్ని విషయాలను ఎలా చూపించాలన్నది కూడా ముఖ్యమే అన్నది బాపు ఆలోచనగా కనిపిస్తుంది. రామాయణాన్ని తెరకెక్కించేటప్పుడు కథకు ఉన్న భక్తి భావాన్ని కాపాడుతూనే, ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా పాత్రలను మలచడం ఆయన ప్రత్యేకత.
‘సంపూర్ణ రామాయణం’ విషయంలో ప్రారంభం నుంచే ఎన్నో చర్చలు జరిగాయి. అప్పటికే ఎన్టీఆర్ శ్రీరాముడిగా ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసుకున్న సమయంలో, శోభన్‌బాబును రాముడిగా చూపించడం కూడా బాపు-రమణల సాహసంగా చెప్పుకున్నారు. అయినప్పటికీ సినిమా తనదైన ప్రత్యేకతతో గుర్తింపు తెచ్చుకుంది.
అలా చూస్తే.. దశాబ్దాల క్రితం తెరకెక్కిన ఒక పౌరాణిక సినిమాలోని చిన్న దృశ్య రూపకల్పనపై వచ్చిన ప్రశ్నకు బాపు ఇచ్చిన సమాధానం కూడా ఆయన సినిమాను ఎంత ఆలోచనతో రూపొందిస్తారు అనే విషయానికి నిదర్శనంగా నిలిచింది.
[Bapu interesting answer on sampoorna ramayanam movie, sobhan babu, chandrakala, sv ranga rao, sampoorna ramayanam movie, director bapu]




