కొన్ని సినిమాలు విడుదలై ఏళ్లు గడిచినా.. అందులోని కొన్ని కామెడీ సీన్లు, డైలాగులు మాత్రం ప్రేక్షకుల మదిలో అలాగే ఉండిపోతాయి. అలాంటి వాటిలో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలోని ‘వద్దు సరోజా వద్దు’ కామెడీ సీన్ కూడా ఒకటి. యశో సాగర్, స్నేహా ఉల్లాల్ జంటగా నటించిన ఈ సినిమా 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఏ. కరుణాకరణ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలోని ‘వద్దు సరోజా’ ఎపిసోడ్ వెనుక తన నిజ జీవితంలోని ఓ సంఘటన ఉందని దర్శకుడు తాజాగా వెల్లడించారు.
కరుణాకరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1994లో చెన్నయ్‌లోని కేకే నగర్‌లో నా స్నేహితుడు, బిచ్చగాడు దర్శకుడు శశితో కలిసి టిఫిన్ చేసేందుకు ఒక బండి దగ్గరకి వెళ్లాం. అక్కడ ఒక వ్యక్తి టిఫిన్ చేసి గొడవ చేశాడు. దాంతో ఆ టిఫిన్ బండి ఓనర్ భార్యకు బాగా కోపం వచ్చింది. ఆ గొడవ చేసే వ్యక్తిని చితక బాదింది. అది సినిమాలో పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ కుదరలేదు. చివరికి ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో పెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నారు.
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ విడుదలైన తర్వాత ‘వద్దు సరోజా’ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఈ సీన్ డబ్బింగ్ సమయంలో సౌండ్ ఇంజినీర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారని అప్పట్లో కరుణాకరణ్ వెల్లడించారు. సినిమాలో ఈ ఎపిసోడ్‌కు మంచి స్పందన రావడంతో ఆ డైలాగ్ దర్శకుడి కెరీర్‌లో గుర్తుండిపోయే కామెడీ ట్రాక్‌గా నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం. యశో సాగర్, స్నేహా ఉల్లాల్‌తో పాటు సునీల్, బ్రహ్మానందం, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని కామెడీ, సంగీతం అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘వద్దు సరోజా’ ఎపిసోడ్ మాత్రం ఇప్పటికీ తెలుగు సినిమా కామెడీ సన్నివేశాల్లో గుర్తుండిపోయే ట్రాక్‌గా నిలిచింది.
[Ullasanga Utsahanga, Vaddu Saroja Vaddu, Vaddu Saroja Comedy, Karunakaran, A Karunakaran, Yasho Sagar, Sneha Ullal, Ullasanga Utsahanga Comedy, Telugu Cinema, Tollywood News, Vaddu Saroja Scene, Karunakaran Interview]




