ENGLISH | TELUGU  

ఘంటసాల పాదాలకు నమస్కరించి క్షమించమని వేడుకున్న ఎన్‌.టి.ఆర్‌.. ఎందుకో తెలుసా?

on Nov 25, 2024

ఒక సినిమా నిర్మాణం వెనుక ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషి ఉంటుంది. అన్ని శాఖల వారి సహకారంతోనే సినిమా తయారవుతుంది. విడుదలకు ముందు ఆ సినిమాకి పనిచేసిన వారందరి పేర్లను టైటిల్స్‌లో వేస్తారు. ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకున్న తర్వాతే వారి పేర్లను పంపిస్తారు. పొరపాటు అనేది మానవ సహజం. ఎవరెన్నిసార్లు చెక్‌ చేసినా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘోరమైన పొరపాటు అమర గాయకుడు ఘంటసాల విషయంలో జరిగింది. అది కూడా ఒక కళాఖండంలాంటి సినిమాకి జరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 

ఎన్‌.టి.రామారావు సొంత నిర్మాణ సంస్థ అయిన నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ పతాకంపై ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రాన్ని నిర్మించారు ఎన్‌.త్రివిక్రమరావు. ఈ చిత్రం ఆరోజుల్లో పెద్ద సంచలనం సృష్టించింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి టి.వి.రాజు సంగీతాన్నందించారు. ఈ చిత్రంలో పాటలు, పద్యాలు కలిపి 22 ఉంటాయి. సముద్రాల జూనియర్‌ వీటిని రచించారు. 10 పాటలను ఘంటసాల గానం చేశారు. వాటిలో ‘అమ్మా అని అరచినా..’, ‘జయ కృష్ణా ముకుందా మురారి..’ ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్‌గా చెప్పొచ్చు. ఇప్పటికీ వింటున్నారు, పాడుకుంటున్నారు అంటే ఆ పాటలు జనంలోకి ఎంతగా వెళ్ళాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ‘జయ కృష్ణా ముకుందా మురారి’ పాటను వింటే ఆనందంతో పరవశించిపోని వారుండరు. అంతగా లీనమై ఆ పాటకు ప్రాణం పోశారు ఘంటసాల. ఈ సినిమాలోని పాటలకు అంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఘంటసాలకు తీరని అన్యాయం జరిగింది. 

సినిమా ప్రారంభంలో వచ్చే టైటిల్‌ కార్డ్స్‌లో ఘంటసాల పేరు కనిపించదు. ఆయన పేరే కాదు, సుశీల, పిఠాపురం, మాధవపెద్ది సత్యం, ఎం.ఎస్‌.రామారావు, నాగయ్య, పి.లీల వంటి వారి పేర్లు కూడా కనిపించవు. అసలు సింగర్స్‌ టైటిల్‌ కార్డే మిస్‌ అయింది. జరిగిన పొరపాటు తెలుసుకున్న ఎన్టీఆర్‌ ఎంతో బాధపడ్డారు. వెంటనే ఘంటసాల ఇంటికి వెళ్ళి క్షమించమని వేడుకున్నారు. 1949లో ‘మనదేశం’ చిత్రంతో నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్‌కు ఆ తర్వాత కూడా కొన్ని పాటలు పాడారు ఘంటసాల. అయితే ఎన్టీఆర్‌ను మాస్‌ హీరోగా నిలబెట్టిన ‘పాతాళభైరవి’ చిత్రంలోని పాటలు అద్భుతంగా స్వరపరిచి గానం చేశారు ఘంటసాల. ఆ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌ హీరోగా బిజీ అయ్యారు. అలాగే ఘంటసాల కూడా సంగీత దర్శకుడుగా, గాయకుడిగా వరస అవకాశాలు దక్కించుకున్నారు. 

ఘంటసాల మాస్టారంటే ఎన్టీఆర్‌కు ఎంతో అభిమానం, గౌరవం. తన సినిమాలు ప్రజాదరణ పొందడానికి ఘంటసాల పాటలు కూడా ఒక కారణమని ఎన్టీఆర్‌ నమ్మేవారు. ఒకసారి దేశ రక్షణ నిధి కోసం సినిమా పరిశ్రమ తరఫున ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని అనుకున్నారు. అప్పుడు మొదట ఘంటసాల ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్‌ ఆయనకు విషయం చెప్పారు. ఎలా చేస్తే బాగుంటుందో సలహా చెప్పమన్నారు. దానికి ఘంటసాల ‘నేను మీ వెనుక వుంటాను. నేను కంజరతో పాట పాడతాను, మీరు జోలె పట్టండి. ఊరూరు తిరిగి విరాళాలు సేకరిద్దాం’ అన్నారు. ఎంతో ప్రోత్సాహకంగా ఆయన చెప్పిన మాటలకు ఎన్టీఆర్‌ కదిలిపోయారు. వెంటనే ఆయన పాదాలకు సమస్కరించారు. ఒక మంచి కార్యానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్‌తో ఘంటసాలకు ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అందుకే ఎన్టీఆర్‌తో ‘సొంతవూరు’ అనే సినిమాను నిర్మించారు ఘంటసాల. 1956లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.