ENGLISH | TELUGU  

సినిమా పాటకు కొత్త అర్థం చెప్పిన మధుర స్వరాల విశ్వనాథన్‌!

on Jul 14, 2025

(జూలై 14 ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ వర్థంతి సందర్భంగా..)

ఏ సినిమాకైనా కథ, కథనాల తర్వాత సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఎమోషన్‌ అయినా సంగీతం ద్వారానే ప్రేక్షకుల మనసుల్లోకి చేరుతుంది. సినిమా ఎంత బాగా తీసినా సందర్భానుసారం వచ్చే పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల పూర్తి స్థాయిలో సినిమా అనుభూతి కలుగుతుంది. సినిమా పుట్టిన నాటి నుంచి ఎంతో మంది సంగీత దర్శకులు తమదైన శైలిలో పాటలు చేస్తూ ప్రేక్షకులకు మధురానుభూతిని కలిగిస్తున్నారు. అలాంటి సంగీత దర్శకుల్లో ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ ఒకరు. అందరూ మధుర స్వరాల విశ్వనాథన్‌ అని పిలుచుకునే ఎం.ఎస్‌.విశ్వనాథన్‌.. సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్నారు. ఇది విశ్వనాథన్‌ చేసిన పాట అని అందరూ గుర్తుపట్టేలా ఆయన స్వరాలు సమకూర్చేవారు. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులుగా వెలుగొందుతున్న ఎంతో మందికి ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ ఆదర్శం. కొందరు ఆయన దగ్గర శిష్యరికం చేసి సంగీతంలోని ఎన్నో మెళకువలు తెలుసుకున్నారు. 50 సంవత్సరాల కెరీర్‌లో తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 700 సినిమాలకు సంగీతాన్నందించారు. తన పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ కెరీర్‌ గురించి, ఆయన స్వరపరిచిన మధురగీతాల గురించి తెలుసుకుందాం. 

1928 జూన్‌ 24న కేరళలోని ఎలప్పుల్లి గ్రామంలో సుబ్రమణియన్‌, నారాయణి దంపతులకు జన్మించారు ఎం.ఎస్‌.విశ్వనాథన్‌. ఆయన మాతృభాష మలయాళం. నాలుగేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయిన విశ్వనాథన్‌.. తన మేనమామ దగ్గర పెరిగారు. థియేటర్‌లో బఠాణీలు అమ్ముతూ, సినిమా పాటలు వింటూ సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లే దారిలో నీలకంఠ భాగవతార్‌ అనే మాస్టారు పిల్లలకు సంగీతం నేర్పుతుంటే శ్రద్ధగా విని వంటబట్టించుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే హార్మోనియం నేర్చుకొని దాన్ని వాయిస్తూ పాటలు పాడేవారు. అది చూసిన నీలకంఠ భాగవతార్‌.. అతనిలోని కళాకారుడ్ని గుర్తించారు. మూడు గంటలపాటు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మద్రాస్‌ చేరుకొని జూపిటర్‌ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేశారు విశ్వనాథన్‌. మరికొన్నాళ్లకు గురుముఖంగా సంగీతం నేర్చుకొని ప్రముఖ సంగీత దర్శకుడు సి.ఆర్‌.సుబ్బరామన్‌ దగ్గర హార్మోనియం ప్లేయర్‌గా చేరారు. అక్కడే టి.కె.రామ్మూర్తి పరిచయమయ్యారు. ఈ ఇద్దరూ కొంతకాలం సి.ఆర్‌.సుబ్బరామన్‌ దగ్గర పనిచేశారు. 

1950 నుంచి 1965 మధ్యకాలంలో ‘విశ్వనాథన్‌ రామ్మూర్తి’ పేరుతో ఇద్దరూ కలిసి తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో దాదాపు 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆరోజుల్లో వీరి పాటలను ప్రజలు ఎంతో ఆదరించేవారు. ‘సంతోషం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘ఇంటికి దీపం ఇల్లాలే’, ‘మంచి-చెడు’, ‘ఆడబ్రతుకు’, ‘కర్ణ’ వంటి సినిమాల్లో వీరు చేసిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1965లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ సోలోగా సినిమాలు చేశారు. ఆయన సారధ్యంలో ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ వచ్చాయి. లేతమనసులు, మనసే మందిరం, భలే కోడలు, సత్తెకాలపు సత్తెయ్య, సిపాయి చిన్నయ్య, అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది, మరో చరిత్ర, సింహబలుడు, అందమైన అనుభవం, ఇదికథ కాదు, గుప్పెడు మనసు వంటి ఎన్నో సినిమాల్లో తన పాటలతో అలరించారు విశ్వనాథన్‌. 

కె.బాలచందర్‌ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలకు సంగీతం అందించిన ఘనత ఎం.ఎస్‌.విశ్వనాథన్‌కి దక్కుతుంది. ‘ఏ తీగ పూవునో..’, ‘భలే భలే మగాడివోయ్‌, ‘పల్లవించవా నా గొంతులో’, ‘సరిగమలు గలగలలు’, ‘కుర్రాళ్ళోయ్‌ కుర్రాళ్ళోయ్‌ వెర్రెక్కి ఉన్నోళ్ళు’, ‘కన్నెపిల్లవని కన్నులున్నవని..’, ‘పదహారేళ్ళకు..నీలో నాలో’, ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’, ‘కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’, ‘అరె ఏమిటి లోకం’.. వీరి కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని సూపర్‌హిట్‌ సాంగ్స్‌. విశ్వనాథన్‌ చేసిన పాటలు పాడడం ద్వారానే ఎల్‌.ఆర్‌.ఈశ్వరి బాగా పేరు తెచ్చుకున్నారు. అలాగే కొందరు గీత రచయితలు కూడా విశ్వనాథన్‌ పాటల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

50 సంవత్సరాల కెరీర్‌లో ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ నాలుగు భాషల్లో 700 సినిమాలకు సంగీతం అందించారు. అందులో 500కి పైగా తమిళ్‌ సినిమాలే ఉన్నాయి. తెలుగులో ఆయన 70 సినిమాలు చేశారు. అంతకుముందు రామ్మూర్తితో కలిసి 100 సినిమాలకు సంగీతం అందించారు. విశ్వనాథన్‌పై ఉన్న అభిమానంతో తమిళ ప్రేక్షకులు ఆయన్ని ‘మెల్లిసై మన్నార్‌’ అని పిలుచుకునేవారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. విశ్వనాథన్‌ను ‘తిరై ఇసై చక్రవర్తి’ అని బిరుదుతో సత్కరించి 60 బంగారు నాణాలు ఆయనకు బహూకరించారు. సినీ సంగీత ప్రియులను తన సంగీతంతో ఓలలాడించిన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ 2015 జూలై 14న కన్నుమూశారు. భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన స్వరపరిచిన పాటలు సంగీత ప్రియుల మనసుల్లో సుస్థిరంగా ఉండిపోతాయి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.