అమలా పాల్ ఫ్యామిలీ గురించి మీకెంతవరకు తెలుసు?
on Aug 12, 2021

మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్ తమిళ డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్‌ను ప్రేమించి పెళ్లాడింది. 2014లో వారి పెళ్లయితే, 2017లో విడిపోయారు. కలతలు, కలహాలతోటే వారి కాపురం కూలిపోయింది. తర్వాత విజయ్ మరో పెళ్లిచేసుకొని సంసార జీవితం గడుపుతున్నాడు. అమల మాత్రం అప్పట్నుంచీ సింగిల్‌గానే ఉంటోంది. మళ్లీ ఎవరితోనూ ప్రేమలో పడినట్లు కనిపించలేదు. అసలు అమలా పాల్ ఫ్యామిలీ గురించి మీలో ఎంతమందికి తెలుసు?
ఎర్నాకుళంలో 1991 అక్టోబర్ 26న పుట్టింది అమల. ఆమె తల్లిపేరు అన్నీస్. ఆమె గృహిణి. బంధుమిత్రల్లో ఆమెకు గాయనిగా మంచి పేరుంది. ఎప్పుడూ ఏదో పాట పాడుతూ కనిపిస్తారామె. అలా అని ఆమె ఎప్పుడూ స్టేజి మీద పాడింది లేదు. తండ్రి పాల్ వర్ఘీస్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. ఆఫీసు, ఇల్లు తప్ప ఆయనకు వేరే లోకం ఉండేది కాదు. సెలవులు దొరికితే పూర్తిగా ఫ్యామిలీతోనే గడిపేవారు. అమల ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తుంది. ఆ గుణం ఆమెకు తండ్రి నుంచే అబ్బింది. ఇండియాలో అమల పాల్గొనే షూటింగ్స్‌కు అమ్మ వెంట వస్తే, విదేశాల్లో షూటింగ్స్‌కు తండ్రి వెంట వచ్చేవారు.
అసలు అమల సినీనటి అయ్యిందంటే అది, అన్నయ్య అభిజీత్ సపోర్ట్ వల్లే. అతను అమెరికాలో మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు. ఎప్పుడు ఇంటికొచ్చినా అమ్మానాన్నలు, చెల్లెలి కోసం గిఫ్ట్‌లు తీసుకొస్తుంటాడు. చిన్నప్పట్నుంచీ అన్నాచెల్లెళ్లకు సినిమాలంటే ఇష్టం. నిజానికి వాళ్ల కుటుంబంలో ఎవరూ సినీ పరిశ్రమలో లేకపోయినా అమలకు నటనాశక్తి స్వతహాగా అలవడింది.

హీరోయిన్లలా తనూ అందంగా ఉండాలని అద్దం ముందు గంటల తరబడి నిల్చొని తన అందం చూసుకొని మురిసిపోయేది అమల. దుస్తులమీద తనకు మోజెక్కువ. వెరైటీ వెరైటీ డ్రస్సులు వేసుకొనేది. టెన్త్ క్లాసులో స్కూల్లో ఫ్యాషన్ పోటీ పెడితే, అందులో అమలే ఫస్ట్. కాలేజీ డేస్‌లో ర్యాంప్ షోలు జరిగితే క్యాట్ వాక్ చేసేది. ఓసారి వాళ్ల కాలేజీకి పాపులర్ మలయాళీ దర్శకుడు లాల్ జోస్ వచ్చారు. అమలను చూసిన వెంటనే నా సినిమాలో నటిస్తావా? అనడిగారు.
అదో చిన్న బడ్జెట్ ఫిల్మ్. అందులో ఆమెది సహాయనటి పాత్ర. ఈ విషయాన్ని అమ్మానాన్నలకు భయంభయంగానే చెప్పింది. ఇద్దరూ వద్దన్నారు. కూతుర్ని ఇంజనీర్‌గా చూడాలనేది వాళ్ల ఆకాంక్ష. అప్పుడు అమల సినిమాల్లోకి వెళ్తే మంచి గుర్తింపు వస్తుందని వాళ్లకు అభిజీత్ నచ్చచెప్పాడు. అలా 2009లో 'నీలతామర' చిత్రం ద్వారా సినీరంగంలో నటిగా అడుగుపెట్టింది అమల. 'మైనా' మూవీ ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



