ENGLISH | TELUGU  

ఏ హీరోయిన్‌ క్రాస్‌ చెయ్యలేని రికార్డు.. అతిలోక సుందరి శ్రీదేవి సొంతం!

on Aug 12, 2025

(ఆగస్ట్‌ 13 శ్రీదేవి జయంతి సందర్భంగా..)

పాతతరంలో ఎంతోమంది కథానాయికలు తమ అందచందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. 1970వ దశకం నుంచి దాదాపు 30 సంవత్సరాలపాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులకు ఆరాధ్యదేవత అనిపించుకున్న హీరోయిన్‌ శ్రీదేవి. తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లో 200కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు శ్రీదేవి. ఈ రికార్డును ఇప్పటివరకు మరొకరు క్రాస్‌ చెయ్యలేకపోయారు. స్టార్‌ హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి జీవితం గురించి, సినీ జీవితంలో ఆమె సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. 

1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీఅమ్మయ్యంగర్‌ అయ్యప్పన్‌. అయితే స్క్రీన్‌ నేమ్‌గా శ్రీదేవి అని మార్చుకున్నారు. నాలుగేళ్ల వయసులో ఓ తమిళ సినిమాలో మొదటిసారి నటించారు. బాల నటిగా తొలి హిందీ చిత్రం జూలీ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మా బంగారక్క చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు శ్రీదేవి. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు రూపొందించిన పదహారేళ్ళ వయసు చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అక్కడి నుంచి అందరు స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తూ అంచెలంచెలుగా స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగారు. అప్పటి స్టార్‌ హీరోలకు మనవరాలిగా, కూతురిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత వారి సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం. ఈ ఘనత శ్రీదేవికి మాత్రమే సొంతం. 

పలు భాషల్లో అందరు స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు శ్రీదేవి. రజనీకాంత్‌, ఎన్టీఆర్‌, ఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున వంటి దక్షిణాది స్టార్‌లతో పాటు బాలీవుడ్‌లో అమితాబ్‌, అనిల్‌ కపూర్‌, జితేంద్ర, మిథున్‌ చక్రవర్తి, రిషికపూర్‌, ధర్మేంద్ర వంటి హీరోలకు జోడీగా నటించి సంచలన విజయాలు సాధించారు.  శ్రీదేవి తన సినీ జీవితంలో 200కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఎన్టీఆర్‌తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో  ఏఎన్నార్‌ తో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణతో కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్‌హాసన్‌ తరువాత, శ్రీదేవి కృష్ణతో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. అక్కడ కూడా  సద్మా, నగీనా, మిస్టర్‌ ఇండియా, చాందినీ, చాల్‌బాజ్‌, లమ్హే, జుదాయి, ఇంగ్లీష్‌-వింగ్లీష్‌, మామ్‌, నిగహైన్‌, ఫరిష్తే, లాడ్లా, రూప్‌ కీ రాణి చోరోన్‌ కా రాజా వంటి అనేక సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

ఇక శ్రీదేవి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తన పర్సనల్‌ లైఫ్‌ని ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవడానికే శ్రీదేవి ప్రయత్నించేవారు. 1996లో బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి. వివాహం తర్వాత సినిమాలకు తాత్కాలికంగా దూరంగా ఉన్నారు. వీరికి జాన్వీకపూర్‌, ఖుషీ కపూర్‌ సంతానం. 2011లో గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ చిత్రంలో నటించారు. మామ్‌ చిత్రంలోని తన నటనకు ప్రశంసలు అందుకున్నారు శ్రీదేవి. 2018లో దుబాయ్‌లో జరిగిన ఒక వేడుకలో పాల్గొనేందుకు కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు శ్రీదేవి. ఫిబ్రవరి 24న తను బస చేసిన హోటల్‌లో ప్రమాదవశాత్తూ మరణించారు. ఆమె మరణవార్త భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫిబ్రవరి 28న ముంబైలో జరిగిన శ్రీదేవి అంతిమయాత్రకు దేశం నలుమూలల నుంచి అభిమానులు హాజరయ్యారు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి జయంతి ఆగస్ట్‌ 13ని అభిమానులంతా గుర్తు చేసుకుంటారు, ఆ అతిలోక సుందరికి నివాళులు అర్పిస్తారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.