ENGLISH | TELUGU  

ఎవర్‌గ్రీన్‌ హిట్ ప్రేమాభిషేకం చిత్రాన్ని మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నారు. ఎందుకో తెలుసా?

on Nov 2, 2024

నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు దాదాపు 75 సంవత్సరాల పాటు తెలుగు సినిమాకు చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయన నటించిన 255కి పైగా సినిమాల్లో టాప్‌ టెన్‌గా పేర్కొనదగ్గ సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రేమాభిషేకం చిత్రానికి కూడా స్థానం ఉంటుంది. ఎందుకంటే 1980వ దశకంలో చరిత్ర సృష్టించిన సినిమా అది. 1981 ఫిబ్రవరిలో రిలీజ్‌ అయిన ఈ సినిమా ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్‌ చేసింది. దాదాపు 60 సంవత్సరాల వయసులో లవర్‌బోయ్‌గా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు అక్కినేని. తెలుగు సినిమా చరిత్రలో అప్పటివరకు రూ.4 కోట్లు షేర్‌ కలెక్ట్‌ చేసిన సినిమా లేదు. ప్రేమాభిషేకం మొత్తం రూ.4.5 కోట్లు షేర్‌ కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. శతదినోత్సవంలో, ప్లాటినం జూబ్లీలో రికార్డు ఈ సినిమా సొంతం. 20 కేంద్రాల్లో 200 రోజులు, 11 కేంద్రాల్లో 300 రోజులు, 8 కేంద్రాల్లో సంవత్సరం పాటు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రమిది. 29 కేంద్రాల్లో సిల్వర్‌ జూబ్లీ ఆడిన చిత్రంగా ఆరోజుల్లో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన సమరసింహారెడ్డి ఆ రికార్డును క్రాస్‌ చేసింది. 

లెక్కకు మించిన రికార్డులను సొంతం చేసుకొని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ప్రేమాభిషేకం సినిమాను మధ్యలోనే ఆపెయ్యాలనుకున్నారన్న విషయం చాలామందికి తెలీదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావుకు అక్కినేని నటించిన దేవదాసు, బాటసారి ఫేవరేట్‌ సినిమాలు. దేవదాసు తరహా కథాంశాలతో సినిమాలు చెయ్యాలని ఆయన ఎప్పుడూ భావించేవారు. అందుకే దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రాన్ని రూపొందించారు. ప్రేమాభిషేకం సినిమాను ఎనౌన్స్‌ చేసినపుడు కూడా దేవదాసు చిత్రాన్ని మళ్ళీ తీస్తున్నారని అంతా భావించారు. ఈ సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయిన తర్వాత ఏలూరులో ఉండే అక్కినేని నాగేశ్వరరావు బంధువు ఒకరు హైదరాబాద్‌ వచ్చారు. అక్కినేనికి ఆయనంటే ఎంతో గౌరవం. ఏ విషయాన్నయినా ఆయనతో డిస్కస్‌ చేసేవారు. అలా మాటల సందర్భంలో ప్రేమాభిషేకం ప్రస్తావన వచ్చింది. దాసరి.. దేవదాసు చిత్రాన్నే మళ్లీ తీస్తున్నాడని అనుకున్నారు. వాళ్ళే కాదు, యూనిట్‌లోని 60 మంది సభ్యులు కూడా అదే భావనలో ఉన్నారు. 

ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటివరకు తీసిన ఫుటేజ్‌ని తగలబెట్టెయ్యమని అక్కినేని బంధువు.. దాసరి నారాయణరావుకు ఎంతో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తికి చెప్పారు. దానికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి.. తీసిన దాన్ని తగలబెట్టుకుంటే ఏం వస్తుంది? తీసింది ఏదైనా.. జనంలోకి పంపిస్తేనే దాని ఫలితం ఏమిటనేది తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అక్కినేనికి కూడా చెప్పమని ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు. అక్కినేని, ఆయన బంధువు అలాంటి ఆలోచనతో ఉన్నారన్న విషయం ఎలాగో దాసరి నారాయణరావు చెవికి చేరింది. అయినా దాన్ని పట్టించుకోకుండా సినిమాను అద్భుతంగా తియ్యాలన్న పట్టుదలతోనే ఆయన ఉన్నారు. కథ, కథనం, మాటలు.. ఇలా ఏ విషయంలోనూ రాజీ పడకుండా తను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేవరకు అవిశ్రాంతంగా కృషి చేశారు దాసరి. ఫలితంగా ఒక దృశ్యకావ్యం ఆవిష్కరించబడింది.

ప్రేమాభిషేకం సినిమాపై ఎంతోమందికి ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ 1981 ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావుకు కూడా సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఎన్నో సందేహాలు ఉండేవి. వాటి గురించి దాసరితో కూడా చాలాసార్లు డిస్కస్‌ చేశారు. అయితే దాసరి మాత్రం తన మీద నమ్మకం ఉంచమని, ప్రేక్షకుల్లోకి ఈ కథ బాగా వెళుతుందని పదే పదే చెప్పేవారు. ఆయన చెప్పినట్టుగానే సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా సూపర్‌హిట్‌ అయి భారీ కలెక్షన్లు సాధించడమే కాదు, అప్పటివరకు ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన సినిమాగా ప్రేమాభిషేకం రికార్డు సృష్టించింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.