సురేఖను చిరంజీవి చేతుల్లో పెడుతూ అల్లు రామలింగయ్య ఏం చెప్పారో తెలుసా?
on Sep 26, 2021
స్టార్ యాక్టర్ కాకమునుపే స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ మెడలో మూడుముళ్లు వేశారు చిరంజీవి. ఆ తర్వాతే ఆయన స్టార్, ఆపైన మెగాస్టార్ అయ్యారు. ఆయన అల్లు వారింటి అల్లుడు కావడంలో నిర్మాతగా మారిన మేకప్‌మ్యాన్ జయకృష్ణ పెద్ద పాత్ర పోషించారు. మనవూరి పాండవులు సినిమాలో తన స్నేహితులతో కలిసి అల్లు రామలింగయ్యను ఏడిపించే సన్నివేశం సందర్భంలో తొలిసారిగా తన భవిష్యత్ మావగారిని కలిశారు చిరంజీవి.
ఆ తర్వాత తన మిత్రుడు ఒకరితో కలిసి రామలింగయ్య ఇంటికి వెళ్లారు చిరంజీవి. కానీ ఆ టైమ్‌లో ఆయన ఇంట్లో లేరు. ఆయన భార్య బయటకు వచ్చి పలకరించి కాఫీ పంపించారు. పెళ్లైన తర్వాత తెలిసింది ఆ కాఫీ పెట్టింది సురేఖ అని. "నన్ను చూశావా? అని సురేఖను పెళ్లయ్యాక అడిగాను. అయ్యో లేదండీ.. నేను లోపలే ఉన్నాను. బయటకు వచ్చి ఉంటే నాన్నగారు చంపేసేవారు అని చెప్పింది." అని ఆ రోజును గుర్తుచేసుకున్నారు చిరంజీవి.
తర్వాత కాలంలో నిర్మాతగా మారి ఎన్నో చక్కని చిత్రాలు తీసిన జయకృష్ణ మొదట్లో మేకప్‌మ్యాన్. ఆయన చిరుకు బాగా సన్నిహితులు, రామలింగయ్యకు స్నేహితుడు. ఆయనే రామలింగయ్య దగ్గర ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడటమే కాకుండా, ఆయనను ఒప్పించారు. చిరు తల్లిదండ్రులూ ఆనందంగా ఒప్పుకున్నారు. మొదట రామలింగయ్య తన కుమార్తెకు సినిమా సంబంధం కాకుండా బయటి సంబంధం చూడాలనుకున్నారు. ఆయన సతీమణికి మాత్రం చిరంజీవిని చూడగానే మంచి అభిప్రాయం కలిగింది.
కైకాల సత్యనారాయణతో చిరు గురించి వాకబు చేశారు రామలింగయ్య. జయకృష్ణ మధ్యవర్తిత్వంతో 1980 ఫిబ్రవరి 20న పెళ్లి జరిగింది. సురేఖను చిరంజీవి చేతుల్లో పెట్టేటప్పుడు "చూడు బాబూ.. నువ్వేమో కాస్త స్పీడు. మా ఇంట్లో పిల్లలందరూ కాస్త గట్టివారే. అరవింద్, భారతి, వసంత అందరూ కాస్త కచ్చితంగా మాట్లాడగలిగినవారే. కానీ ఇప్పటిదాకా నోరుమెదిపి ఇది కావాలి అని ఏ రోజూ అడగని నెమ్మదస్తురాలు సురేఖ. బాగా చూసుకోవాలయ్యా." అని చెప్పారు రామలింగయ్య. ఆయన చెప్పారని కాదు కానీ, ఆయన ఊహించిన దానికి మించి అప్పట్నుంచీ కూడా సురేఖను తన కంటిరెప్పలా చూసుకుంటూ వస్తున్నారు చిరు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
