టాలీవుడ్‌లో ఆ ఘనత సాధించిన ఏకైక దర్శకుడు కోడి రామకృష్ణ!
on Jul 22, 2025
(జూలై 23 దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా..)
సినిమా పరిశ్రమలో ఏ డైరెక్టర్‌కి అయినా వారు చేసే సినిమాలను బట్టి ఒక ముద్ర పడిపోతుంది. యాక్షన్ సినిమాలు, సెంటిమెంట్ సినిమాలు, కామెడీ, పొలిటికల్.. ఇలా రకరకాల జోనర్స్‌లో సినిమాలు చేసే డైరెక్టర్లు ఉంటారు. కానీ, ఇవన్నీ ఒకే డైరెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? ఏ జోనర్ సినిమా అయినా అందులో తన మార్క్ ఉండేలా చూసుకునే డైరెక్టర్లలో ప్రథమంగా చెప్పుకోదగినవారు కోడి రామకృష్ణ. తన కెరీర్‌లో వందకుపైగా సినిమాలను రూపొందించిన ఆయన ఒక జోనర్‌కి పరిమితం కాలేదు. అన్నిరకాల సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. దాసరి స్కూల్ నుంచి వచ్చిన కోడి రామకృష్ణ.. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు.
1949 జూలై 23న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు కోడి రామకృష్ణ. దాసరి నారాయణరావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. చాలా కాలం దాసరి వద్ద అనేక సినిమాలకు పనిచేసి విశేషానుభవం సంపాదించారు. 1982లో చిరంజీవి హీరోగా ప్రతాప్ ఆర్ట్స్ కె.రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు కోడి రామకృష్ణ. ఈ సినిమా సంచలన విజయం సాధించి ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. ఇదే బేనర్‌లో చేసిన ‘తరంగిణి’ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆలయశిఖరం, ముక్కుపుడక, సింహపురి సింహం, గూఢచారి నెం.1 వంటి సినిమాలు చేశాక 1984లో నందమూరి బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ రూపొందించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం సంచలన విజయం సాధించింది. కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు సృష్టించి గోల్డెన్ జూబ్లీ చిత్రంగా పేరు తెచ్చుకుంది.
దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఒక రికార్డు ఉంది. అదేమిటంటే.. మద్రాస్‌లో అడుగుపెట్టిన తొలిరోజే మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చారు. అంతకుముందు ఏ కళాకారుడికీ అలా జరగలేదు. ఆ తర్వాత ఆయన శిష్యుడు కోడి రామకృష్ణకు కూడా అలాగే జరగడం విశేషం. కోడి రామకృష్ణ మద్రాస్ వచ్చిన రోజే మేకప్ వేసుకొని కె.రాఘవ నిర్మిస్తున్న చదువు సంస్కారం చిత్రంలో స్టూడెంట్ రౌడీ పాత్రలో నటించారు. దాసరి నారాయణరావుకు ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడుగా అవకాశం ఇచ్చిన నిర్మాత కె.రాఘవ.. ఆ తర్వాత కోడి రామకృష్ణను ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశారు.
దాదాపు 35 సంవత్సరాలు దర్శకుడిగా తన కెరీర్‌ను కొనసాగించిన కోడి రామకృష్ణ.. ఏ దర్శకుడికీ సాధ్యం కాని ఘనతను సాధించారు. తను చేసిన వందకు పైగా చిత్రాల్లో ఎన్నో జోనర్స్ కనిపిస్తాయి. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చెయ్యడం కాకుండా.. 2 సంవత్సరాలకు ఒకసారి తన పంథా మార్చుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తనే స్వయంగా తెలిపారు కోడి. ఆయన చేసిన సినిమాలను పరిశీలిస్తే.. కొన్నాళ్లు టిపికల్ సబ్జెక్ట్స్‌తో కూడిన సినిమాలు, మరికొన్నాళ్లు పోలీస్ ప్రధాన పాత్రలతో ఉన్న సినిమాలు, కొన్ని పొలిటికల్ మూవీస్, ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలు.. ఇలా ఎప్పటికప్పుడు ట్రెండ్ మార్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన దర్శకులు ఆ సినిమాలనే ఫాలో అయ్యేవారు.
తెలుగు సినిమాకి గ్రాఫిక్స్‌ని పరిచయం చేసిన ఘనత కోడి రామకృష్ణకే దక్కుతుంది. అయితే ఇందులో నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి భాగస్వామ్యం కూడా కొంత ఉంది. 1992లో సౌందర్య ప్రధాన పాత్రలో ‘అమ్మోరు’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో తొలిసారి గ్రాఫిక్స్‌ని వాడారు. ఆ కారణంగానే ఈ సినిమా ఆలస్యంగా 1995లో విడుదలైంది. ఆరోజుల్లో ఈ సినిమా సంచలన విజయం సాధించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన ‘దేవి’ చిత్రానికి కూడా పూర్తి స్థాయిలో గ్రాఫిక్స్‌ని వినియోగించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. విజువల్‌గా ప్రేక్షకులకు మరింత అనుభూతిని కలిగించే ఉద్దేశంతో ఆ తర్వాత చేసిన దేవీపుత్రుడు, అంజి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కోడి రామకృష్ణతో తొలి గ్రాఫిక్స్ చిత్రాన్ని నిర్మించిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మరోసారి ఆ తరహా సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. అనుష్క ప్రధాన పాత్రలో ‘అరుంధతి’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా కోడి రామకృష్ణ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోయింది. అలాగే అనుష్కను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత అదే తరహాలో అవతారం, నాగాభరణం చిత్రాలను రూపొందించారు కోడి రామకృష్ణ.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు విలక్షణమైన విలన్లను పరిచయం చేసిన ఘనత కోడి రామకృష్ణకు దక్కుతుంది. ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో రచయితగా పనిచేసిన గొల్లపూడి మారుతీరావును బలవంతంగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో ఒక టిపికల్ విలన్‌గా పరిచయం చేశారు. అలాగే ‘అంకుశం’ చిత్రంతో నీలకంఠం అనే క్రూరమైన పాత్రతో రామిరెడ్డిని పరిచయం చేశారు. ఆ తర్వాత ‘భారత్ బంద్’ చిత్రంతో కాస్ట్యూమ్ కృష్ణను మరో విభిన్నమైన విలన్‌ను తీసుకొచ్చారు. కోడి రామకృష్ణ కెరీర్‌లో గొప్ప సినిమాగా చెప్పుకునే ‘అరుంధతి’ చిత్రం ద్వారా సోనూసూద్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు చిన్న చిన్న పాత్రలు చేసిన సోనుకి ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతి పాత్ర పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఈ నలుగురూ ఆ తర్వాత కొన్ని వందల సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
వ్యక్తిగత విషయాలకు వస్తే.. రంగులపులి చిత్రం చేస్తున్న సమయంలో ఆ సినిమాలో నటించిన పుష్పాంజలి తన జీవిత భాగస్వామి అయితే బాగుంటుందని ఆ విషయాన్ని ఆమెతో చెప్పడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలోని పెద్దలంతా కలిసి వారిద్దరికీ పెళ్లి చేశారు. వీరి పెద్ద కుమార్తె కోడి దివ్యదీప్తి నిర్మాణ రంగంలోకి ప్రవేశించి 2022లో నేను ‘మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే చిత్రాన్ని నిర్మించారు. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్ వంటి దర్శకుల తర్వాతి స్థానాన్ని కోడి రామకృష్ణ దక్కించుకున్నారు. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఇక దర్శకుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులతోపాటు పలు సంస్థల అవార్డులు కోడి రామకృష్ణను వరించాయి. ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 2019 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
