అనూప్ రూబెన్స్‌కు ఏడేళ్లపాటు ఒక్క హిట్టూ లేదంటే నమ్ముతారా?
on Aug 30, 2021

ఇవాళ అనూప్ రూబెన్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ లవర్స్ మాత్రమే కాదు, నేటి సినీ ప్రియులందరికీ అతను సుపరిచితుడే. కీబోర్డ్ ప్లేయర్‌గా కెరీర్ ఆరంభించిన అనూప్ పనిచేసిన మొదటి సినిమా ఉషాకిరణ్ మూవీస్ వారు తేజ దర్శకత్వంలో నిర్మించిన 'చిత్రం'. అది సూపర్ హిట్టవడంతో కీబోర్డ్ ప్లేయర్‌గా వరుస అవకాశాలు వచ్చాయి. సిక్స్‌టీన్స్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, నువ్వు నేను, జయం, సంతోషం, దిల్.. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్ అతనే. 2004 దాకా అతను దాదాపు 200 సినిమాలకు ఏకబిగిన పనిచేశాడు.
'జై' సినిమాతో అనూప్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశాడు డైరెక్టర్ తేజ. ఆ సినిమాకు చాలా కష్టపడి మంచి ట్యూన్స్ ఇచ్చాడు అనూప్. పాటలు ప్రజాదరణ పొందాయి కానీ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ధైర్యం, గౌతమ్ ఎస్ఎస్‌సీ, ద్రోణ, సీతారాముల కల్యాణం లంకలో, అందరి బంధువయా లాంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. అవేవీ బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. అలా మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన ఏడేళ్ల దాకా అతడికి ఒక్క హిట్టూ పడలేదు. ఈ మధ్య కాలంలోనూ అతను కొన్ని సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్‌గా చేశాడు కూడా.
ఎట్టకేలకు ఆది హీరోగా పరిచయమైన 'ప్రేమకావాలి' రూపంలో అతడి కెరీర్‌కు బిగ్ బ్రేక్ లభించింది. 'ద్రోణ' సినిమాలో అతను చేసిన "ఏం మాయ చేశావే" సాంగ్ డైరెక్టర్ విజయభాస్కర్‌కు నచ్చడంతో 'ప్రేమకావాలి' సినిమాకు ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా పాటలు సూపర్ హిట్ కావడమే కాకుండా, 'ప్రేమకావాలి' శత దినోత్సవం చేసుకుంది. ఆ వెంటనే 'పూలరంగడు', 'ఇష్క్', 'లవ్లీ' లాంటి హిట్ సినిమాలు రావడంతో అనూప్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. అక్కనేని వంశంలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన 'మనం' మూవీకి ఇచ్చిన సంగీతంతో అనూప్ రేంజ్ ఇంకో లెవల్‌కు చేరింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



