ENGLISH | TELUGU  

సినిమాల్లో తన హాస్యంతో అందర్నీ నవ్వించిన రాజబాబు.. మంచి తనానికి నిలువెత్తు నిదర్శనం!

on Oct 9, 2024

ప్రతి మనిషి జీవితంలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నవరసాల్లో హాస్యానికి ఉన్న ప్రత్యేకతే వేరు. హాస్యాన్ని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. అందులోనూ తెలుగు వారు హాస్యప్రియులు. పాతరోజుల్లో నాటకాలైనా, సినిమాలైనా హాస్యానికి పెద్ద పీట వేసేవారు. అందుకే ఏ సినిమా ఇండస్ట్రీలో లేని విధంగా తెలుగు ఇండస్ట్రీలో హాస్యనటులు ఎక్కువ. ఎంత మంది ఉన్నా ఎవరి శైలి వారిది. అయినా అందర్నీ ఆదరించే మనసు తెలుగు వారిది. పాత తరం హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు రాజబాబు. పాతాళభైరవి చిత్రంలో పోషించిన అంజిగాడు పాత్రతో హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ అంటే రాజబాబుకు ఎంతో ఇష్టం. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చారు. రెండు దశాబ్దాలపాటు విరామం లేకుండా ప్రేక్షకుల్ని నవ్విస్తూ 514 సినిమాల్లో నటించారు. 45 సంవత్సరాల అతి చిన్న వయసులో కన్నుమూసారు రాజబాబు. శతాబ్దపు హాస్యనటుడు అవార్డు పొందిన రాజబాబు వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 

రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1935 అక్టోబర్‌ 20న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే బుర్రకథ నేర్చుకున్నారు రాజబాబు. ఇంటర్మీడియట్‌ పూర్తయిన తర్వాత టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తి చేసి కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నాటకరంగంలో పితామహుడిగా పేరు తెచ్చుకున్న గరికపాటి రాజారావు సలహా మేరకు 1960లో మద్రాస్‌ చేరుకొని సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, దారి దొరకలేదు. పూట గడవడం కష్టంగా ఉన్న సమయంలో నటుడు, దర్శకుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ట్యూషన్‌ చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘సమాజం’ చిత్రంలో రాజబాబుకి తొలి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి అడపా దడపా సినిమా అవకాశాలు వచ్చేవి. 1965లో విడుదలైన ‘అంతస్తులు’ చిత్రంతో రాజబాబు కెరీర్‌ టర్న్‌ అయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఎన్నో సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు.

రాజబాబుకి జంటగా మీనాకుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి నటించేవారు. అయితే అందరి కన్నా ఎక్కువగా రమాప్రభతో కలిసి నటించారు. 16 సంవత్సరాలపాటు ఇద్దరూ కలిసి 100కి పైగా సినిమాల్లో కనిపించారు. సినిమా మొదలు పెట్టే ముందు రాజబాబు, రమాప్రభ డేట్స్‌ తీసుకున్న తర్వాతే హీరో ఎవరు అనేది డిసైడ్‌ చేసుకునేవారు. హీరో ఎవరైనా సినిమాలో రాజబాబు, రమాప్రభ ఉన్నారా అని చూసేవారు ప్రేక్షకులు. అప్పటికే రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం వంటి హాస్యనటులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎవరినీ అనుకరించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని హాస్యాన్ని పండించేవారు రాజబాబు. ఉత్తమనటుడిగా వరసగా 7 సార్లు ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న తొలి హాస్యనటుడు రాజబాబు. మొత్తం 9 ఫిలింఫేర్‌ అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాగే మూడు నంది అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. అంతస్తులు చిత్రంతో బ్రేక్‌ వచ్చిన తర్వాత 1965 డిసెంబర్‌ 5న మహాకవి శ్రీశ్రీ మరదలు లక్ష్మీఅమ్ములుని వివాహం చేసుకున్నారు రాజబాబు. వీరికి నాగేంద్రబాబు, మహేష్‌బాబు సంతానం. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్‌ కూడా హాస్యనటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 

రాజబాబు వ్యక్తిగత జీవితం ఎంతో విభిన్నమైనది. ఆయనలో తాత్విక లక్షణాలు ఎక్కువ. జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనే ఆలోచనలు ఎక్కువ చేసేవారు. తను జీవితంలో సంపాదించిన దానిలో ఎక్కువ శాతం దాన ధర్మాలకే వినియోగించారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున సీనియర్‌ నటీనటుల్ని ఘనంగా సన్మానించేవారు. వారిలో మొదటగా తనకు స్ఫూర్తిగా నిలిచిన బాలకృష్ణను సన్మానించారు. అలా సన్మానం అందుకున్నవారిలో రేలంగి, సూర్యకాంతం, సావిత్రి, డా.శివరామకృష్ణయ్య ఉన్నారు. అంతస్తులు చిత్రానికి ముందు ఒక సినిమా షూటింగ్‌లో షాట్‌ పూర్తి చేసి బయటికి వచ్చినపుడు ఒక లైట్‌బోయ్‌ రాజబాబు నటనను ప్రశంసిస్తూ మీరు తప్పకుండా పెద్ద స్థాయికి వెళతారు. అప్పుడు నాకు బట్టలు పెట్టాలి అని అడిగాడు.  నటుడుగా ఎంతో బిజీ అయిపోయిన తర్వాత ఆ లైట్‌బోయ్‌ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అయితే అతను ఎలా ఉంటాడో గుర్తులేదు. అందుకే తన ప్రతి పుట్టినరోజున మద్రాస్‌లోని అన్ని స్టూడియోల్లో పనిచేసే లైట్‌బోయ్స్‌కి బట్టలు పెట్టి, బిర్యానీ ప్యాకెట్‌ ఇచ్చేవారు. పబ్లిక్‌ ట్రస్ట్‌ పేరుతో ఓ సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కోరుకొండలో జూనియర్‌ కళాశాలను కట్టించారు. రాజబాబు పేరుతోనే ఆ కాలేజీ ఉంది. రాజమండ్రిలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం అదే ఊరిలో బంగీ కాలనీ కట్టించారు. తన భార్య పేరు మీద రాజమండ్రిలో ఒక ఆడిటోరియం నిర్మించారు. రాజబాబు సేవా నిరతికి ఉదాహరణగా ఒక సంఘటన గురించి చెప్పాలి. ‘రాణి ఔర్‌ లాల్‌పరి’ అనే హిందీ సినిమా కోసం ఒక పాటలో నటించారు. రెమ్యునరేషన్‌ ఎంత ఇవ్వమంటారు అని నిర్మాత అడిగారు. చేసింది ఒక పాటే కాబట్టి ఐదు వేలు ఇస్తే చాలు అనుకున్నారు రాజబాబు. కానీ, ఆ నిర్మాత 40వేలు ఇచ్చారు. తను మాత్రం ఐదువేలే తీసుకొని మిగిలిన డబ్డును ఆ సినిమా షూటింగ్‌లో ఉన్న టెక్నీషియన్స్‌ అందరికీ పంచి పెట్టేశారు. పాత తరం నుంచి ఇప్పటివరకు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన హాస్యనటుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. 

ఎప్పుడూ తాత్విక చింతనలోనే ఉండే రాజబాబు కొన్ని సినిమాలకు కథలు అందించి బాబ్‌ అండ్‌ బాబ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలు నిర్మించారు. వీటిలో తనే హీరోగా నటించారు. అలాగే తాత మనవడు, పిచ్చోడిపెళ్లి, తిరపతి చిత్రాల్లో కూడా ప్రధాన పాత్రలు పోషించారు. రాజబాబు చివరి రోజుల్లో మద్యానికి బానిస అయ్యారు. వైవాహిక జీవితం సంతృప్తికరంగా లేకపోవడం వల్లే ఆయన మద్యానికి చేరువయ్యారని చెప్పుకునేవారు. ఆ సమయంలోనే ఆయనకి గొంతు క్యాన్సర్‌ వ్యాధి సోకింది. ఒకసారి ఆపరేషన్‌ కూడా జరిగింది. రాజబాబుకి ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. ఆయన వర్థంతి అయిన ఫిబ్రవరి 11న రోజంతా ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదేరోజు మరోసారి రాజబాబు గొంతుకి ఆపరేషన్‌ జరిగింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో 1983 ఫిబ్రవరి 14న రాజబాబు తుదిశ్వాస విడిచారు. తన హాస్యంతో రెండు దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన రాజబాబు భౌతికంగా మనమధ్య లేకపోయినా తను పోషించిన పాత్రల ద్వారా జీవించే ఉంటారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.