ENGLISH | TELUGU  

తను సినిమా నటినని కోర్టులో ప్రూవ్‌ చేసుకున్న వాణిశ్రీ.. ఎందుకో తెలుసా? 

on Aug 2, 2025

(ఆగస్ట్‌ 3 వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా..)

పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రిది ఒక శకం అని చెప్పొచ్చు. సావిత్రిలాంటి నటి మరొకరు లేరు, రారు అనుకుంటున్న సమయంలో ఓ వెలుగులా చిత్ర పరిశ్రమలోకి దూసుకొచ్చారు వాణిశ్రీ. సావిత్రి పోలికలతోనే వాణిశ్రీ ఉందని అందరూ అనుకున్నారు. సావిత్రి మాదిరిగానే మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కథానాయికగా ఎదిగారు. పొగరు గల ధనవంతురాలిగా, ఆత్మాభిమానం కలిగిన మధ్య తరగతి యువతిగా, అమాయకురాలిగా, అణకువ కలిగిన భార్యగా, చిలిపి పనులు చేస్తూ నవ్వించే అమ్మాయిగా.. ఇలా ఏ పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో మెప్పించగల ప్రతిభాశాలి వాణిశ్రీ. 

1948 ఆగస్ట్‌ 3న నెల్లూరులో రాఘవయ్య, వెంకమ్మ దంపతులకు రెండో కుమార్తెగా జన్మించారు వాణిశ్రీ. ఆమె అసలు పేరు రత్నకుమారి. చిన్నతనంలోనే టి.బి.తో తండ్రి చనిపోయారు. ఒక్క నెలలోనే వారి కుటుంబంలోని ముగ్గురు అదే వ్యాధితో మరణించారు. వెంకమ్మ తన ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగించారు. వాణిశ్రీ చదువుకుంటూనే నాట్యం నేర్చుకున్నారు. స్కూల్‌లో జరిగిన ఒక ఫంక్షన్‌లో వాణిశ్రీ డాన్స్‌ చూసిన కన్నడ డైరెక్టర్‌ హునుసూరు కృష్ణమూర్తి.. తను చేస్తున్న వీరసంకల్ప చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలోని నటనకు, చేసిన డాన్సులకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో నాటకాల్లో నటించారు వాణిశ్రీ. ముఖ్యంగా చిల్లకొట్టు చిట్టెమ్మ, రక్తకన్నీరు, రాగరాగిణి, దొంగ వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. వీరసంకల్ప రషెస్‌ చూసిన బి.విఠలాచార్య నవగ్రహ పూజా మహిమ చిత్రంలో చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత కన్నడలో కొన్ని సినిమాల్లో నటించారు. 

ఎ.వి.ఎం సంస్థ నిర్మించిన నానుమ్‌ ఒరుపెణ్‌ చిత్రాన్ని తన సొంత బేనర్‌ శ్రీవాణి ఫిలింస్‌ పతాకంపై నాదీ ఆడజన్మే పేరుతో నిర్మించాలనుకున్నారు ఎస్‌.వి.రంగారావు. అందులోని ప్రధాన పాత్ర కోసం వాణిశ్రీని ఎంపిక చేశారు. ఆ సమయంలోనే తమ బేనర్‌ పేరు కూడా కలిసి వచ్చేలా రత్నకుమారి పేరును వాణిశ్రీగా మార్చారు ఎస్వీఆర్‌. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర జమునకు దక్కింది. బాలీవుడ్‌ నటి వైజయంతిమాలను వాణిశ్రీ ఆదర్శంగా తీసుకున్నారు. నటనలోని మెళకువలు, డైలాగులు ఎలా చెప్పాలి వంటి విషయాలు ఎస్వీఆర్‌ నేర్పించారు. 1967లో వచ్చిన మరపురాని కథ వాణిశ్రీ భవిష్యత్తుకు మంచి పునాది వేసింది. అప్పటివరకు జానపద చిత్రాలు రాజ్యమేలాయి. వాణిశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి జానపదాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలోనే ఎన్నో సాంఘిక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు వాణిశ్రీ. 

ఇలా ఉండగా, 1969లో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆత్మీయులు చిత్రంలో తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించారు వాణిశ్రీ. ఈ సినిమాలో మొదట అక్కినేనికి చెల్లెలుగా నటించమని అడిగారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. కానీ, తను హీరోయిన్‌గా అయితేనే చేస్తానని పట్టుబట్టి దాన్ని సాధించుకున్నారు. అక్కినేనికి చెల్లెలుగా విజయనిర్మల నటించారు. ఆ తర్వాత అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్‌లోనే వచ్చిన భలే రంగడు కూడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్‌తో నటించిన తొలి సినిమా నిండు హృదయాలు. హాస్యనటుడు పద్మనాభం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కథానాయిక మొల్ల చిత్రంలో మొల్ల పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు వాణిశ్రీ. ఈ సినిమాకి నంది అవార్డు లభించింది. 

సాధారణంగా హీరోలకు లేడీస్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ, వాణిశ్రీకి మహిళా అభిమానులు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆమె చీరకట్టుకునే విధానం, హెయిర్‌ స్టైల్‌, జ్యూయలరీ.. మహిళలను విపరీతంగా ఆకర్షించేవి. ఈ విషయాల్లో వాణిశ్రీ ఎన్నో ప్రయోగాలు చేశారు. తన గెటప్‌ విషయంలో ఆమెకు పూర్తి అవగాహన ఉండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమె ఏది చేస్తే అదే బెస్ట్‌ అనేవారు. ఒక శిల్పంలా అందంగా కనిపించేందుకు వాణిశ్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. సరైన డైట్‌ పాటిస్తూ స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నించేవారు. ఆరోజుల్లో నవలా పఠనం ఎక్కువగా ఉండేది. ఆయా నవలల్లో కథానాయిక ఎలా ఉందని వర్ణిస్తారో దానికి నిజమైన రూపంగా వాణిశ్రీ కనిపించేవారు. అందుకే లెక్కకు మించిన నవలా చిత్రాల్లో వాణిశ్రీ హీరోయిన్‌గా నటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వాణిశ్రీ తర్వాత నవలా నాయిక అని పేరు తెచ్చుకున్న నటి మరొకరు లేరు. 

1970 దశకం వచ్చేసరికి వాణిశ్రీ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌,  శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, హరనాథ్‌, కాంతారావు, రంగనాథ్‌, రామకృష్ణ వంటి అగ్రశ్రేణి హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. అలా వచ్చిన దసరాబుల్లోడు, కొడుకు కోడలు, ప్రేమనగర్‌, బంగారుబాబు, దేశోద్ధారకులు, ఎదురులేని మనిషి, ఎదురీత, కన్నవారి కలలు, గంగ-మంగ, చక్రవాకం, జీవనజ్యోతి, ఇల్లు ఇల్లాలు, రైతుబిడ్డ, చీకటి వెలుగులు, చక్రధారి, భక్తకన్నప్ప, జీవనతరంగాలు, కృష్ణవేణి, వంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించాయి. తమిళంలో శివాజీ గణేశన్‌ వంటి అగ్రశ్రేణి నటులతో 80 సినిమాల్లో వాణిశ్రీ నటించారు. అలాగే కన్నడలో రాజకుమార్‌ వంటి హీరోల సరసన 30 సినిమాల్లో నటించారు. అయితే మలయాళంలో మాత్రం కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. 1981లో వచ్చిన దేవుడు మావయ్య హీరోయిన్‌గా ఆమె చివరి సినిమా. ఆమె కెరీర్‌లో మేకప్‌ లేకుండా నటించిన సినిమాలు రెండు. బాపు దర్శకత్వంలో వచ్చిన గోరంతదీపం, శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వంలో రూపొందిన అనుగ్రహం. హీరోయిన్‌గా కొన్ని వందల సినిమాల్లో నటించినప్పటికీ తను చేసిన సినిమాల్లో కృష్ణవేణి, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే తనకు నచ్చిన సినిమాలని చెబుతారు వాణిశ్రీ. 

హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడే జరిగిన ఓ సంఘటన వాణిశ్రీ సినిమాలు విరమించడానికి కారణమైంది. అప్పటివరకు ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌.. కమర్షియల్‌ హీరోగా నటించిన సినిమా ఎదురులేని మనిషి. ఈ సినిమాను కె.బాపయ్య డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాలోని కసిగా ఉంది.. కసికసిగా ఉంది.., కృష్ణా ముకుందా మురారి.. అనే పాటల చిత్రీకరణ వాణిశ్రీని ఎంతో బాధపెట్టాయి. అప్పటివరకు ఏ సినిమాలోనూ అలాంటి పాటలు వాణిశ్రీ చేయలేదు. ఇలాంటి డాన్సులు చేయడం వల్ల ప్రేక్షకుల్లో తనపై ఉన్న గౌరవం పోతుందని భావించిన వాణిశ్రీ.. ఆ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే సినిమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే చాలా సినిమాలు కమిట్‌ అయి ఉండడం వల్ల అవి పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలా దేవుడు మావయ్య చిత్రంతో హీరోయిన్‌గానే రిటైర్‌ అయ్యారు వాణిశ్రీ. 

సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న మరుసటి సంవత్సరం 1978లో చెంగల్పట్టుకు చెందిన డాక్టర్‌ కరుణాకరన్‌ను వివాహం చేసుకున్నారు వాణిశ్రీ. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. వాణిశ్రీ సినిమాలు చేస్తున్న సమయంలో ఆమెకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ తన అక్క భర్త చూసుకునేవారు. అలా చాలా ఆస్తులు ఆమె బావ పేరు మీదే ఉన్నాయి. పెళ్ళి తర్వాత తన ఆస్తులు తిరిగి ఇవ్వాలని వాణిశ్రీ కోరారు. దానికి ఆమె అక్క, బావ ఇద్దరూ ఒప్పుకోకవడంతో వాణిశ్రీ భర్త కోర్టుకెక్కారు. కొన్ని సంవత్సరాలపాటు ఈ కేసు కోర్టులోనే ఉంది. ఒక దశలో తన పేరు వాణిశ్రీ అనీ, ఆ ఆస్తులన్నీ సినిమాల్లో నటించడం ద్వారానే సంపాదించానని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాల్లో నటించడం ద్వారా నిర్మాతలు డబ్బు ఇచ్చినట్టు అగ్రిమెంట్లు ఉంటే కేసు గెలుస్తామని వాణిశ్రీ తరఫు న్యాయవాది చెప్పడంతో ఆ ప్రూఫ్‌ కోసం సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. అలా నటించిన మొదటి సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావడమే కాకుండా వాణిశ్రీ పోషించిన అత్త క్యారెక్టర్‌కి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో మళ్లీ అవకాశాలు వెల్లువెత్తాయి. అలా బొబ్బిలిరాజా, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, పెద్దింటల్లుడు, స్వాతిచినుకులు, రాజేశ్వరీ కళ్యాణం వంటి వైవిధ్యమైన సినిమాల్లో వాణిశ్రీ నటించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ 60 సినిమాలు చేయడం విశేషం. 

సినిమాలు వద్దనుకొని 1981లోనే రిటైర్‌ అయిన వాణిశ్రీ.. తాను సినిమాల్లో నటించడం ద్వారా ఆస్తులు సంపాదించానని నిరూపించుకోవడం కోసమే తన సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించారు. మొదటి ఇన్నింగ్స్‌లో, సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ తన స్థాయికి తగిన సినిమాలే చేశారు తప్ప విమర్శలకు తావిచ్చే క్యారెక్టర్స్‌ వాణిశ్రీ ఎప్పుడూ చేయలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేయడం ద్వారా కోర్టు కోరిన అగ్రిమెంట్లు సమర్పించి కేసు గెలిచారు. దీంతో ఆస్తులు తిరిగి అప్పగించారు వాణిశ్రీ అక్క, బావ. అయితే ఆ తర్వాత వారు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అనారోగ్యం పాలు కావడంతో వారిని ఆదుకున్నారు వాణిశ్రీ. ఇదిలా ఉంటే.. 2020లో వాణిశ్రీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్‌గా పనిచేస్తున్న కుమారుడు అభినయ్‌ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. వాణిశ్రీ చివరిగా నటించిన సినిమా భద్రాద్రి రాముడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.  

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.