ENGLISH | TELUGU  

‘శివ’ నుంచి ‘ఆటగదరా శివా’ వరకు తనికెళ్ళ భరణి కెరీర్‌ అట్ల డిసైడ్‌ అయింది!

on Jul 13, 2025

(జూలై 14 తనికెళ్ళ భరణి పుట్టినరోజు సందర్భంగా..)

పాతతరంలోని నటీనటులు, రచయితలు, దర్శకులు.. అందరూ నాటక రంగం నుంచి వచ్చినవారే. వారు నాటకాలు రాస్తూ, దర్శకత్వం వహిస్తూ వివిధ పాత్రల్లో నటించారు. అయితే రచయితలు, దర్శకులు ఎప్పుడూ తెరపై కనిపించే ప్రయత్నం చెయ్యలేదు. కానీ, ఆ తర్వాతి తరంలో రచయితలు, దర్శకులు నటులుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా సినీ పరిశ్రమలో ప్రవేశించి ఆ తర్వాత నటుడిగా మారిన రచయిత తనికెళ్ళ భరణి. విలనీ, సెంటిమెంట్‌, కామెడీ.. ఇలా ఏ తరహా పాత్రకైనా న్యాయం చెయ్యగల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కామెడీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ‘మిథునం’ వంటి గొప్ప చిత్రాన్ని రూపొందించి నటుడిగానే కాదు, దర్శకుడిగా కూడా తనేమిటో ప్రూవ్‌ చేసుకున్నారు. తన రచనలతో సాహిత్య రంగంలో కూడా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఇంతటి ప్రతిభావంతుడైన తనికెళ్ళ భరణి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఆయన జీవితంలోని విశేషాలేమిటి అనేది తెలుసుకుందాం.

1954 జూలై 14న పశ్చిమ గోదావరి జిల్లాలోని జగన్నాథపురం గ్రామంలో టి.వి.ఎస్‌.ఎస్‌.రామలింగేశ్వరరావు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు తనికెళ్ల భరణి. ఆయనకు తెలుగు భాష అంటే అమితమైన గౌరవం. తిరుపతి వేంకటకవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి, విఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ వంటివారు తనికెళ్ళ భరణికి బంధువులు. దాంతో భరణి ఇంట్లోనూ సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉండేది. చిన్నతనంలోనే తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ సాహిత్యంలో పట్టు సాధించారు భరణి. అయితే ఇంటర్మీడియట్‌కి వచ్చే వరకు ఆయన ఒక్క రచన కూడా చేయలేదు. హైదరాబాద్‌లో కాలేజీలో చదువుతున్నప్పుడు ‘అద్దెకొంప’ అనే నాటకం రాసి ప్రదర్శించగా దానికి మొదటి బహుమతి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో కొన్ని కవితలు రాశారు. డిగ్రీ చదివేటప్పుడు రాళ్ళపల్లి పరిచయమయ్యారు. ఆయనకు శ్రీమురళి కళానిలయం పేరుతో ఓ నాటక సమాజం ఉండేది. దాని ద్వారా అనేక నాటకాలు రాసి ప్రదర్శించారు రాళ్ళపల్లి. ఆయన మద్రాస్‌ వెళ్లిపోయిన తర్వాత ఆ సంస్థకు రచయిత కావాల్సి వచ్చింది. అలా భరణి పూర్తిస్థాయి రచయితగా స్థిరపడడానికి ఆ సంస్థ కారణమైంది. అలా చాలా నాటకాలు రాయడమే కాకుండా నటించారు కూడా. వాటిలో ఎక్కువ శాతం విలన్‌ పాత్రలే పోషించారు భరణి. 

సినిమా రంగానికి వచ్చిన తర్వాత భరణికి రాళ్ళపల్లి ద్వారా వంశీ పరిచయమయ్యారు. అయితే ఆయన మాటలు రాసిన తొలి సినిమా సుమన్‌ హీరోగా నటించిన ‘కంచు కవచం’. ఆ తర్వాత వంశీతో భరణి జర్నీ ఎన్నో సంవత్సరాలు సాగింది. కెరీర్‌ ప్రారంభంలోనే ‘లేడీస్‌ టైలర్‌’ చిత్రంలో ఆయన రాసిన డైలాగ్స్‌కి ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వంశీ డైరెక్షన్‌లో వచ్చిన లాయర్‌ సుహాసిని, మహర్షి, శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌, చెట్టుకింద ప్లీడరు వంటి సినిమాలకు అద్భుతమైన మాటలు రాయడమే కాకుండా నటించారు కూడా. ముఖ్యంగా లేడీస్‌ టైలర్‌ చిత్రంలో భరణి కనిపెట్టిన ‘జ’ భాష ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేసింది. ఆ తర్వాత  రామ్‌గోపాల్‌వర్మ తొలి చిత్రం ‘శివ’ చిత్రానికి ఆయన రాసిన డైలాగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఆ సినిమాలో భరణి చేసిన నానాజీ క్యారెక్టర్‌కి విపరీతమైన పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత రచయితగా కంటే నటుడిగానే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. దాంతో నెమ్మదిగా రచనలు తగ్గించుకోవాల్సి వచ్చింది. విలన్‌గా, కామెడీ విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. అలాగే 52 సినిమాలకు రచయితగా పనిచేశారు. 

స్వతహాగ శివ భక్తుడైన తనికెళ్ళ భరణి.. తను రచించిన ‘ఆట గదరా శివా’ అందరి ప్రశంసలు అందుకుంది. భక్తులు ఆ పాట విని పరవశించిపోయారు. ఆ తర్వాత ఓ విభిన్నమైన కథాంశాన్ని తీసుకొని ‘సిరా’ పేరుతో ఓ షార్ట్‌ ఫిలింను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ షార్ట్‌ ఫిలింను విమర్శకులు సైతం ప్రశంసించారు. 2012లో కేవలం రెండు పాత్రలతో తనికెళ్ళ భరణి రూపొందించిన ‘మిథునం’ చాలా గొప్ప చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డు, ఈ సినిమాలో నటించిన ఎస్‌.పి.బాలు, లక్ష్మీలకు స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డులు లభించాయి. ఉత్తమ మాటల రచయితగా తనికెళ్ళ భరణి నంది అవార్డు అందుకున్నారు. అంతకుముందు సముద్రం చిత్రానికి ఉత్తమ విలన్‌గా, నువ్వు నేను చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు లభించాయి. ఇవికాక సాహిత్య రంగంలో అయనకు లభించిన పురస్కారాలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1988లో దుర్గా భవానితో తనికెళ్ళ భరణి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం మహాతేజ, సౌందర్యలహరి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.