తెలుగు చలనచిత్ర సీమలో ఏకైక ప్రపంచస్థాయి నటుడు ఎస్.వి.రంగారావు!
on Nov 21, 2024
తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప నటులు, మహా నటులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి నటుల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు ఎస్.వి.రంగారావు. నవరసాల్లో దేన్నయినా అవలీలగా పోషించగల నటుడిగా ఆయన ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలైన దుర్యోధనుడు, రావణాసురుడు, ఘటోత్కచుడు, యముడు, హిరణ్యకశపుడు వంటి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలకు జీవం పోశారు ఎస్.వి.రంగారావు. అంతేకాదు, సాంఘిక చిత్రాల్లో సైతం ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటనలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రౌద్ర రసాన్నే కాదు, కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పోషించగల ఏకైక నటుడు ఎస్.వి.రంగారావు. అలాంటి గొప్ప నటుడి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, సినిమా అవకాశాలు ఎలా అందిపుచ్చుకున్నారు, దాని కోసం ఎలాంటి కృషి చేశారు, వ్యక్తిగత జీవితం ఎలా సాగింది వంటి విషయాలు ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1918 జూలై 3న కృష్ణా జిల్లాలోని నూజివీడులో లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరనాయుడు దంపతులకు జన్మించారు ఎస్.వి.రంగారావు. ఈ దంపతులకు మొత్తం 13 మంది సంతానం. తన తాతగారి పేరునే కుమారుడికి పెట్టారు కోటేశ్వరనాయుడు. ఆయన ఎక్సైజు శాఖలో పనిచేసేవారు. వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పిల్లలంతా పెరిగారు. ఈమె భర్త మరణానంతరం మనుమలు, మనుమరాళ్ళతో సహా మద్రాసు చేరుకున్నారు గంగారత్నమ్మ. మద్రాసు హిందూ హైస్కూలులో చదువుతున్న రోజుల్లో తన పదిహేనవ ఏట మొదటిసారిగా నాటకంలో నటించారు ఎస్వీఆర్. ఆ నాటకంలోని తన నటనను అందరూ ప్రశంసించడంతో నటనపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత ఆ పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. చదువు, నటనే కాకుండా క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది. ఆరోజుల్లో నాటకాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు వంటి వారిని చూసి తను కూడా అంతటి గొప్ప నటుడు కావాలని కలలు కన్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు. చూడడమే కాదు, వాటిని విశ్లేషించేవారు కూడా. ఎస్వీఆర్ చూసిన తొలి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ. ఆయన మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాలలోనూ, బి.ఎస్.సి. కాకినాడలోని పి.ఆర్.కళాశాలలోనూ పూర్తి చేశారు.
ఎస్వీఆర్ నాటకాలు వేస్తూ ఉండడం కుటుంబంలోని వారికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వారి కుటుంబంలో కళాకారులు ఎవరూ లేరు. అందుకని అతను బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలని వారు అనుకునేవారు. కానీ, ఎస్వీఆర్‌కి మాత్రం నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని బలంగా ఉండేది. అయితే కుటుంబ సభ్యుల కోరిక మేర చదువు మీద కూడా శ్రద్ధపెట్టేవారు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఆ పరీక్షకు 45 మంది హాజరైతే ఎస్వీఆర్ ఒక్కరే ఉత్తీర్ణుడు కావడం విశేషం. చదువుకుంటూనే యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్‌లో చేరి నాటకాలు వేసేవారు. ఆ సమయంలోనే అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారు పరిచయమయ్యారు. నాటకాలు వేయడం ద్వారా తనలోని నటుడికి సాన పెట్టారు ఎస్వీఆర్. పీష్వా నారాయణరావు ప్రదర్శించిన వధ నాటకంలో ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు ఎస్వీఆర్. ఆయనకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండడంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ వంటి పాత్రల్ని అద్భుతంగా పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి.ఎస్.సి. పూర్తి చేశారు. తర్వాత ఎం.ఎస్.సి. చెయ్యాలనుకున్నారు. తన అభిమాని చొలెనర్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. డిగ్రీ పూర్తయింది కాబట్టి ఆ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో దరఖాస్తు చేశారు ఎస్వీఆర్. అలా బందరు, విజయనగరంలలో ఫైర్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో పెద్దగా పని ఉండకపోయినా ఉద్యోగ రీత్యా నాటకాలు వేసేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. దాంతో నటనకు దూరమవుతున్నానని భావించి ఆ ఉద్యోగాన్ని వదిలేశారు.
ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎస్వీఆర్‌కి 1946లో వరూధిని చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నటించినందుకు ఎస్వీఆర్‌కు రూ.750 పారితోషికం లభించింది. ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేదు. అంతేకాదు, ఎస్వీఆర్‌కు సినిమా అవకాశాలు కూడా రాలేదు. దీంతో జంషెడ్‌పూర్‌లోని టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్‌గా చేరారు. జంషెడ్‌పూర్‌లో ఉన్న ఆంధ్రుల కోసం అక్కడ ఒక సంఘం ఉండేది. వాళ్ళు నాటకాలు వేసేవారు. అందులో ఎస్వీఆర్ కూడా కర్ణుడిగా, దుర్వాసుడిగా పలు పాత్రలు పోషించారు. సినిమా ఆలోచన పక్కన పెట్టి ఉద్యోగం చేసుకుంటున్న తరుణంలో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో రూపొందుతున్న పల్లెటూరి పిల్ల చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి రావాల్సిందిగా ఎస్వీఆర్‌కి కబురు వచ్చింది. అదే సమయంలో తండ్రి మరణించారంటూ ధవళేశ్వరం నుంచి మరో టెలిగ్రామ్ వచ్చింది. ఊరికి చేరుకున్న ఎస్వీఆర్ అంత్యక్రియలు పూర్తి చేసి మద్రాస్ వెళ్లారు. ఆయన అక్కడికి వెళ్లడం ఆలస్యం కావడంతో ఆ క్యారెక్టర్‌ను ఎ.వి.సుబ్బారావుకు ఇచ్చారు. తమ సినిమా కోసమే వచ్చారు కాబట్టి అదే సినిమాలో ఎస్వీఆర్‌కి ఓ చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత ఎల్.వి.ప్రసాద్ డైరెక్షన్‌లో వచ్చిన మనదేశం చిత్రంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇదే సినిమా ద్వారా ఎన్.టి.రామారావు తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఎస్వీఆర్ నటన డైరెక్టర్ ఎల్.వి.ప్రసాద్‌ని బాగా ఆకట్టుకుంది. అందుకే పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన తిరుగుబాటు చిత్రంలోని ఒక క్యారెక్టర్‌కి ఎస్వీఆర్‌ను రికమెండ్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలు విజయం సాధించలేదు. అయినా నిరుత్సాహపడకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూశారు ఎస్వీఆర్.
అదే సమయంలో నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలి సినిమా షావుకారులో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను ఎస్వీఆర్‌కి ఇచ్చారు. ఈ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదే సంస్థ నిర్మించిన తదుపరి చిత్రం పాతాళభైరవి ఎస్వీఆర్ కెరీర్‌ని ఒక్కసారిగా టర్న్ చేసింది. ఈ సినిమాలో ఆయన చేసిన మాంత్రికుడి క్యారెక్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సినిమా ఘనవిజయం సాధించడంతో ఎస్వీఆర్‌కు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. పాతాళభైరవి మొదలుకొని తోడికోడళ్ళు, మిస్సమ్మ, మాయాబజార్, సతీ సావిత్రి, నమ్మినబంటు, వెలుగునీడలు, మంచి మనసులు, నర్తనశాల, రాముడు భీముడు, పాండవ వనవాసం, గుండమ్మకథ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వీఆర్ చేసిన అద్భుతమైన పాత్రలు కోకొల్లలు కనిపిస్తాయి. కేవలం 25 సంవత్సరాలు మాత్రమే తన సినీ కెరీర్‌ని కొనసాగించిన ఎస్వీఆర్ తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కి పైగా సినిమాల్లో నటించారు. హిందీ భాష మీద కూడా మంచి పట్టు ఉండడంతో హిందీ సినిమాల్లోని తన క్యారెక్టర్‌కు తనే డబ్బింగ్ చెప్పుకునేవారు.
ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించినప్పటికీ ఎస్వీఆర్‌కి ప్రభుత్వ పరంగా రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేది వాస్తవం. దీనిపై ప్రముఖ నటుడు గుమ్మడి స్పందిస్తూ.. ‘రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయనకు మాత్రం దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదుమంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండే వారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నా ఆయన చనిపోయినప్పుడు కనీసం ఒకరోజైనా సంతాపంగా థియేటర్లు మూసివేయడమో, మరేదైనా గౌరవమో ఆయనకు దక్కలేదు’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తన నటనకు గుర్తింపుగా విశ్వ నటచక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహ, నటశేఖర వంటి బిరుదులు ఆయనకు లభించాయి. నర్తనశాల చిత్రంలోని నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. 2013లో భారత సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు పేరుతో విడుదల చేశారు. ఎస్.వి.రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన 2018 జూలై 3న హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ఉత్సవాలను 2018 జూలై 3 నుంచి జూలై 8 వరకు హైదరాబాద్ …
Also Read