ENGLISH | TELUGU  

తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన మరో అందాల నటుడు రామకృష్ణ!

on Dec 10, 2024

పాత తరం హీరోల్లో ఆరడుగులు ఎత్తు ఉన్నవారు నలుగురు. మొదట హరనాథ్‌, రామకృష్ణ, ఆ తర్వాత కృష్ణంరాజు, రంగనాథ్‌ ఇండస్ట్రీకి వచ్చారు. ఎత్తు ఉండడమే కాదు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వారిలో రామకృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. పౌరాణిక, జానపద చిత్రాలతోపాటు సాంఘిక చిత్ల్రాల్లోనూ తన అద్భుతమైన నటనతో శభాష్‌ అనిపించుకున్నారు. 35 సంవత్సరాల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో 200కి పైగా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. రామకృష్ణ సినిమా రంగంలోకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏ తరహా సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనే విషయాలు ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం.

1939 అక్టోబర్‌ 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు రామకృష్ణ. ఆయన పెద్దగా చదువుకోలేదు. భీమవరంలోనే టైలరింగ్‌ చేస్తుండేవారు. అయితే రామకృష్ణకు నాటకాలు అంటే చాలా ఇష్టం. అందుకే తనకు వీలు దొరికినప్పుడల్లా నాటకాల్లో నటించేవారు. నాటకరంగంలో అప్పటికే ప్రముఖుడిగా పేరు తెచ్చుకున్న పినిశెట్టి శ్రీరామ్మూర్తి ప్రదర్శించే నాటకాల్లో రామకృష్ణ ఎక్కువగా నటించేవారు. అతని నటన చూసి పినిశెట్టి ఆశ్చర్యపోయేవారు. ఆరడుగుల ఎత్తుతో ఆజానుబాహుడిగా ఉన్న రామకృష్ణ సినిమాల్లో అయితే బాగా రాణిస్తాడని మొదట నమ్మిన వ్యక్తి పినిశెట్టి. ఇదే మాట రామకృష్ణ స్నేహితులు కూడా అనేవారు. తను సినిమాలకు పనికొస్తానని అందరూ అంటుంటే వినడానికి రామకృష్ణకి బాగానే ఉన్నా... సినిమాల్లోకి వెళ్లాలంటే ఎవరైనా తెలిసిన వారు ఉండాలి. లేకపోతే తనని అక్కడ ఎవరు చూస్తారు అనుకునేవారు. 

నాటక రచయితగా, దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పినిశెట్టి శ్రీరామ్మూర్తి 1954లో వచ్చిన రాజు పేద చిత్రం ద్వారా రచయితగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన తర్వాత 1960లో నిత్యకళ్యాణం పచ్చతోరణం చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ సమయంలో తన శిష్యుడ్ని మర్చిపోలేదు పినిశెట్టి. తను ప్రదర్శించిన నాటకాల్లో హీరోగా నటించిన రామకృష్ణను మద్రాస్‌ పిలిపించి నిత్యకళ్యాణం పచ్చతోరణం చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. అదే సంవత్సరం విడుదలైన భక్త శబరి చిత్రంలో రామకృష్ణ లక్ష్మణుడిగా నటించారు. ఈ సినిమాలో హరనాథ్‌ రాముడిగా కనిపిస్తారు. ఇదే సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించారు శోభన్‌బాబు. ఆ సినిమా తర్వాత రామకృష్ణ చాలా సినిమాల్లో నటించారు. అయితే 1966లో వచ్చిన హంతకులొస్తున్నారు జాగ్రత్త చిత్రంలో ఆయన పోషించిన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది.

1974లో ఎస్‌.పట్టు దర్శకత్వంలో ఎ.వి.ఎం సంస్థ నిర్మించిన నోము చిత్రం రామకృష్ణకు హీరోగా మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ చిత్రానికి సత్యం సంగీతాన్నందించారు. మరుసటి సంవత్సరమే ఎవిఎం సంస్థ రామకృష్ణతో మరో సినిమా నిర్మించింది. ఆ సినిమా పేరు పూజ. నిర్మాతలుగా ఉన్న మురుగన్‌, కుమరన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. రాజన్‌ నాగేంద్ర సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు కూడా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ రెండు సినిమాల విజయాల తర్వాత రామకృష్ణకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వరసగా రకరకాల జోనర్స్‌లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. 

ఆరోజుల్లో కృష్ణుడిగా ఎన్టీఆర్‌ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన తర్వాత కాంతారావు కూడా కృష్ణుడిగా, రాముడిగా కొన్ని సినిమాల్లో కనిపించారు. వారి తర్వాత కృష్ణుడి పాత్రకు వన్నె తెచ్చిన హీరో రామకృష్ణ. యశోదకృష్ణ, దేవుడే దిగివస్తే చిత్రాల్లో రామకృష్ణ కృష్ణుడిగా కనిపిస్తారు. అప్పట్లో జానపద సినిమాలు ఎక్కువగా ఎన్టీఆర్‌, కాంతారావులతోనే నిర్మించేవారు. ఆ తరహా పాత్రలకు ఇద్దరూ పూర్తి న్యాయం చేసేవారు. అలాంటి తరుణంలో రామకృష్ణ కూడా జానపద చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. పేదరాశి పెద్దమ్మ, కోటలోపాగా, దొరలు దొంగలు వంటి సినిమాల్లో రామకృష్ణ నటించారు. అప్పటి స్టార్‌ హీరోలైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో కలిసి చాలా రామకృష్ణ సినిమాల్లో నటించారు. రామకృష్ణ అంటే వీరిద్దరికీ ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 

వ్యకిగత విషయాల గురించి చెప్పాలంటే.. సినిమా రంగంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకు రామకృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు జన్మించింది. వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాగలేదు. ఆ తర్వాత 1973లో సహనటి గీతాంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రామకృష్ణ. అయితే పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలని రామకృష్ణ ఆమెకు కండిషన్‌ పెట్టారు. ఆమె కూడా దానికి ఒప్పుకున్నారు. పెళ్లి తర్వాత రామకృష్ణ కెరీర్‌ మరింత ఊపందుకుంది. పెద్ద సంస్థల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఆ సమయంలో భర్త వ్యవహారాలన్నీ గీతాంజలి చూసుకునేవారు. 1980 దశకం వచ్చేసరికి అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించే అవకాశాలు మాత్రమే వచ్చేవి. అప్పుడు మద్రాస్‌లో తమ కుమారుడు శ్రీనివాస్‌ పేరు మీద ప్రివ్యూ కమ్‌ డబ్బింగ్‌ థియేటర్‌ను నెలకొల్పారు. ఈ థియేటర్‌ ఎన్‌.టి.రామారావు చేతుల మీదుగా ప్రారంభమైంది. 

తన కుమారుడు శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చెయ్యాలని రామకృష్ణ అనుకున్నారు. కానీ, అది సాధ్యపడలేదు. 35 సంవత్సరాలు సినిమా రంగంలో కొనసాగినప్పటికీ ఎలాంటి దురలవాట్లు రామకృష్ణ దరికి చేరలేదు. 1995 వరకు అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయనకు క్యాన్సర్‌ వ్యాధి సోకింది. ఆ కారణంగా రామకృష్ణ సినిమాలకు దూరమై తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించారు. అయినప్పటికీ 2001 అక్టోబర్‌ 22న కన్నుమూశారు రామకృష్ణ. ఆయన మరణం తర్వాత శ్రీనివాస్‌ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన గుర్తింపు రాలేదు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.