ENGLISH | TELUGU  

బాల‌కృష్ణ న‌ట‌ జీవితాన్ని మ‌లుపు తిప్పిన ఆ న‌లుగురు ద‌ర్శ‌కులెవ‌రు?

on Jun 10, 2025

విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తారాక రామారావు త‌న‌యుడిగా ఇంత లాంగ్ లాస్టింగ్ కెరీర్ న‌డ‌ప‌టం అంటే అది మామూలు విష‌యం కాదు. యాభై ఏళ్ల పాటు న‌టుడిగా కొన‌సాగిన వ్య‌క్తి కూడా బాల‌య్య బాబే. (Nandamuri Balakrishna)

బాల‌కృష్ణ ప‌ద‌నాలుగేళ్ల వ‌య‌సులో అంటే, 1974లో త‌న తండ్రి ఎన్టీఆర్ డైరెక్ష‌న్లో వ‌చ్చిన తాత‌మ్మ క‌ల చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మయ్యాడు. మొద‌ట్లో వివిధ సినిమాల్లో స‌హాయ‌న‌టుడి పాత్ర పోషించాడు బాల‌య్య‌. ఆక్ర‌మంలో ఆయ‌న ఎలాంటి సినిమాలు చేశాడో చూస్తే.. దాన‌వీర శూర‌క‌ర్ణ‌, అక్బ‌ర్ సలీం అనార్క‌లీ, అన్న‌ద‌మ్ముల అనుబంధం, శ్రీమ‌ద్విరాట ప‌ర్వ‌ము, శ్రీ తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క‌ళ్యాణం వంటి చిత్రాల్లో ఆయ‌న ఆడుతూ పాడుతూ న‌టిస్తూ వ‌చ్చాడు.

తొలి ప‌ది సంవ‌త్స‌రాలు అలా గ‌డ‌వ‌గా.. 1984లో కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు విజ‌యంతో సోలోహీరోగా స్థిర‌ప‌డ్డాడు బాల‌య్య బాబు. ఇక అక్క‌డి నుంచి ముద్దుల కృష్ణ‌య్య‌, మువ్వ‌గోపాలుడు, ముద్దుల మేన‌ల్లుడు, ముద్దుల మావ‌య్య అంటూ.. కోడిరామ‌కృష్ణ‌తో ఒక హిట్ కాంబోగా నిలిచింది. బాల‌కృష్ణ‌- కోడిరామ‌కృష్ణ‌- ఎస్ గోపాల్ రెడ్డి కాంబో అంటే అప్ప‌ట్లో అదో సూపర్ డూప‌ర్ హిట్ కాంబో.

ఫ్యామిలీ హీరోగా చాలా కాలం పాటు బాల‌కృష్ణ సినిమాలు వ‌చ్చాయి. త‌ర్వాత క‌థానాయ‌కుడు, లారీడ్రైవ‌ర్, రౌడీ ఇన్ స్పెక్ట‌ర్, ఆదిత్య 369 వంటి చిత్రాల‌తో త‌న‌దైన ల్యాండ్ మార్క్ హిట్స్ ఇవ్వ‌డం మాత్ర‌మే కాకుండా.. మూడో త‌రం హీరోల్లో అగ్ర‌గ‌ణ్యుడిగా ఉంటూ వ‌చ్చాడు బాల‌కృష్ణ‌.

బాల‌కృష్ణ ఫ్యామిలీ హీరో స్టేజ్ నుంచి ఫ్యాక్ష‌న్ హీరోగా అవ‌త‌రించిన స‌మ‌యం సంద‌ర్భం మాత్రం.. బీగోపాల్ ద్వారా వ‌చ్చింది. 1999లో వ‌చ్చిన స‌మ‌ర‌సింహారెడ్డి- అప్ప‌ట్లో అదో స‌న్సేష‌న‌ల్ హిట్. స‌రికొత్త బాల‌కృష్ణ ఆవిర్భావం జ‌రిగింది అప్పుడే. ఆ త‌ర్వాత న‌ర‌సింహ‌నాయుడు, సీమ సింహం వంటి వ‌రుస ఫ్యాక్ష‌న్ మూవీస్ వ‌చ్చాయి. అప్ప‌ట్లో ఇదో ట్రెండు. బాల‌కృష్ణ ఒక ట్రెండ్ సెట‌ర్ గా పేరొచ్చిందంటే కార‌ణం ఈ సినిమాలు అంత‌గా విజ‌య‌వంతం కావ‌డ‌మే.

త‌ర్వాతి కాలంలో బాల‌కృష్ణ కెరీర్ ని మ‌రో మ‌లుపు తిప్పిన మ‌రో ద‌ర్శ‌కుడు మాత్రం బోయ‌పాటి శ్రీను. శ్రీను ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన సింహా. 2010లో విడుద‌లైన ఈ చిత్రం బాల‌కృష్ణ ఫ్యాన్స్ కి పండ‌గ‌లా క‌నిపించింది. వింటేజ్ బాల‌య్య‌ను తిరిగి తెర‌పైకి తెచ్చాడు బోయ‌పాటి.

అక్క‌డి నుంచి బాల‌కృష్ణ యాభై ఏళ్ల సినిమా జీవితంలో స‌రికొత్త పార్ట్ మొద‌లైంది. లెజండ్, అఖండ వంటి చిత్రాల‌తో ఈ ఇద్ద‌రి కాంబో ప్ర‌స్తుతం అఖండ 2 వ‌ర‌కూ వ‌చ్చింది.

రీసెంట్ గా బాల‌కృష్ణ వ‌రుస హిట్ సినిమాలేంట‌ని చూస్తే.. అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి, డాకూ మ‌హ‌రాజ్. ఇవన్నీ వంద‌కోట్లు వ‌సూలు చేసిన చిత్రాలుగా  నిలిచాయి. అంటే వరుస నాలుగు సెంచ‌రీల‌తో టాలీవుడ్ లో మ‌రే హీరోకి లేని స‌రికొత్త రికార్డ్ అన్న‌మాట‌.

ప్ర‌తి ప‌ది ప‌దిహేనేళ్ల‌కు బాల‌కృష్ణ‌లో ఒక కొత్త న‌ట‌బాల‌కృష్ణుడు క‌నిపించాడంటే, అతిశ‌యోక్తి కాదేమో. అంతగా తెలుగు ప్రేక్ష‌క స‌మాజాన్ని ప్ర‌భావితం చేసిన న‌టుల్లో మ‌రొక‌రు లేరేమో, అలాంటి అఖండ‌మైన‌ పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించాడాయ‌న‌.

బాల‌కృష్ణ సినిమాలు ఆడుతూనే ఉన్న థియేట‌ర్లు ఇప్ప‌టికీ ఉన్నాయి. ఈ మాస్ రాంపేజ్ మ‌రెవ‌రికీ లేదేమో. ఇక‌పై రాదేమో. ఇప్పుడొక సినిమా వారం ప‌దిరోజులు ఆడితే మ‌హా గొప్ప‌. అదే బాల‌య్యా బాబు సినిమా ఏపీ, తెలంగాణ థియేట‌ర్ల‌లో ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఆడుతున్న విధం క‌నిపిస్తుంది. కొన్ని సినిమా హాళ్లు బాల‌కృష్ణ‌కే డెడికేట్ చేసిన‌వి ఉంటాయంటే అబ‌ద్ధం కాదు. అంత‌గా బాల‌య్య త‌న ఫ్యాన్స్ కి ఎప్పుడూ ద‌గ్గ‌ర‌గానే ఉంటాడు. 

ప‌ర్స‌న‌ల్ గా బాల‌కృష్ణ స్టామినా ఏంటంటే మీరెక్క‌డైనా ప‌బ్బుకు గానీ ఇత‌ర వండ‌ర్లా వంటి పార్కుల‌కు గానీ వెళ్తే.. అక్క‌డ జై బాల‌య్య స్లోగ‌న్ ఎక్కువ‌గా వినిపిస్తుంది. కార‌ణం ఒక మొండి ధైర్యానికి నిద‌ర్శ‌నంగా బాల‌య్య‌ను వారు భావిస్తారు కాబ‌ట్టి.

ఏదైనా ఆప‌ద‌లో ఉన్న‌పుడు గానీ, లేదంటే మ‌రేదైనా క‌ష్ట సాధ్య‌మైన ప‌నులు చేయాల్సి వ‌చ్చిన‌పుడు కానీ బాలకృష్ణను త‌లుచుకోవ‌డం కుల‌మ‌తాల‌కు, పార్టీల‌కు అతీతంగా ఒక న‌మ్మ‌కం ఉందంటే ఆశ్చ‌ర్యం లేదేమో. అంత‌గా ఆయ‌న పేరు దేశ విదేశాల్లోనూ మార్మోగుతుంది. బాల‌కృష్ణ సినిమాల‌కు విదేశాల్లోని తెలుగు వారే కాదు.. అక్క‌డి విదేశీయుల్లోనూ వీరాభిమానులున్నారు. ద‌టీజ్ బాల‌య్య బాబు!

త‌న తండ్రి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంక‌టేశ్వ‌రుడు వంటి పాత్ర‌ల్లో దేవుడిగా ప్రేక్ష‌కుల‌కు ద‌ర్శ‌న‌మిస్తే.. బాల‌కృష్ణ మాత్రం స్వ‌యంగా త‌నే ఆరాధ్య దైవంగా, అంతులైని ధైర్యాన్నిచ్చేందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తారు. దీంతో బాల‌కృష్ణ  డేరింగ్ క‌మ్ డ్యాషింగ్ నేచ‌ర్ కి నిద‌ర్శ‌నంగా  నిలిచిపోయార‌నే చెప్పాలి. దీంతో ప‌దిమందికీ ఆద‌ర్శ‌వంగా నిల‌వ‌డం మాత్ర‌మే కాదు.. వారి క‌ష్ట‌కాలంలో వాడే ఊత‌ప‌దంగానూ మారిపోయాడాయ‌న‌. ఇది తెలుగు సినిమాలే కాదు యావ‌త్ ప్ర‌పంచంలో ఏ సినీ హీరోల్లో లేని అరుదైన క్వాలిఫికేష‌న్. 

ఒక అగ్ర‌నటుడి కుమారుడిగా పుట్టి.. ఆ ప్రెష‌ర్ని త‌ట్టుకుని యాభై ఏళ్ల‌పాటు కెరీర్ ని విజ‌య‌వంతంగా  న‌డ‌ప‌ట‌మే కాకుండా.. ఇటు బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్ ఆస్ప‌త్రి నిర్వాహ‌కుడిగా, అటు హిందూపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బాల‌కృష్ణ త్రిపాత్రాభిన‌యానికి మెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప‌ద్మ భూష‌ణ్ అనే పుర‌స్కారం అందించింది. అంతే కాదు తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు సైతం ఇచ్చింది. ఈ అవార్డును త‌న 67వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అందుకుంటున్నాడు బాల‌య్య బాబు.

ఇక బాల‌కృష్ణకు ప్రేక్ష‌కులిచ్చిన బిరుద‌లేంట‌ని చూస్తే యువ‌ర‌త్న‌గా మొద‌లైన ఈ ప‌రంప‌ర న‌ట సింహం, లెజండ్, రోరింగ్ లైన్ వంటివి ఎన్నో ఉన్నా.. జైబాల‌య్య అనేది ఒక పాట రూపంలోనే కాదు.. మాట రూపంలోనూ ప్రేక్ష‌కుల పాలిట అదో జీవ‌న మంత్రం.  

బాల‌కృష్ణకు వ‌య‌సు ఒక లెక్క కాదు. ఎందుకంటే ఆయ‌నది ఎప్ప‌టికీ చిన్న పిల్లాడి మ‌న‌స్తత్వం. ఆయ‌న త‌న కొడుకు మోక్ష‌జ్ఞ‌తోనూ పోటీ ప‌డ‌గ‌ల‌డు. ద‌ర్శ‌కుల‌ను న‌మ్మ‌డం అన్న‌ది ఆయ‌న విజ‌య‌ర‌హస్యాల్లో ఒక‌టి. ఎందుకంటే ఆయ‌న తొలి నాళ్ల‌లో ఎక్కువగా త‌న తండ్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల్లో న‌టించాడు. దీంతో తండ్రే ద‌ర్శ‌కుడు కావ‌డం వ‌ల్ల‌.. దానికి తోడు త‌న తండ్రికి సైతం డైరెక్ట‌ర్ చైర్ అంటే ఉన్న గౌర‌వాభిమానాల వ‌ల్ల ఆయ‌న త‌న డైరెక్ట‌ర్ ని బ‌లంగా న‌మ్ముతారు. 

బాల‌కృష్ణ‌కు క‌థ చెప్ప‌డం సులువు. ఆయ‌న చేత న‌టింప చేయ‌డ‌మూ సులువే. ఎందుకంటే ఆయ‌న‌కంటూ ఎలాంటి భేష‌జాలుండ‌వు. లైట్ బాయ్ నుంచి డైరెక్ట‌ర్ వ‌రకూ అంద‌రితోనూ ఇట్టే క‌ల‌సిపోయి.. క‌నిపిస్తాడు కాబ‌ట్టి.

ఫైన‌ల్ గా బాల‌కృష్ణ కెరీర్ ని శాసించిన ఆ న‌లుగురు ద‌ర్శ‌కులు ఎవ‌ర‌య్యా అంటే తొలుత తండ్రి సీనియ‌ర్ ఎన్టీఆర్, ఆ త‌ర్వాతి రోజుల్లో కోడి రామ‌కృష్ణ‌, ఆపై రోజుల్లో బీ గోపాల్, ప్రెజంట్ బోయ‌పాటి శ్రీను బాల‌య్య బాబు కెరీర్ ని అమాంతం మ‌లుపు తిప్పిన ద‌ర్శ‌కుల్లో కీల‌కంగా భావించాలి. అలాగ‌ని బాల‌కృష్ణ ఇత‌ర ద‌ర్శ‌కుల సినిమాల‌ను చేయ‌లేద‌ని కాదు.. కానీ ప్ర‌ధానంగా ఈ ద‌ర్శ‌కుల ప్ర‌భావం ఆయ‌న కెరీర్ నిండా ప‌రుచుకుని క‌నిపిస్తుంది.

ఇక బాల‌కృష్ణలో ఉన్న సెయింట్ హుడ్. మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ అంశ‌మే ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌స్తోందంటే.. ఇది కేవ‌లం బాల‌య్య బాబుకు మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక‌త‌. మ‌రెవ‌రికీ లేని ఈ అతీత శ‌క్తి బాల‌య్య‌కి మాత్ర‌మే సొంతం. అందుకే అనేది జై బాల‌య్య ఒక స్లోగ‌న్ కాదు. ఎంద‌రో జీవితాల్లో ధైర్యాన్ని నింపే ఒకానొక లైప్ లైన్ క్యాప్ష‌న్ గా అభివ‌ర్ణిస్తారు సినీ పండితులు. 

హ్యాపీ బ‌ర్త్ డే బాల‌య్య బాబూ! మీరిలాగే మ‌రిన్ని పుట్టిన రోజులు జ‌రుపుకుని.. ఇటు సినీ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కే కాక అటు స‌మాజంలోని ఎంద‌రో అభాగ్యుల పాలిట ఆరాధ్య దైవంగా కొన‌సాగాల‌ని ఆశిస్తూ సెల‌వు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.