సినిమాలంటే ఇంట్రెస్ట్ లేని మురళీమోహన్.. 350 సినిమాలు ఎలా చేశారో తెలుసా?
on Jun 24, 2025

పాతతరం హీరోలైనా, ఇప్పుడు టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారైనా సినిమాపై ఉన్న ఆసక్తితోనే పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలి అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ, సినిమా మీద ఏమాత్రం ఆసక్తి లేకపోయినా హీరో అయిపోయి ఆ తర్వాత కొన్ని వందల సినిమాల్లో నటించిన ఘనత మురళీమోహన్‌కి దక్కుతుంది. అది కూడా పెళ్ళయి, ఇద్దరు పిల్లలు ఉన్న సమయంలో 33 సంవత్సరాల వయసులో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు. ఈ తరహా చరిత్ర ఏ హీరోకీ ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 50 సంవత్సరాల సినీ కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించారు మురళీమోహన్. హీరోగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి అందులోనూ విజయం సాధించి మంచి బిజినెస్ మేన్‌గా పేరు తెచ్చుకున్నారు. సినిమా రంగంలో, వ్యాపార రంగంలో విజయం సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మురళీమోహన్ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన జీవిత విశేషాలు ఏమిటి అనే విషయాలు ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1940 జూన్ 24న పశ్చిమగోదావరి జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు మాగంటి మురళీమోహన్. ఆయన అసలు పేరు రాజబాబు. ఈయన తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో ఇంటర్ వరకు చదువుకున్నారు మురళీమోహన్. హీరో కృష్ణ, దర్శకులు క్రాంతికుమార్, విజయేంద్రప్రసాద్ ఆయనకు క్లాస్‌మేట్స్. చిన్నతనం నుంచి చదువు కంటే వ్యాపారంపైనే ఆయనకు ఎక్కువ మక్కువ. ఆయన పినతండ్రికి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ ఉండేది. విజయవాడలో కూడా ఒక బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో మురళీమోహన్‌కి అందులో ఉద్యోగం ఇచ్చి లాభాల్లో 15 పైసల వాటా కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తన వాటాను అమ్మెయ్యాలని ఆయన పినతండ్రి అనుకున్నారు. ఆయన వాటాను కూడా మురళీమోహన్ కొనుక్కొని 50 పైసల వాటాదారుడు అయ్యారు. వ్యాపారం అంటే ఆసక్తి ఎక్కువ ఉండడంతో ఎంతో కష్టపడి బిజినెస్‌ను బాగా డెవలప్ చేశారు. విజయవాడ చుట్టు పక్కల గ్రామాలకు, వివిధ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ మోటార్లు సప్లై చేసేవారు. వ్యాపారం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే విజయలక్ష్మీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం మధుబిందు, రామ్మోహన్.

వ్యాపారం చేస్తూనే విజయవాడలో అప్పుడప్పుడు కాలక్షేపానికి నాటకాల్లో కూడా నటించేవారు మురళీమోహన్. ఆ సమయంలోనే క్రాంతికుమార్ వంటి మిత్రులు సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అయితే తనకు సినిమాలపై ఆసక్తి లేదని, మంచి బిజినెస్ మేన్ అనిపించుకుంటానని వారికి చెప్పారు. కానీ, మిత్రులు వినకుండా అతనికి మేకప్ చేయించి ఫోటోలు తీశారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ఆ సమయంలో జగమేమాయ అనే సినిమా నిర్మిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆయన.. మురళీమోహన్‌ని తన ఆఫీస్‌కి పిలిపించారు. తమ సినిమాలో హీరోగా నటిస్తావా అని అడిగారు. తనకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని, మిత్రుల బలవంతం మీద ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మురళీమోహన్ భార్య.. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని మురళీమోహన్ భార్య కూడా చెప్పడంతో 1973లో ‘జగమేమాయ’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మురళీమోహన్.
మొదటి సినిమా జగమేమాయ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో తనకు సినిమాలు సరిపడవని, బిజినెస్‌లోనే కొనసాగాలని అనుకున్నారు మురళీమోహన్. ఆ సమయంలో దాసరి నారాయణరావు రూపొందిస్తున్న తిరుపతి చిత్రంలో మంచి అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా నటుడిగా మురళీమోహన్‌కి మంచి పేరు తెచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వరసగా అవకాశాలు రావడం మొదలైంది. సంవత్సరానికి ఐదు సినిమాలకు తగ్గకుండా చేశారు. జ్యోతి, తూర్పు పడమర, ప్రేమలేఖలు, కళ్యాణి, కల్పన వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించారు. హీరోగానే కాకుండా సెకండ్ హీరోగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు.. 1979లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థను ప్రారంభిస్తూ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న కళ్యాణి చిత్రంలో మురళీమోహన్‌ని హీరోగా ఎంపిక చేసుకున్నారు. అది తన జీవితంలో గొప్ప విషయమని మురళీమోహన్ అంటారు. ఆ తర్వాత 1980లో మురళీమోహన్ సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ మూవీస్‌ను ప్రారంభించి 25 సినిమాలు నిర్మించారు. ఈ బేనర్‌లో 2005లో వచ్చిన చివరి సినిమా అతడు.
50 సంవత్సరాల సినీ కెరీర్‌లో మురళీమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 350 సినిమాల్లో నటించారు. వైవిధ్యమైన పాత్రలు పోషించాలన్న ఉద్దేశంతో సినిమాల ఎంపిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఆశించిన పాత్రలే లభిస్తున్నాయి. నటుడు, నిర్మాతగానే కాకుండా సినిమా రంగానికి సంబంధించి కొన్ని పదవుల్లో కూడా ఆయన పనిచేశారు. నేషనల్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించారు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు గౌరవాధ్యక్షునిగా వ్యవహరించారు. హీరో శోభన్‌బాబు ఇచ్చిన సలహా మేరకు తను సినిమాల్లో సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి అక్కడ కూడా మంచి విజయాలు సాధించారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రత్యర్థి ఉండవల్లి అరుణ్‌కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో అదే స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు మురళీమోహన్. ఆ తర్వాత మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసన్ పూర్తి చేసేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ ద్వారా 10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసన్ పూర్తి చేశారు.
(జూన్ 24 మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా..)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



