ENGLISH | TELUGU  

ఎన్టీఆర్ 'దేశోద్ధారకులు' విడుదలై నేటికి 50 వసంతాలు

on Mar 28, 2023

 

శకపురుషుడు నందమూరి తారకరామారావు నటించిన తొలి రంగుల సాంఘిక చిత్రం 'దేశోద్ధారకులు'. ఎన్టీఆర్ మేనత్త కుమారుడు, అభిరుచి కలిగిన నిర్మాత, దర్శకునిగా పేరున్న యు. విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.యస్. రావు దర్శకత్వం వహించారు. దీప్తి ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో తారకరాముని జోడీగా అప్పటి అగ్ర తార వాణిశ్రీ నటించారు. ప్రేక్షకుల విశేషాదరణ పొందిన దేశోద్ధారకులు సినిమా సరిగ్గా 50 ఏళ్ల క్రితం.. 1973 మార్చి 29న విడుదలైంది. కె.వి. మహదేవన్ స్వరాలు కూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ పాపులరే.

తెలుగులో తొలి పూర్తి కలర్ ఫిల్మ్ 'లవకుశ' (1963)లో నటించిన ఎన్టీఆర్ తన తొలి కలర్ సోషల్ ఫిలింలో నటించడానికి ఏకంగా పదేళ్ల కాలం తీసుకోవడం గమనార్హం. ఆ రోజుల్లో తెలుగు నిర్మాతలకు కలర్ ఫిల్మ్ లభించేది కాదు. పేరున్న సంస్థలు, ల్యాబ్‌లకు మాత్రమే కోటా లభించేది. ఎన్టీఆర్‌తో కలర్ ఫిల్మ్ తీయాలని విశ్వేశ్వరరావు నిర్ణయించుకున్నారు. డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్‌ను ఈ విషయం చెబితే, ఆయన కలర్ ఫిల్మ్ ఇప్పించారు. 'దేశోద్ధారకులు' నిర్మించడానికి రూ. 35 లక్షలు వెచ్చించారు. అప్పట్లో అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువ. ఈ విషయంలో నిర్మాత నాగిరెడ్డి ఆయన మందలించారు కూడా. సినిమా ఫలితంపై భరోసా ఉండటంతో విశ్వేశ్వరరావు ఆందోళన పడలేదు. ఆయన నమ్మకం నిజమై రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి. 30 రోజుల్లోనే 30 లక్షలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది 'దేశోద్ధారకులు'. 12 కేంద్రాల్లో 100 రోజులు నడిచిన ఈ చిత్రం కడపలో 210 రోజులు ఆడింది.

గోపాలరావు అలియాస్ గోపి చందరంగంలో నిపుణుడు. పోటీలో పోలీస్ కమిషనర్ ప్రభాకర రావును ఓడించడమే కాకుండా ఆయన కుమార్తె రాధ హృదయాన్నీ కొల్లగొడతాడు. ప్రజాబంధుగా పేరుపొందిన రాజభూషణం నిజానికి ఒక దుష్టుడు. కుట్రపన్ని గోపి అన్నయ్య ఆంధ్రా నేషనల్ బ్యాంక్ ఏజెంట్ అయిన రాజారావును దొంగ నోట్ల నేరంపై జైలుకు వెళ్లేట్లు చేస్తాడు. ఆ తర్వాత తన తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి గోపికి. తండ్రి చావు వెనుక ఉన్నది ప్రభాకరరావు అని భావించిన గోపి ఆయనతో ఘర్షణ పడతాడు. ఆ సందర్భంలో ప్రభాకరరావు మరణిస్తాడు. తండి చావుకు గోపి కారణమని అతడిని ద్వేషిస్తుంది రాధ. గోపి జైలుపాలవుతాడు. తర్వాత అతను బ్రౌన్ దొర పేరుతో విదేశాల నుంచి వస్తాడు. రాధకు తన సెక్రటరీగా ఉద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత అసలు దొంగలను అతను ఎలా బయటపెట్టాడనేది క్లైమాక్స్.

మబ్బులు రెండు భేటీ అయితే మెరుపే వస్తుందీ, స్వాగతం దొరా సుస్వాగతం, కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు, ఈ వీణకు శృతిలేదు, ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు, ఇది కాదు మా ప్రగతి పాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తాయి. ఈ పాటలను ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, విశ్వేశ్వరరావు, మోదుకూరి జాన్సన్ రాశారు.

"పనిచెయ్యకుండా పుచ్చుకునేది జీతం, చేస్తానని పుచ్చుకునేది లంచం, చేసి పుచ్చుకునేది లాంఛనం" లాంటి డైలాగ్స్ బాగా పేలాయి. మహారధి, మోదుకూరి జాన్సన్ ఈ చిత్రానికి మాటలు రాశారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైన్, ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్ పోషించిన విధానం ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి. నాయిక రాధ పాత్రలో వాణిశ్రీ చులాగా ఇమిడిపోయారు. ఎన్టీఆర్, వాణిశ్రీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్ అనింపించేట్లు ఉంటుంది. మెయిన్ విలన్‌గా నాగభూషణం తనదైన డైలాగ్ డిక్షన్‌తో అదరగొట్టగా, మితగా విలన్ పాత్రధారులు రాజనాల, సత్యనారాయణ, త్యాగరాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నిజాయితీగా బతకాలనుకొని, చివరకు పిచ్చివాడైపోయే పాత్రలో పద్మనాభం మెప్పించారు. సీబీఐ ఆఫీసర్‌గా రావు గోపాలరావు కనిపిస్తారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.