డాషింగ్ అండ్ డేరింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో సూపర్‌స్టార్ కృష్ణ!
on May 31, 2025
తెలుగు చలనచిత్ర సీమకి ఎంతో మంది హీరోలుగా వచ్చారు. పాతతరం నుంచి ఇప్పటివరకు మహానటులుగా, ప్రేక్షకుల పాలిట ఆరాధ్యదైవాలుగా, ఎవర్‌గ్రీన్ హీరోలుగా వెలుగొందారు. అయితే వారందరిలో సూపర్‌స్టార్ కృష్ణకు మాత్రం ఒక విశిష్ట స్థానం ఉంది. ఆ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చెయ్యలేరు, ఆయనతో ఎవరినీ పోల్చలేరు. ఎందుకంటే సినిమా రంగంలో కృష్ణ సాధించిన విజయాలు, క్రియేట్ చేసిన ట్రెండ్స్ అలాంటివి. 55 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో సూపర్‌స్టార్ కృష్ణ సాధించిన విజయాలు అనన్య సామాన్యం. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా చేసిన ప్రయోగాలు, సాహసాల గురించి వింటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక స్థాయికి రావడానికి ఆయన ఎంత కృషి చేశారో అర్థమవుతుంది. సాధారణంగా కొందరు హీరోలను నిర్మాతల హీరో అంటూ ఉంటారు. కానీ, అసలైన నిర్మాతల హీరో సూపర్‌స్టార్ కృష్ణ. అందుకే సినీ పరిశ్రమలో ఎవరికీ లేని ‘దేవుడు’ అనే పేరు ఆయనకు ఉంది. అలాంటి కృష్ణ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తీరు గురించి, సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.
కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెంలో జన్మించారు. ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు ఆయన పెద్ద కొడుకు. హనుమంతరావు, ఆదిశేషగిరిరావు సోదరులు. వారిది రైతు కుటుంబం. కృష్ణను ఇంజనీరుగా చూడాలన్నది తల్లిదండ్రుల కోరిక. అందుకే ఇంటర్‌లో ఎం.పి.సి. గ్రూప్ కోసం కొన్ని కాలేజీల్లో ప్రయత్నించి చివరికి ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కాలేజీలో చేరారు. అక్కడే బి.ఎస్.సి. పూర్తి చేశారు. ప్రముఖ నటుడు మురళీమోహన్ ఆయనకు క్లాస్‌మేట్. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఓసారి ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. వేలసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అక్కినేనికి ఉన్న ఫాలోయింగ్ చూసిన కృష్ణ.. ఆయన సినిమా స్టార్ కావడం వల్లే అంత పాపులారిటీ వచ్చిందని గ్రహించారు. తను కూడా ఎందుకు హీరో అవ్వకూడదు అనుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తనకు సినిమా రంగానికి వెళ్ళాలని ఉంది అని తండ్రితో చెప్పారు కృష్ణ. ఆయన కూడా దానికి అంగీకరించి సినిమా రంగంలో తనకు తెలిసిన ఇద్దరిని కలవమని చెప్పి రెండు ఉత్తరాలు రాసిచ్చారు. ఆ క్రమంలోనే ఎల్.వి.ప్రసాద్, చక్రపాణిలను కలిశారు. అయితే వయసులో చిన్నవాడు కావడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత అయితే హీరోగా బాగుంటావని వారు చెప్పారు. అలాగే నాటకాలు వేస్తే నటనపై మంచి అవగాహన వస్తుందని సలహా ఇచ్చారు. ఆ తర్వాత తెనాలి నుంచి సినిమా రంగానికి వచ్చిన జగ్గయ్య, గుమ్మడిలను కలిశారు. వాళ్ళు కూడా అదే చెప్పడంతో గరికపాటి రాజారావు, మరికొంతమంది వేసిన నాటకాల్లో వివిధ పాత్రలు పోషించి నటనలోని మెళకువలు తెలుసుకున్నారు.
తన దగ్గరికి వేషం కోసం వచ్చిన కృష్ణను గుర్తుపెట్టుకున్న ఎల్.వి.ప్రసాద్.. తను తీస్తున్న కొడుకులు కోడళ్లు చిత్రంలో ఒక పాత్రకు ఎంపిక చేశామని కబురు చేశారు. నలుగురు కొడుకుల్లో ఒక కొడుకుగా కృష్ణను, మరో కొడుకుగా శోభన్‌బాబును ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు కృష్ణ. ఆ క్రమంలోనే పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అదే సమయంలో కాదలిక్క నేరమిల్లై అనే తమిళ చిత్రంలో కృష్ణను హీరోగా ఎంపిక చేశారు దర్శకుడు సి.వి.శ్రీధర్. ఆ సినిమా కోసం కృష్ణను తమిళ్ నేర్చుకోమని చెప్పారు. కానీ, ఎంత ప్రయత్నించినా ఆయనకు తమిళ్ రాలేదు. అలా ఆ అవకాశాన్ని కోల్పోవడంతో తిరిగి బుర్రిపాలెం వెళ్లిపోయారు కృష్ణ.
1964లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందిస్తున్న తేనెమనసులు కోసం కొత్త నటీనటులు కావాలని పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. అది చూసి తన వివరాలతోపాటు ఫోటోలు పంపారు కృష్ణ. ఆడిషన్‌కి మద్రాస్ రావాల్సిందిగా కృష్ణకు పిలుపు వచ్చింది. ఆ ఆడిషన్‌కు కృష్ణంరాజు, జయలలిత, హేమమాలిని కూడా వచ్చారు. కానీ, కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. మరో హీరోగా రామ్మోహన్, హీరోయిన్లుగా సంధ్యారాణి, సుకన్యలను ఎంపిక చేశారు. సినిమాను ప్రారంభించి ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ సమయంలో కొత్తగా వచ్చిన కలర్ ఫిల్మ్‌పై దర్శకనిర్మాతలు మక్కువ చూపేవారు. అందరూ కొత్త నటీనటులు కావడం, బడ్జెట్ కూడా తక్కువ అవడం వల్ల సినిమాను కలర్‌లోనే తియ్యాలని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత సుందరం అనుకున్నారు. అప్పటివరకు తీసిన దాన్ని పక్కన పెట్టేసి కలర్‌లో మళ్ళీ మొదలుపెట్టారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి 1965 మార్చి 31న తేనెమనసులు చిత్రాన్ని విడుదల చేశారు. అందరూ కొత్తవారైనా సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ప్రారంభానికి ముందే తమ బేనర్‌లో మరో సినిమా చేసే విధంగా కృష్ణతో అగ్రిమెంట్ చేసుకున్నారు నిర్మాతలు. దాని ప్రకారమే కన్నెమనసులు సినిమాలోనూ నటించారు కృష్ణ. 1966లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. తేనెమనసులు సినిమాలో కృష్ణతో కలిసి నటించిన రామ్మోహన్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని అందరూ భావించారు. కానీ, కృష్ణ హీరోగా నిలదొక్కుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.
కన్నెమనసులు రిలీజ్ అయిన సంవత్సరమే కృష్ణ కెరీర్ మలుపు తిరిగింది. 1962లో హాలీవుడ్‌లో మొదటి జేమ్స్‌బాండ్ సినిమా డాక్టర్ నో రిలీజ్ అయింది. అది ఇండియాలో కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తెలుగులో జేమ్స్‌బాండ్ సినిమా చెయ్యాలని భావించారు నిర్మాత డూండీ. ఆ క్యారెక్టర్‌కి కృష్ణ అయితే కరెక్ట్‌గా సూట్ అవుతాడనుకున్నారు. అలా అనుకోవడానికి కారణం.. తేనెమనసులు చిత్రంలోని ఓ కార్ ఛేజ్‌లో స్కూటర్ పై నుంచి కారులోకి జంప్ చేసే సీన్‌లో కృష్ణ డూప్ లేకుండా నటించారు. అది చూసిన డూండీ అలా ఫిక్స్ అయ్యారు. 1966 ఆగస్ట్ 11న ‘గూఢచారి 116’ విడుదలై ఘనవిజయం సాధించింది. కృష్ణపై డూండీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అప్పటివరకు తెలుగులో రాని ఓ కొత్త జోనర్‌లో రూపొందిన ‘గూఢచారి 116’ సూపర్‌హిట్ అవ్వడంతో వెంటనే 20 సినిమాల్లో హీరోగా బుక్ అయిపోయారు కృష్ణ. ఆ ఒక్క సినిమాతో అవకాశాలు కృష్ణను వెతుక్కుంటూ వచ్చాయి. గూఢచారి 116 తర్వాత 20 సంవత్సరాల వ్యవధిలో మరో 6 జేమ్స్‌బాండ్ తరహా సినిమాలు చేశారు. అవన్నీ విజయం సాధించాయి. 1967లో కృష్ణ నటించిన ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో సాక్షి, మరపురాని కథ, అవేకళ్ళు వంటి మంచి సినిమాలు ఉన్నాయి.
ఆ తర్వాత.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తీరిక లేని హీరో అయిపోయారు కృష్ణ. ఏ నిర్మాతకు ఏ సినిమా చేస్తున్నారో కూడా అర్థం కాని విధంగా షూటింగ్‌లో పాల్గొనేవారు. రోజుకి మూడు షిప్టుల చొప్పున విరామం లేకుండా పనిచేసేవారు. ఆయన నిద్రపోతున్న సమయంలో తమ సినిమాలో నిద్రపోతున్న సీన్స్‌ను తీసుకున్న దర్శకులు కూడా ఉన్నారు. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో 16 సినిమాలు, 1970లో 15 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు.. ఇలా ప్రతి సంవత్సరం పదికి తక్కువ కాకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ప్రతి నెలా కృష్ణ హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయ్యేది. ఒకే నెలలో రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నాను అని బాధపడేవారు కృష్ణ. దీంతో పద్మాలయా పిక్చర్స్ పేరుతో తనే ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి సినిమాగా అగ్నిపరీక్ష నిర్మించారు. సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ప్రొడక్షన్‌కి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నారు. ఆ సినిమా విజయం సాధించలేదు. దాంతో 1971లో అప్పటివరకు తెలుగులోనే కాదు, ఇండియాలోనే రాని ఓ కొత్త తరహా సినిమాకి శ్రీకారం చుట్టారు కృష్ణ. అదే మోసగాళ్లకు మోసగాడు. ఇండియాలో నిర్మించిన మొట్టమొదటి కౌబాయ్ మూవీ ఇది. రూ.7 లక్షల బడ్జెట్‌తో దేశంలోని వివిధ లొకేషన్స్‌లో ఎంతో శ్రమకోర్చి నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ కంటే సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్‌లలో ఎక్కువ కలెక్ట్ చేసింది. ఈ సినిమాను ట్రెజర్ హంట్ పేరుతో ఇంగ్లీష్‌లోకి అనువదించారు. ఇండియాలోనే తొలిసారి ఇంగ్లీష్‌లోకి అనువదించిన చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు రికార్డు క్రియేట్ చేసింది. 123 దేశాల్లో ట్రెజర్ హంట్ విడుదలై ఘనవిజయం సాధించింది. మోసగాళ్ళకు మోసగాడు చిత్రంతో కృష్ణకు స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రభాకరరెడ్డితో కలిసి నిర్మించిన పండంటి కాపురంతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు కృష్ణ. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
1974 సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో అత్యంత కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇదే సంవత్సరం తెలుగు చలనచిత్ర సీమ ప్రతిష్టను పెంచే విధంగా పద్మాలయా పిక్చర్స్ బేనర్‌లో అల్లూరి సీతారామరాజు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కృష్ణ. అంతకు కొన్ని సంవత్సరాల ముందు ఎన్.టి.రామారావు.. సీతారామరాజు జీవిత చరిత్రను తెరకెక్కించాలనుకున్నారు. స్క్రిప్ట్ కూడా తయారు చేయించారు. కానీ, అది ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబులతో కూడా అల్లూరి జీవిత చరిత్రను సినిమాగా తియ్యాలని విఫల యత్నం చేశారు. చివరికి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసేందుకు కృష్ణ సిద్ధపడ్డారు. అల్లూరి సీతారామరాజు.. కృష్ణకు 100వ సినిమా. తెలుగులో తొలి సినిమా స్కోప్ సినిమా కూడా ఇదే. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 30 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు వి.రామచంద్రరావు మరణించారు. స్నేహితుల సలహాతో మిగిలిన భాగాన్ని తన దర్శకత్వంలోనే పూర్తి చేశారు కృష్ణ. సినిమాలోని పోరాట సన్నివేశాలను కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించారు. అయితే దర్శకుడుగా వి.రామచంద్రరావు పేరునే వేశారు. ప్రివ్యూ చూసిన నిర్మాత చక్రపాణి ‘ఈ సినిమా తర్వాత నువ్వు చేసిన 10 సినిమాలు ఫ్లాప్ అవుతాయి. సీతారామరాజుగా నిన్ను చూసిన ప్రేక్షకులు మరో పాత్రలో ఊహించుకోలేరు’ అని చెప్పారు. 1974 మే 1న విడుదలైన అల్లూరి సీతారామరాజు అఖండ విజయాన్ని దక్కించుకుంది. చక్రపాణి చెప్పినట్టుగానే ఆ తర్వాత కృష్ణ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వాటిలో కృష్ణ ఎంతో సాహసోపేతంగా రీమేక్ చేసిన దేవదాసు కూడా ఉంది.
ఒక్కసారిగా సినిమా అవకాశాలు తగ్గి, ఆయన కెరీర్ స్తబ్దుగా మారిపోయింది. ఆ సమయంలోనే ధైర్యం తెచ్చుకొని పాడిపంటలు చిత్రాన్ని సొంత బేనర్‌లో నిర్మించారు. పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో కృష్ణ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఆ తర్వాత భలే దొంగలు, దేవుడే గెలిచాడు, అన్నదమ్ముల సవాల్, కొత్తపేట రౌడీ, ఊరికి మొనగాడు, ఘరానా దొంగ వంటి సూపర్‌హిట్ సినిమాలు చేశారు. మూడు దశాబ్దాల కాలంలో సగటున సంవత్సరానికి 10 సినిమాలు చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు కృష్ణ. 1989 వరకు సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్ ఉజ్వలంగా సాగింది. అప్పటివరకు 274 సినిమాలు పూర్తి కాగా, మరో పది సంవత్సరాల్లో కేవలం 44 సినిమాలు మాత్రమే చేయగలిగారు. హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించారు.
1986లో సింహాసనం చిత్రంతో దర్శకుడిగా మారారు కృష్ణ. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో జితేంద్ర హీరోగా నటించారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. తెలుగులో 70ఎంఎం స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో రూపొందిన తొలి సినిమా ఇదే. ఆ తర్వాత శంఖారావం, నా పిలుపే ప్రభంజనం, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు.. ఇలా 16 సినిమాలకు దర్శకత్వం వహించారు కృష్ణ. స్వతహాగా కాంగ్రెస్ అభిమాని అయిన కృష్ణ.. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్‌గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్‌లో చేరి 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 1991లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హత్యకు గురి కావడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు కృష్ణ.
సూపర్‌స్టార్ కృష్ణకు 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. అలాగే ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. అలాగే ఎఎన్నార్ నేషనల్ అవార్డును కూడా కృష్ణ అందుకున్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలోని అద్భుత నటనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడుగా నంది అవార్డును అందించింది. 55 సంవత్సరాల కెరీర్‌లో 360 సినిమాల్లో తన అసమాన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సూపర్‌స్టార్ కృష్ణ.
ఇక సూపర్‌స్టార్ కెరీర్‌లోని ప్రత్యేకమైన విశిష్టతల గురించి చెప్పాలంటే.. కృష్ణ నటించిన తేనెమనసులు తెలుగులో నిర్మించిన తొలి కలర్ సాంఘిక చిత్రం. గూఢచారి 116 తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ మూవీ. మోసగాళ్ళకు మోసగాడు ఇండియాలోనే తొలి కౌబాయ్ మూవీ. కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు తెలుగులో తొలి సినిమా స్కోప్ మూవీ. కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన సింహాసనం తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా. స్టీరియోఫోనిక్ సౌండ్ కూడా ఈ సినిమాతోనే ప్రారంభమైంది. టాలీవుడ్‌లో ఏ హీరోకీ లేని విధంగా కృష్ణకు 2,500 అభిమాన సంఘాలు ఉండేవి. మద్రాస్‌లో జరిగిన సింహాసనం 100 రోజుల ఫంక్షన్‌కు వివిధ ప్రాంతాల నుంచి 400 బస్సుల్లో 30,000 మంది అభిమానులు హాజరయ్యారు.
వ్యక్తిగత విషయాలకు వస్తే.. కృష్ణ తొలి సినిమా తేనెమనసులు రిలీజ్ అయ్యే సమయానికే ఇందిరతో వివాహం జరిగింది. ఆ తర్వాత 1969లో ఆమె అనుమతితోనే నటి విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు. కృష్ణ నటవారసుడుగా తండ్రి పేరును నిలబెడుతున్నారు మహేష్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. 1987లో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబును హీరోగా పరిచయం చేశారు. అయితే ఆయన హీరోగా సక్సెస్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు కూడా హీరోగా రాణిస్తున్నారు. విజయనిర్మల మరణం తర్వాత మానసికంగా కృంగిపోయిన కృష్ణ కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. 2022 నవంబరు 15న కార్డియాక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కృష్ణ తన జీవితంలోని ఆఖరి మూడు సంవత్సరాల్లో రెండవ భార్య విజయనిర్మల (2019), పెద్ద కుమారుడు రమేష్‌బాబు (2022), మొదటి భార్య ఇందిరాదేవి (2022) మరణాలు చూడవలసి వచ్చింది.
(మే 31 సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా..)

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
