2010 తర్వాత లతా మంగేష్కర్ సినిమా పాటలు పాడకపోవడానికి రీజన్ ఇదే!
on Feb 6, 2025
నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ మెలోడీ, వాయిస్ ఆఫ్ ది మిలీనియం, లతా దీది.. ఇలాంటి అరుదైన బిరుదులు కలిగిన ఏకైక గాయని లతా మంగేష్కర్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన భారతావనిని తన మధుర గానంతో అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. సినీ సంగీత ప్రపంచానికి లభించిన ఓ ఆణిముత్యం లతా దీది. ఆమె గానం, ఆమె గళం ఎందరో యువ గాయనీగాయకులకు స్ఫూర్తి. ఈనాటికీ లత గాన మాధుర్యాన్ని ఎంతో మంది ఆస్వాదిస్తున్నారు. 70 సంవత్సరాలపాటు తన గానంతో అలరించిన లత.. 36 దేశ, విదేశీ భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలను రికార్డ్ చేసిన గాయనిగా 1974లో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదా సాహెబ్ పాల్కే వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఏకైక గాయనీమణి లతా మంగేష్కర్. ఆమె సినీరంగ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఆమె నేపథ్యం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.
1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు లత. తండ్రి దీనానాథ్ మంగేష్కర్‌కు ఐదురుగు సంతానం. వారిలో పెద్ద కుమార్తె లత. ఆమె తర్వాత ఆశా, హృదయనాథ్, ఉషా, మీనా జన్మించారు. దీనానాథ్ సంగీత కళాకారుడు, రంగస్థల నటుడు. తన ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టారు లత. సంగీతం వినడం, పాడడం తప్ప ఆమెకు మరో లోకం తెలియదు. తన తర్వాతి వారు కూడా చదువు కంటే సంగీతంపైనే ఆసక్తి చూపించడంతో ఆ కుటుంబమంతా సంగీతమయం అయిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా దీనానాథ్ ఆరోగ్యం క్షీణించడంతో 1942లో మరణించారు. దాంతో పదమూడేళ్ళకే కుటుంబాన్ని పోషించే బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలో ప్రవేశించి 1942లోనే మరాఠి చిత్రంలో రెండు పాటలు పాడడమే కాకుండా ఆ సినిమాలో నటించారు కూడా. ఆ తర్వాత చిముక్లా సుసార్, గజెభావు, జీవన్ యాత్ర, మందిర్ వంటి సినిమాల్లో నటించారు.
1947లో మజ్‌బూర్ చిత్రంతో పూర్తి స్థాయి గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారు లత. అప్పటికే ప్రముఖ గాయనీమణులుగా ఉన్న ఖుర్షీద్, నూర్జహాన్‌లు దేశ విభజన కారణంగా పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఆ సమయంలోనే నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యం పెరగడం వల్ల లత గాయనిగా ఉన్నత శిఖరాలకు చేరేందుకు అవకాశం లభించింది. మొదట్లో సంగీత దర్శకుడు గులాం హైదర్.. లతను ప్రోత్సహించారు. ఆ తర్వాత మరో సంగీత దర్శకుడు సి.రామచంద్ర లతా మంగేష్కర్ పాట ఉన్నత శిఖరాలకు చేరేందుకు దోహదపడ్డారు. లత పాటను ఇష్టపడని వారు లేరు అనేంతగా తన గానంతో అలరించారు. హిందీ చిత్రసీమలో పాత తరం సంగీత దర్శకులే కాకుండా ఆ తర్వాత వచ్చిన ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ అనంద్ జీ, బప్పీలహరి, రాంలక్ష్మణ్‌లతో సహా తర్వాతి తరం సంగీత దర్శకులు కూడా లతతో పాడించుకోవడం ఓ అదృష్టంగా భావించారు. అయితే 1950వ దశకంలో సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్‌తో ఏర్పడిన వివాదం కారణంగా లతతో ఒక్క పాట కూడా ఆయన పాడించలేదు. అయితే ఆమె సోదరి ఆశాభోస్లేను బాగా ప్రోత్సహించారు ఓ.పి.నయ్యర్.
లతా మంగేష్కర్ గాయనిగానే కాకుండా సంగీత దర్శకురాలిగా కూడా పనిచేశారు. రాంరాంపహునా, మొహిత్యాంచి మంజుల, మరాఠా టిటుకమేల్ వాలా, స్వాథూ మాన్ సే వంటి కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించారు. అలాగే చిత్ర నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టారు. మరాఠీలో వాదల్, కాంచన్ గంగా, హిందీలో జాంజర్, లేకిన్ చిత్రాలు నిర్మించారు. తనకు ఇష్టమైన సంగీత దర్శకుడు మదన్‌మోహన్ అని, ఇష్టమైన సింగర్ కె.ఎల్.సైగల్ అని చెప్పేవారు లత. లతా మంగేష్కర్ సోదరీమణులు ఆశాభోస్లే, ఉషా మంగేష్కర్ కూడా సింగర్స్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించారు. తెలుగులో కూడా లతా మంగేష్కర్ పాటలు పాడారు. 1955లో వచ్చిన సంతానం చిత్రంలోని ‘నిదురపోరా తమ్ముడా..’ అనే పాట అప్పట్లో విశేష ఆదరణ పొందింది. ఇప్పటికీ ఆ పాటను వింటూనే ఉంటారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఆఖరిపోరాటం చిత్రంలో ‘తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా’ అనే పాటను పాడారు. అలాగే హిందీలో సూపర్‌హిట్ అయిన ‘చాందిని’ చిత్రాన్ని తెలుగులో ‘శ్రీదేవి’ పేరుతో డబ్ చేశారు. హిందీ వెర్షన్‌లో తను పాడిన పాటలను తెలుగులో కూడా లతా మంగేష్కరే పాడారు.
1972లో గీత రచయిత గుల్జార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘పరిచయ్’ చిత్రంలోని ‘బీతి న బితాయ్ రైనా..’ అనే పాటకు, 1974లో అనిల్ గంగూలి దర్శకత్వం వహించిన ‘కోరా కాగజ్’ చిత్రంలోని ‘రూటే రూటే పియా..’ పాటలకు ఉత్తమ నేపథ్యగాయనిగా లతా మంగేష్కర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ రెండు పాటల్లోనూ జయా బచ్చన్ నటించడం విశేషం. ఆ తర్వాత 1992లో లతా మంగేష్కర్ స్వయంగా నిర్మించిన ‘లేకిన్’ చిత్రంలోని ‘యారా సిలి సిలి..’ పాటకు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు. ఈ చిత్రానికి ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీతాన్ని అందించారు. అతనికి కూడా ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు లభించింది. అలాగే లతా మంగేష్కర్ 6 ఫిలింఫేర్ అవార్డులు, జర్నలిస్ట్స్ అసోసియేషన్స్ ఇచ్చే అవార్డులు 15 అందుకున్నారు. అంతేకాదు, ఫ్రాన్స్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం లెజెండ్ ఆఫ్ హానర్ అవార్డు లతా మంగేష్కర్‌ను వరించింది. ఆ తర్వాత ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు, ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డులు కూడా లత అందుకున్నారు. ఇక వివిధ సంస్థల నుంచి, యూనివర్సిటీల నుంచి ఆమె పొందిన సత్కారాలు, అందుకున్న అవార్డులు వందల సంఖ్యలో ఉంటాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
1963 జనవరి 27న చైనా, భారత యుద్ధ సమయంలో అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో ‘ఏ మేరే వతన్‌కి లోగో..’ పాటను ఆలపించారు. ఆ పాట విన్న నెహ్రూ కంటతడి పెట్టుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన లత 2000 సంవత్సరం తర్వాత పాటలు తగ్గించుకున్నారు. దానికి కారణం ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘గతంలో మంచి సాహిత్యంతో, సంగీతంతో కూడిన పాటలు వచ్చేవి. కానీ, ఇప్పుడు వస్తున్న పాటల్లో బూతు వినిపిస్తోంది. అందుకే నేను పాటలు పాడడం ఈమధ్యకాలంలో తగ్గించాను’ అని చెప్పారు. 2006లో ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘రంగదే బసంతి’ చిత్రంలోని ‘లుకా చుపి..’ అనే పాట లతా మంగేష్కర్ చివరి సినిమా పాట. ఆ తర్వాత రెండు సినిమాల్లో పాటలు పాడినప్పటికీ చెప్పుకోదగిన పాట ఇదే. 2010 తర్వాత లతా మంగేష్కర్ సినిమా పాటలు పాడలేదు. 70 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్‌ను సాగించిన ఆమె చివరి వరకు అవివాహితగానే ఉండిపోయారు.
కరోనా తర్వాత తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు లతా మంగేష్కర్. ఆస్పత్రిలోనే కొన్నాళ్లు ఉన్న ఆమె చికిత్స పొందుతూ 2022 ఫిబ్రవరి 6న తుది శ్వాస విడిచారు. చనిపోయే నాటికి ఆమెకు 92 సంవత్సరాలు. లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఫిబ్రవరి 6, 7 తేదీలను సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అదే సంవత్సరం లతా మంగేష్కర్ స్మారక అవార్డును ఏర్పాటు చేశారు. తొలి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీకి 2022 ఏప్రిల్ 24న ప్రదానం చేశారు.
(ఫిబ్రవరి 6 గాయని లతా మంగేష్కర్ వర్థంతి సందర్భంగా..)

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
