భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా, చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ భారీ విజువల్ వండర్ ను రాబోయే దీపావళి కానుకగా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఈ లెక్కన చూసుకుంటే రిలీజ్ కు కేవలం మరో నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ ప్రమోషన్స్ పరంగా ఈ సినిమా టీమ్ నుంచి ఎలాంటి చొరవ కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం దర్శకుడు నితేష్ తివారి ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాత్రింబవళ్లు బిజీగా ఉన్నట్లు సమాచారం.
నిర్మాత నమిత్ మల్హోత్రా ఇండస్ట్రీలోనే అత్యధికంగా సుమారు 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు గతంలోనే హింట్ ఇచ్చారు. ఇంతటి భారీ పెట్టుబడి తిరిగి రావాలంటే కేవలం దేశీయంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. గ్లోబల్ ఆడియన్స్ కు మన పురాణ గాథను రీచ్ చేయించాలంటే ఇప్పటి నుంచే భారీ ఎత్తున మార్కెటింగ్ ప్లాన్ చేయాల్సి ఉండగా, మేకర్స్ ఇంకా సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరోవైపు ఇదే ఏడాది చివర్లో రాబోతున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబుల కొత్త సినిమా 'వారణాసి' కోసం ఇప్పటి నుంచే ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ మొదలైపోయింది. ఫారిన్ జర్నలిస్టులతో ఇంటర్వ్యూలు, ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రెజెంటేషన్స్ అంటూ రాజమౌళి టీమ్ ఒక పక్కా ప్రణాళికతో దూసుకుపోతోంది. వందల కోట్ల బిజినెస్ జరగాలంటే ఈ స్థాయి ప్రమోషనల్ ప్లానింగ్ అవసరమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కానీ ‘రామాయణ’ విషయంలో హీరో రన్బీర్ కపూర్ అక్కడక్కడా కొన్ని ఈవెంట్లలో మాట్లాడుతున్నా, అవి పెద్దగా జనాల్లోకి వెళ్లడం లేదు. ఇక రావణుడిగా నటిస్తున్న యష్ కు తన మరో ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ కు, దీనికి మధ్య ప్రమోషన్స్ మేనేజ్ చేయడం పెద్ద టాస్క్ లా మారింది. విచిత్రం ఏంటంటే, ఈ ఇద్దరు స్టార్ల ‘రామాయణ’, ‘టాక్సిక్’ చిత్రాల కచ్చితమైన రిలీజ్ డేట్స్ పై ఇప్పటికీ ఫ్యాన్స్ లో కొంత సస్పెన్స్ నడుస్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఈ సైలెన్స్ పై అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను పెట్టుకుని మేకర్స్ ఎందుకు ప్రమోషన్స్ మొదలుపెట్టడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీపావళి రేసులోకి దూసుకురావాలంటే ‘రామాయణ’ టీమ్ త్వరలోనే ఒక సాలిడ్ టీజర్ లేదా ట్రైలర్ తో అసలైన శబ్దం చేస్తుందేమో చూడాలి!





