
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ సెలబ్రిటీ మరొకరిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారంటే చాలు.. వారి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందనే ప్రచారం మొదలైపోతుంది. అలాంటిది ఏకంగా ఇండస్ట్రీని శాసించే స్టార్ డైరెక్టర్, నిర్మాత అయిన కరణ్ జోహార్ (Karan Johar) రాత్రికి రాత్రే బాలీవుడ్ అగ్ర తారలందరినీ అన్‌ఫాలో చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియన్లకు పైగా (1.7 కోట్లు) ఫాలోవర్లను కలిగిన కరణ్ జోహార్, తన ఫాలోయింగ్ లిస్ట్‌ను ఒక్కసారిగా భారీగా తగ్గించేశారు. కేవలం 16 అకౌంట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే, ఆయన అన్‌ఫాలో చేసిన వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, కాజల్, మలైకా అరోరా వంటి క్లోజ్ ఫ్రెండ్స్‌తో పాటు తను స్వయంగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. చివరికి తన బ్యానర్‌లో రాబోతున్న ‘నాగ్‌జిల్లా’ సినిమా హీరో కార్తీక్ ఆర్యన్‌ను కూడా కరణ్ వదల్లేదు.
ఈ ఊహించని పరిణామంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, ధర్మా ప్రొడక్షన్స్ పతనం అంటూ వార్తలు చెలరేగాయి. అయితే, దీనిపై నెటిజన్లు మరింత లోతుగా పరిశోధించగా అసలు కథ బయటకు వచ్చింది. కరణ్ జోహార్ బాలీవుడ్ ఇన్నర్ సర్కిల్‌ను మొత్తం పక్కన పెట్టినప్పటికీ, నలుగురు పాకిస్థానీ నటులను మాత్రం ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్, అలీ జాఫర్ మరియు ఇమ్రాన్ అబ్బాస్ వంటి పాకిస్థానీ స్టార్స్ కరణ్ ఫాలోయింగ్ లిస్ట్‌లో అలాగే కొనసాగుతున్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్లను కాదని, ఈ నలుగురు పాక్ సెలబ్రిటీలను కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచుకోవడంపై ఇరు దేశాల సోషల్ మీడియా వేదికల్లో తీవ్రమైన వివాదం రాజుకుంది.
వివాదం ముదురుతుండటంతో వెంటనే అలెర్ట్ అయిన కరణ్.. ఆ పాకిస్థానీ నటులను కూడా అన్‌ఫాలో చేశారు. దీంతో ఇప్పుడు ఆయన ఫాలో అవుతున్న లిస్ట్ 12 కి చేరింది.
ఏది ఏమైనా కరణ్ జోహార్ బాలీవుడ్ స్టార్స్ ని అన్‌ఫాలో చేయడం వెనుక ఏదైనా టెక్నికల్ గ్లిచ్ కారణమా లేక దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది.





