గెలుపు ఎవరిదైనా స్ఫూర్తి గొప్పదంటున్న భూమి!
on Apr 28, 2023
బాలీవుడ్ సినిమాలతో దగ్గరి పరిచయం ఉన్నవారికి భూమి ఫడ్నేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవార్డులు నాకు వచ్చినా సరే, అవార్డుల వేదిక మీద ఎవరున్నా సరే, చూడ్డానికి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే గెలుపు ఎప్పుడూ జనాల్లో స్ఫూర్తి నింపుతూ ఉంటుంది అని అన్నారు భూమి ఫడ్నేకర్. ఆమె నటించిన బదాయి దో సినిమా ఫిల్మ్ ఫేర్‌కి నామినేట్ అయింది. ఈ సినిమాకు 14 కేటగిరీల్లో నామినేషన్లు దక్కితే, రెండు కేటగిరీల్లో భూమి పోటీ పడుతున్నారు. `` నా కెరీర్‌లో బదాయి దో చాలా స్పెషల్ సినిమా. నా జనరేషన్‌కి మాత్రమే కాదు, ఫ్యూచర్ జనరేషన్లకు కూడా చాలా కీలకమైన సినిమా ఇది. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ రైట్స్ గురించి మాట్లాడిన సినిమా. ఈ చిత్రం విడుదలైనప్పుడు కూడా విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అవార్డుల వేదిక మీద కూడా ఇన్నేసి నామినేషన్లు దక్కడం, సబ్జెక్టుకున్న వేల్యూని మరోసారి గుర్తుచేస్తోంది.
మంచి సందేశం ఇచ్చిన సినిమా బదాయిదో. చాలా బాగా తెరకెక్కించారు. అలాంటి గొప్ప సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్‌కి మంచి గుర్తింపు దక్కాలని ఆశిస్తున్నాను`` అని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఏడేళ్ల జర్నీని పూర్తి చేసుకున్నారు భూమి ఫడ్నేకర్. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అవార్డుల వేదికలను చూశానని అన్నారు. అవార్డుల వేడుకకు హాజరైన ప్రతిసారీ జీవితంలో ఇంకేదో సాధించాలన్న తాపత్రయం కలుగుతుందని అన్నారు. గెలిచిన వారి ముఖంలోని ఆనందంలో పాజిటివ్ ఆరా ఉంటుందని, ఆ ప్రదేశంలో ఉండటానికి తానెంతో ఇష్టపడతానని అన్నారు భూమి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
