'అసుర్ 2' సిరీస్ రివ్యూ
on Jun 6, 2023
తారాగణం: అర్షద్ వార్సి, బరుణ్ సోబ్తి, అనుప్రియ గోయెంకా, అభిషేక్ చౌహాన్, రిధి దోగ్రా, అదితి కల్‌కుంటే శ్యాంప్రసాద్, విశేష్ బన్సాల్, మీయాంగ్ చాంగ్, అమేయ్ వాఘ్, పవన్ చోప్రా, గౌరవ్ అరోరా, అథర్వ విశ్వకర్మ, కుల్‌ప్రీత్ యాదవ్, బర్ఖా సేన్‌గుప్తా
స్టొరీ, స్క్రీన్‌ప్లే: గౌరవ్ శుక్లా, అభిజీత్ ఖుమాన్
మ్యూజిక్: ధర్మరాజ్ భట్
సినిమాటోగ్రఫీ: రామానుజ్ దత్తా
ఎడిటింగ్: చారు టక్కర్
ప్రొడక్షన్ డిజైన్: శీతల్ దుగ్గల్
యాక్షన్: సునీల్ రోడ్రిగ్స్
నిర్మాతలు: భవేష్ మండాలియా, సెజల్ షా, గౌరవ్ శుక్లా
దర్శకత్వం: ఓని సేన్
ఓటీటీ ప్లాట్‌ఫాం: జియో సినిమా
దేశంలో విధ్వంసం సృస్టిస్తోన్న ఒక ముఖంలేని వ్యక్తి కథ 'అసుర్ 2'. మూడేళ్ల క్రితం 'వూట్'లో స్ట్రీమింగ్ అయ్యి జనాదరణ పొందిన మొదటి సిరీస్ ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే ఈ సెకండ్ సీజన్ మొదలవుతుంది. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూసిన సిరీస్ ఇది.
కథ
మిస్టీరియస్ మ్యాస్ శుభ్ జోషిని పట్టుకోలేకోవడంలో విఫలమయ్యాననే బాధను తట్టుకోలేకపోయిన ధనుంజయ్ రాజ్‌పుత్ అలియాస్ డీజే (అర్షద్ వార్సి).. ధర్మశాలకు పారిపోయి అక్కడ ఒక మఠంలో ఆశ్రయం పొందుతాడు. అతనికక్కడ జీవితంపై లోతైన అవగాహన కలిగిన అనంత్ (అథర్వ విశ్వకర్మ) అనే కుర్రాడు పరిచయమవుతాడు. కూతురు రియాను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోతాడు నిఖిల్ నాయర్ (బరుణ్ సోబ్తి). అతని భార్య నైనా (అనుప్రియ గోయెంకా) సైతం అదే బాధలో ఉన్నప్పటికీ రియాను చంపిన స్వాతి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. ఎట్టకేలకు స్వాతి మనాలిలో ఉన్న విషయం తెలుస్తుంది. మరోవైపు, తాను ముగ్గురు వ్యక్తుల్ని ఒకే సమయంలో.. రాత్రి 9.05 గంటలకు చంపబోతున్నానని సీబీఐకి సమాచారం ఇస్తాడు శుభ్ జోషి. ఏ ప్రదేశంలో చంపుతాడో క్లూస్ కూడా ఇస్తాడు కానీ, ఎవర్ని చంపాలనుకుంటోందీ మాత్రం చెప్పడు. సీబీఐ ఎంత ప్రయత్నించినా, శుభ్ చేసే హత్యల్ని ఆపలేకపోతుంది. అయితే హతులు ముగ్గురూ ఒకే సమయంలో హార్ట్ ఎటాక్‌తో ఎలా చనిపోయారో అర్థంకాక సీబీఐ ఆఫీసర్లు తలలు పట్టుకుంటారు. అంతకుముందే ఇషాని (అదితి కుల్‌కుంటే శ్యాంప్రసాద్) సీబీఐలో చేరుతుంది. లోలార్క్ దూబే మర్డర్ కేసులో పనిచేసేటప్పుడు రసూల్ షేక్ (అమేయ్ వాఘ్) హంతకుడని ఆమె గుర్తిస్తుంది. అదే విషయాన్ని తన సీనియర్లకు చెప్తుంది కానీ, వాళ్లు ఆమెను సీరియస్‌గా తీసుకోరు. శుభ్‌ని కనిపెట్టి, మరిన్ని హత్యలు జరక్కుండా ఆపడానికి సీబీఐ ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. అదేమిటి? రంగంలోకి దిగిన ఏటీఎఫ్ (యాంటి టెర్రరిస్ట్ ఫోర్స్) ఏం చేసింది?.. అనే ప్రశ్నలకు సమాధానాలు మిగతా సిరీస్‌లో చూస్తాం.
విశ్లేషణ
సిరీస్ ఆద్యంతం రసవత్తరంగా సాగడంలో స్క్రీన్‌ప్లే ప్రధాన పాత్ర వహించింది. థ్రిల్స్‌కు కొదవ ఉండదు. ఒక దాని తర్వాత ఒకటిగా ఉత్కంఠభరితమైన సన్నివేశాలు వచ్చి, కథలో లీనమయ్యేట్లు చేస్తాయి. శుభ్ క్యారెక్టరైజేషన్ విషయంలో రచయితలు చాలా శ్రద్ధ చూపినట్లు అర్థమవుతుంది. అతను వేసే ఎత్తులన్నీ నమ్మదగ్గవిగా ఉంటాయి. మొదటి సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా వచ్చిదంటే.. అది డైరెక్టర్ ఓని సేన్ టేకింగ్ మహత్యమే. అన్ని పాత్రల్నీ అతను చక్కగా తెరపై తీర్చిదిద్దాడు. మరీ ముఖ్యంగా శుభ్ క్యారెక్టర్‌ను అతను ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ప్రధాన కథకు ధనుంజయ్, నైనా, నిఖిల్, నుస్రత్ పాత్రల్ని అనుసంధానం చేసిన తీరు బాగుంది.
8 ఎపిసోడ్ల సుదీర్ఘమైన సిరీస్ అయినప్పటికీ, బోర్ కొట్టలేదంటే.. అది డైరెక్టర్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ వల్లే. అయితే మరెవరి సాయం తీసుకోకుండా తన ప్లాన్స్‌ను శుభ్ ఒంటరిగా అమలుచేయడం మాత్రం లాజికల్‌గా లేదని చెప్పాలి. అలాగే అనేక సందర్భాల్లో టెక్నాలజీ సాయంతో నేరగాళ్ల అనుపానుల్ని కనుక్కోగలిగే సీబీఐ ఆఫీసర్లు.. శుభ్ విషయంలో ఎందుకు అదే తరహా టెక్నాలజీని ఉపయోగించరో తెలీదు. తొలి సీజన్ వచ్చి మూడేళ్లవడంతో దాన్ని రిక్యాప్ చేస్తూ 'అసుర్ 2' మొదలవడం బాగానే ఉంది. మొదటి ఎపిసోడ్‌లో ముగ్గురు బాధితుల్ని హత్య చేసే సీన్, 7వ ఎపిసోడ్‌లో అనంత్ సీన్లు సూపర్ అనిపిస్తాయి. చివరి ఎపిసోడ్ అయితే రోమాలు నిక్కబొడుచుకొనే సీన్లతో పరిగెత్తి, టెర్రిఫిక్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది.
టెక్నికల్ అంశాలకొస్తే.. ధర్మరాజ్ భట్ బ్యాగ్రౌండ్ స్కోర్ సిరీస్‌కు ప్రాణం పోసింది. అనేక సన్నివేశాలను తన మ్యూజిక్‌తో వేరే లేవల్‌కు తీసుకుపోయాడు. రామానుజ్ దత్తా సినిమాటోగ్రఫీ సన్నివేశాల్లోని గాఢతను బాగా పట్టుకుంది. చాలా లొకేషన్లు తెరపై అందంగా కనిపించాయి. శీతల్ దుగ్గల్ ఆర్ట్ వర్క్ సూపర్బ్‌గా ఉంది. చారు టక్కర్ ఎడిటింగ్ సిరీస్‌కు ఒక ఎస్సెట్.
నటీనటుల పనితీరు
ఎప్పట్లాగే అర్షద్ వార్సి సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంతదాకా తనమీద ఉన్న కామిక్ ఇమేజ్‌ను తుడిచిపెట్టే అభినయాన్ని ధనుంజయ్ పాత్రలో ప్రదర్శించాడు. నిఖిల్ నాయర్ పాత్రలో బరుణ్ సోబ్తి సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. నైనా రోల్‌లో అనుప్రియ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత బాగుందో, ఆమె పర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో టాప్ క్లాస్‌లో ఉంది. రిధి డోగ్రాకు నటించడానికి ఎక్కువ అవకాశం లభించలేదు. కనిపించేది కాసేపే అయినా అదితి కల్‌కుంటే అదరగొట్టింది. శుభ్ క్యారెక్టర్‌లో అభిషేక్ చౌహాన్ నటనను మరచిపోలేం. అథర్వ విశ్వకర్మ సహా మిగతా నటులందరూ పాత్రల పరిధి మేరకు చేశారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
ప్రస్తుతం ఓటీటీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. 'అసుర్ 2' కూడా ఆ కోవకు చెందిన చక్కని సీక్వెల్. థ్రిల్లింగ్ సీన్స్, పకడ్బందీ స్క్రీన్‌ప్లే, ఉన్నత స్థాయి అభినయాలతో ఎక్కువమందిని ఆకట్టుకొనే సిరీస్. మొదటి సీజన్‌ను ఇష్టపడినవాళ్లను ఈ సీక్వెల్ మరింతగా అలరిస్తుంది.
- బుద్ధి యజ్ఞమూర్తి

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
