సమంతను ఎత్తుకొని హంగామా చేసిన అక్షయ్!
on Jul 19, 2022
'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్‌లో జాన్వీ కపూర్, సారా అలీఖాన్ తర్వాత వచ్చే ఎపిసోడ్‌లో సమంత, అక్షయ్ కుమార్ సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ వచ్చే గురువారం ప్రసారం కానున్నది. సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ ప్రోమోను షేర్ చేసిన కరణ్ జోహార్ ఇప్పుడు దీనికి సంబంధించిన మరో రసవత్తర గ్లింప్స్‌ను షేర్ చేశాడు. సమంతను అక్షయ్ ఎత్తుకొని సీటు దగ్గరకు తీసుకు రావడంతో ఈ క్లిప్ మొదలవుతుంది. ఆమె పెళ్లి గురించి సమంతను కరణ్ ప్రశ్నించడంతో, "సంతోషంగాలేని కాపురాలకు మీరే కారణం" అని ఆమె జవాబిచ్చింది. కారణం? "జీవితం 'కే3జీ' (కభీ ఖుషి కభీ గమ్)లా ఉంటుందని మీరు చూపించారు. నిజానికి, అది 'కేజీఎఫ్'లా ఉంటుంది" అని ఆమె చెప్పింది.
ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సందర్భంగా అక్షయ్‌ను కరణ్," టీనా (అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా) గురించి క్రిస్ రాక్ గనుక జోక్ వేసినట్లయితే, నువ్వేం చేస్తావ్?" అని ప్రశ్నించాడు. 94వ ఆస్కార్ అవార్డలు ప్రదానోత్సవంలో విల్ స్మిత్ భార్య జడా పింకెట్‌పై కమెడియన్ క్రిస్ రాక్ జోక్ వేయడం, విల్ స్మిత్ అతని చెంప పగలకొట్టడం మనకు తెలిసిందే. దీన్ని రిఫరెన్సుగా తీసుకొని అక్షయ్‌ను ప్రశ్నించాడు కరణ్. "అతని అంత్యక్రియలకు డబ్బు చెల్లిస్తాను" అని ఠక్కున జవాబిచ్చాడు అక్షయ్. దాంతో సమంత, కరణ్.. ఇద్దరూ బిగ్గరగా నవ్వేశారు.
ఈ వీడియోలో సమంతను బాచిలరెట్ పార్టీకి ఆతిథ్యం ఇవ్వడం గురించి కరణ్ అడగడం కూడా మనం చూడొచ్చు. "నువ్వు గనుక బ్యాచిలరెట్ పార్టీకి ఆతిథ్యం ఇస్తే, డాన్స్ చేయడానికి ఏ ఇద్దరు బాలీవుడ్ హంక్స్‌ను తీసుకొస్తావు?" అని కరణ్ ప్రశ్నించాడు. "రణవీర్ సింగ్, రణవీర్ సింగ్" అని రెండు పేర్లు అతనివే చెప్పింది సమంత. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
