English | Telugu
ఆహాలో బాలయ్య సరే.. పవన్, ప్రభాస్ లలో ఎవరిది పై చేయి అవుతుంది?
Updated : Jan 1, 2023
ప్రస్తుతం ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. పలు భారీ విదేశీ సంస్థలు మన దేశంలోకి ముఖ్యంగా తెలుగులోకి ప్రవేశించి తమ సత్తా చాటుతున్నాయి. ఇలాంటి సందర్భంలో గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఆహా అనే ఓటిటీ ఛానల్ పెట్టడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన తెలివైన వాడే కావచ్చు... ఆర్థికంగా బలవంతుడే కావచ్చు. కానీ ఆయన ఏకంగా విదేశీ భారీ పెట్టుబడి పెట్టే వారి ముందు ఏమాత్రం నిలబడగలరు? అని చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఒక్కసారిగా నందమూరి నటసింహం బాలకృష్ణను అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమానికి ఒప్పించడంతో ఆహా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అచ్చమైన తెలుగు ఓటిటీ ఛానల్ గా దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అది రోజు రోజుకు పెరుగుతోంది.
బాలయ్య తొలిసారి ఆహా కోసం హోస్ట్ అవతారం ఎత్తారు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్లో మొదటి ఎపిసోడ్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వచ్చారు. చివరి ఎపిసోడ్ కు మహేష్ బాబు రావడంతో ఎండ్ ఇచ్చారు. దాంతో ఆహా తెలుగు వారిలో బాగా పాపులర్ అయింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 ని కాస్త గ్యాప్ లో ప్రారంభించిన అల్లు అరవింద్.. బాలయ్య కున్న పేరు పరిచయాలతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లను పిలిపించి మొదటి ఎపిసోడ్ ను వావ్ అనిపించారు. అది కూడా ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. ఇక తాజాగా సీజన్ 1 కంటే సీజన్ 2 ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలయ్య స్టార్స్ తో చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఈ టాక్ షోకి ముందు బాలయ్య అంటే సీరియస్ గా ఉంటాడు.. సరదాగా మాట్లాడడు.. ఆయన సరిగా మాట్లాడటం కష్టమనే కామెంట్ మొదట్లో వినిపించాయి. అయితే అన్ స్టాపబుల్ షోలో బాలయ్య అతిధులుగా పాల్గొన్న వారితో సరదాగా మాట్లాడుతూ, పంచులు వేస్తూ, నవ్వులు పూయిస్తూ వారి నుంచి తనదైన శైలిలో సమాధానాలు రాబడుతున్న తీరు చూసి అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. దాంతో ఈ షోని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ షోలో తాజాగా ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 30వ తేదీనే మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అయిపోయింది. ఇక రెండో పార్ట్ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. అదే సమయంలో బాలయ్య షో కి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ స్టార్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగు మార్కెట్ పై మాత్రమే దృష్టి సారించిన స్టార్. అయితే క్రేజ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇద్దరిదీ సరి సమానమే. ఎందుకంటే ప్రభాస్ కు దేశ విదేశాల్లో గుర్తింపు ఉంటే పవన్ కి అంతే ఇమేజ్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉందనడం అతిశయోక్తి కాదు. ఇలాంటి సమయంలో ప్రభాస్ తో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్ షో తో పోలిస్తే పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. ప్రభాస్ కు సంబంధించిన ఎపిసోడ్ లో బాలయ్య అతని వ్యక్తిగత జీవితం, వివాహం, తన పెద్దనాన్న కృష్ణంరాజుతో ఉన్న అనుబంధం, ఇతర వ్యక్తిగత విషయాలను, వృత్తిపరమైన విషయాలను అడిగారు. కానీ అదే పవన్ కళ్యాణ్ విషయాన్ని వస్తే అది పూర్తిగా విభిన్నం. ఇందులో ఆయన పవన్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలైన మూడు పెళ్లిళ్లు, సినిమాలు, చిరంజీవి- నాగబాబులతో ఉన్న విభేదాలతో పాటు రాజకీయ ప్రశ్నలు కూడా అడిగి తనదైన శైలిలో సమాధానాలు రాబట్టారు. దాంతో ఈ రెండు ఎపిసోడ్లలో ఏది పెద్ద హిట్ అవుతుంది? ఏది ఎక్కువగా రేటింగ్స్ సాధిస్తోంది? ఏది టాప్ లో ట్రెండ్ కాబోతోంది? అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవైపు ప్రభాస్ తన పెళ్లి, వ్యక్తిగత విషయాలతో హీట్ పుట్టిస్తుంటే మరోవైపు పవన్ వీటికి తోడు రాజకీయాలను కూడా మాట్లాడి రచ్చ రచ్చ చేయనున్నారు. మొత్తానికి ఈ రెండు షోలలో ఏది టాప్ లో నిలుస్తుందో కాలమే తేల్చిచెప్పాలి.