English | Telugu
మోసం చేశాడని ఆరోపించిన భార్య.. ఆత్మహత్యాయత్నం చేసిన నటుడు!
Updated : Apr 26, 2021
ఇటీవల వార్తల్లోకెక్కిన మలయాళం టీవీ నటి అంబిలీ దేవి భర్త, నటుడు ఆదిత్యన్ జయన్ ఆత్మహత్య యత్నం చేశారు. అందిన సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రం త్రిసూర్‌లోని తన కారులో అతను చేయి నరాలను కోసుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడిని త్రిసూర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో ఉన్నాడు.
"అతను అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగాడు. అతడి పొట్టను శుభ్రం చేశాం. చేతి మణికట్టు దగ్గర కోసుకున్న గాయం ఉంది. తదుపరి చికిత్స కోసం సర్జన్‌ను సంప్రదిస్తున్నాం. రోగి కొంచెం మగతలో ఉన్నాడు కానీ రెస్పాండ్ అవుతున్నాడు. 24 నుంచి 48 గంటల అబ్జర్వేషన్ తర్వాతే వివరాలు తెలియజేస్తాం." అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
భార్య అంబిలీదేవితో వ్యక్తిగత గొడవల కారణంగా అతను ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఆదిత్యన్ తనను మోసం చేశాడని అంబిలి ఆరోపించారు. విడాకులు ఇవ్వమని అడుగుతున్నాడనీ, లేదంటే చంపుతానని బెదిరిస్తున్నాడనీ ఆమె ఆదిత్యన్‌పై ఆరోపణలు చేశారు. అయితే ఆమె ఆరోపణలను ఆదిత్యన్ ఖండించాడు. తనకు చెడ్డపేరు తీసుకురావడానికి అలాంటి పర్సనల్ గొడవల్ని ఉపయోగించుకోవద్దని అతను కోరాడు.
2019లో అంబిలీదేవి, ఆదిత్యన్ జయన్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఆ ఇద్దరూ 'సీతాకల్యాణమ్' అనే టీవీ షోలో జంటగా నటించారు. ఆ ఇద్దరికీ అర్జున్ అనే కొడుకు ఉన్నాడు.