English | Telugu
తిలోత్తమ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న నయని
Updated : Jun 3, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. జరగబోయేది ముందే తెలిసే వరం వున్న ఓ యువతి కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. తన భర్త తల్లిని దారుణంగా హత్య చేసి ఆమె స్థానాన్ని అక్రమించి ఇంటిని, ఆస్తుల్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న తిలోత్తమకు పల్లెటూరి యువతి అయిన నయని ఎలాంటి గుణపాఠం చెప్పింది? చివరికి తన ఆట ఎలా కట్టించిందనే ఆసక్తికర కథ, కథనాలతో ఈ సీరియల్ సాగుతోంది. కన్నడ నటులు అషికా గోపాల్, చందు గౌడ ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర, విష్ణు ప్రియ, భావనా రెడ్డి, అనిల్ చౌదరి, శ్రీ సత్య, నిహారిక నటించారు.
కసి మాటలు వింటూ గుడ్డిగా వెళుతున్నారని, తన కారణంగా కోట్లల్లో నష్టాలు వస్తున్నాయని, ఇదే కంటిన్యూ అయితే అంతా రోడ్డున పడటం గ్యారెంటీ అని హాసిని హెచ్చరిస్తుంది. అయితే ఆ మాటలు వల్లభకు అంతగా నచ్చకపోవడంతో హాసినిని హెచ్చరిస్తాడు. ఇదే సమయంలో అతని తమ్ముడు విక్రాంత్ కూడా కసిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వల్లభ అతనిపై చేయి చేసుకుంటాడు. అది భరించలేని విక్రాంత్ వెంటనే వల్లభ కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. అది చూసిన తిలోత్తమ .. విక్రాంత్ పై చేయి చేసుకుంటుంది.
కట్ చేస్తే.. ఫ్యాక్టరీ వర్కర్లతో కలిసి నయని, విశాల్ కలిసి భోజనం చేస్తుంటారు. అందరి టిఫిన్ బాక్సలు తెరిచి ఒకే అరటాకులో వేసుకుని నయని కలిపి ముద్దులు అందిస్తుంటే విశాల్ తో పాటు వర్కర్స్ కలిసి తింటుంటారు. అదే సమయానికి వల్లభ, కసితో కలిసి తిలోత్తమ అక్కడికి వస్తుంది. కలిసి భోజనం చేస్తుంటే కసి అవమానిస్తుంది. అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అంటూ విశాల్ ని దారుణంగా అవమానిస్తుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నయన ఎంగిలి చేతే కసి చెంప ఛెల్లుమనిపిస్తుంది. ఎక్కువగా వాగితే మర్యాదగా వుండదని హెచ్చరిస్తుంది. భోజనాల టైమ్ లో కుక్కల్లా వచ్చారని ఫైరవుతుంది.. నయని దూకుడు చూసిన తిలోత్తమ, వల్లభ షాక్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
కట్ చేస్తే.. గాయత్రీ దేవి ఆబ్దికాన్ని జరిపిస్తున్నామని, అయితే ఆ కార్యాన్ని ఊళ్లో జరిపిస్తున్నామని చెబుతాడు విశాల్ .. ఊళ్లో అనే మాటలు విని తిలోత్తమ షాక్ అవుతుంది. ఆ తరువాత నయని ఫోన్ తీసుకుని `గాయత్రమ్మ ప్రాణాలు వదిలిన చోటే నువ్వు హత్య చేశావన్న ఆధారాలని కూడా వదిలి పెట్టిపోయావు` అంటూ తిలోత్తమకు చెమటలు పట్టిస్తుంది. నయని మాటల్లో తనకు ఉచ్చు బిగుస్తోందని గ్రమించిన తిలోత్తమ ఏం చేసింది? .. ఆ తరువాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.