English | Telugu
'వైదేహీ పరిణయం' హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఇదే!
Updated : Jul 12, 2021
అందం, అమాయకత్వం కలగలిపిన అమ్మాయి వైదేహిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యుక్తా మల్నాడ్ ఉంది చూశారా? అదేనండీ... 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'వైదేహీ పరిణయం' సీరియల్‌లో వైదేహిగా నటిస్తున్న అమ్మాయి. నటనపై ఆసక్తితో విమానంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ వచ్చింది. ఇంతకీ, యుక్తా మల్నాడ్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న యుక్తా మల్నాడ్ తెలుగమ్మాయి కాదు. పేరులోని చివరి అక్షరాలు 'మల్నాడ్' ఆమె ఇంటి పేరు కూడా కాదు. యుక్తాది కర్ణాటకలోని చిక్ మంగళూరు. బీకామ్ చదివింది. డిగ్రీ చదివేటప్పుడు అందాల పోటీల్లో పాల్గొనేది. 2015లో 'మిస్ మల్నాడ్' టైటిల్ గెలుచుకుంది. అందుకు గుర్తుగా పేరు చివర 'మల్నాడ్' అని పెట్టుకుంది.
కాలేజీలో ఉండగా కన్నడ సినిమా 'అనిసుతిదే'లో అవకాశం వస్తే నటించింది. కానీ, అది విడుదల కాలేదు. డిగ్రీ తర్వాత ఎయిర్ హోస్టెస్ గా చేసే అవకాశం వస్తే 'స్పైస్ జెట్'లో చేరింది. నటనపై ఆసక్తితో రెండు మూడు నెలలు తిరక్కుండా మానేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కొన్నాళ్ళు పని చేసింది. కన్నడ సీరియల్‌లో నటించాలని ఆడిషన్స్ ఇస్తే... తొలుత తమిళ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అదెలా? అంటే... కన్నడ సీరియల్‌కి పని చేసే వ్యక్తి ఒకరు తమిళంలో చేస్తావా? అని అడగటంతో చేసేసింది. తర్వాత తెలుగులో 'వైదేహీ పరిణయం'లో అవకాశం వచ్చింది.
నిజానికి, తెలుగులో సినిమా కథానాయికగా అడుగుపెట్టాలని యుక్తా మల్నాడ్ భావించింది. తలుపు తట్టిన మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని సీరియల్ చేశానని ఆమె చెప్పింది. అదీ సంగతి.