English | Telugu

భ‌ర్త మ‌ర‌ణాన్ని త‌ల‌చుకొని భోరుమ‌న్న‌ సురేఖావాణి!

బుల్లితెర నటిగా కెరీర్ ఆరంభించి ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పాపులారిటీ సంపాదించుకున్నారు నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ తనదైన అభిన‌యంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు సుప్రీతతో కలిసి తీసుకున్న ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఈమె తన స్నేహితురాలు నటి రజితతో కలిసి 'అలీతో సరదాగా' షోకి అతిథిగా హాజరయ్యారు.

ఈ షోలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సురేఖా వాణి బయటపెట్టారు. అంతేకాకుండా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సురేష్ మృతి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కొన్ని అపార్ధాలు, మనస్పర్థల కారణంగా తన అత్తింటి కుటుంబం తమకు దూరంగా ఉంటోంద‌ని.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్లు ఒక్క రూపాయి సాయం చేయలేదని వాపోయారు. తన కూతురు, తనే అన్నీ సమకూర్చుకున్నామని.. అయినప్పటికీ తనను, తన కూతుర్ని వాళ్లు నిందించారని.. తన భర్త మృతి విషయంలో తనదే తప్పంటూ బ్లేమ్ చేశారని చెప్పుకొచ్చారు.

తన భర్త చనిపోయినప్పుడు.. కనీసం అతడి తల్లి కానీ, అన్నదమ్ములు కానీ చూడడానికి రాలేదని తెలిపారు. కనీసం ఈ ప్రోగ్రాం చూశాకైనా.. వాళ్లు సిగ్గు తెచ్చుకోవాలని మండిపడ్డారు. అనంతరం తన భర్త మరణం గురించి మాట్లాడుతూ.. శరీరంలో రక్తం గడ్డ కట్టడంతో ఓ సర్జరీ చేయించామని.. అది జరిగిన నెల రోజులకే ఆయన కన్నుమూశారని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. ఇక తన రెండో పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఏదేదో రాస్తున్నారని.. వాళ్లనే పెళ్లి సంబంధాలు కూడా చూడమని చెప్పానని వ్యంగ్యంగా మాట్లాడారు.