English | Telugu

రూపాయి ఇచ్చినా చాలు.. ర‌ష్మి పిలుపు!

బుల్లితెరపై గ్లామ‌ర‌స్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. కానీ ఎక్కువగా బుల్లితెరకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. జంతు రక్షణ కోసం తనవంతు సాయం చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక్క రూపాయి దానం చేయమని అభిమానులను కోరింది. ఓ డాన్స్ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ కష్టాల్లో ఉందని.. తనకు ఆర్థిక‌ సాయం చేయడం కోసం ముందుకు రావాలని రష్మీ కోరింది.

ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. డాన్సర్ పవిత్ర పరిస్థితి గురించి అందరికీ తెలిసే ఉంటుందని.. ఆమె తల్లితండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలిందని.. డబ్బు లేకపోవడంతో ఆమె తండ్రికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయించలేకపోయిందని చెప్పింది. దురదృష్టవశాత్తు ఆమె తండ్రి మరణించారని.. ఆర్థికంగా పవిత్ర ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని కాబట్టి ఆమెకి సాయం చేద్దామని రష్మీ కోరింది. తన ఇన్స్టాగ్రామ్ లో 3.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారని.. అందరూ ఒక్కో రూపాయి ఇచ్చినా చాలని.. కనీసం రెండు లక్షల మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందజేద్దామని రష్మీ వేడుకుంది.

రష్మీ తీసుకున్న నిర్ణయానికి ఆమె అభిమానులు అండగా నిలిచారు. తమకు తోచినంత మొత్తాన్ని సాయంగా అందించారు. దీంతో అతి తక్కువ సమయంలోనే రూ.2 లక్షలను రష్మీ పోగు చేయగలిగింది. ఆ మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందజేసింది. రష్మీ చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆమెని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తన మాటకు విలువిచ్చి ఓ మంచి పనికి సపోర్ట్ చేసిన అభిమానులకు రష్మీ కృతజ్ఞతలు చెప్పింది.