Read more!

English | Telugu

Krishna Mukunda Murari : కృష్ణకి కడుపునొప్పి.. అల్లాడిపోయిన కుటుంబసభ్యులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -450 లో... అంతా పానకం తాగి, వడపప్పు తిని, పూజ అయిపోవడంతో.. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్తారు. అయితే రేవతి దగ్గరకు అదర్శ్ వెళ్లి.. పిన్నీ.. అమ్మతో ఓ మాట చెప్పాలి. కానీ భయంగా ఉంది. నువ్వు వెళ్లి.. నేను చెప్పింది చెప్పినట్లుగా తనకు చెబుతావా అని అంటాడు. సరే చెబుతాను. ఏంటా విషయమని రేవతి అడుగగా.. పిన్నీ నేను ముకుందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. అదే మన మీరా ఉంది కదా.. తనని. తనతో నా జీవితాన్ని ఊహించుకుంటున్నాను పిన్నీ అని అంటాడు. అంతే కదా.. నేను చెబుతాలే నాన్నా అని రేవతి అంటుంది. ఏంటి పిన్నీ అంత తేలికగా తీసుకుంటున్నావ్? అనాథ పిల్లతో పెళ్లి ఏంట్రా అని తిట్టవా నన్ను అని అదర్శ్ అంటాడు. అందులో తప్పేముందిరా.. తను మన ఇంట్లో పిల్లలా కలిసిపోయింది కదా.. నీ ఆశలో న్యాయం ఉంది.. ఈ విషయం నేను అమ్మతో చెబుతానని రేవతి అనగానే.. సరేనని అదర్శ్ అంటాడు. ఇక వెంటనే భవాని దగ్గరకు రేవతి వెళ్లి.. ఆదర్శ్ చెప్పిన విషయం చెప్తుంది.

రేవతి చెప్పింది విని భవాని షాక్ అవుతుంది. ఆదర్శ్ ఆలోచన బాగానే ఉంది కానీ.. వాడి మీదే ఆశపెట్టుకున్న సంగీతకు ఏం చెబుతాం. అయిన వీడు మీరాను ఇష్టపడుతున్నాడు సరే.. మీరా వీడ్ని ఇష్టపడుతుందో లేదో.. తెలియాలి కదా.. ముకుంద విషయంలో కూడా మనసు తెలుసుకోకుండా తప్పు చేశాం కదా.. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేయొద్దు.. ఆలోచిస్తాను.. వాడు అడిగితే ఆలోచిస్తా అందని చెప్పని అంటుంది భవాని. దానికి రేవతి సరేనంటుంది. మరోవైపు మురారి, కృష్ణ మాట్లాడుకుంటారు. నాకు కుంతీదేవిలా మంత్రం జపించడం వస్తే బాగుండు ఏసీపీ సర్.. ఓ మంత్రం చదివి.. బిడ్డను కనేసి.. పెద్ద అత్తయ్య చేతిలో ఈ క్షణమే పెట్టాలని ఉంది ఏసీపీ సర్ అని కృష్ణ నవ్వుతూ అంటుంది. దాంతో మురారీ మురిసిపోతాడు. అప్పుడే కృష్ణకు కడుపులో నొప్పి మొదలైపోతుంది. మధు కారు తియ్ అంటూ మురారీ.. కృష్ణను పట్టుకుని కిందకు దిగడం.. భవాని, రేవతి కంగారుపడటం.. అంతా చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. కృష్ణని చూసిన మీరా సంబరపడుతుంటుంది. అంతా కలిసి.. కృష్ణను కారు ఎక్కిస్తారు. ఆమె పక్కనే మురారి కూర్చుంటాడు. ఆదర్శ్ కూడా అక్కడే ఉండి అంతా చూస్తుంటాడు. అప్పుడే కృష్ణ.. పెద్ద అత్తయ్యా.. చాలా ఎక్కువగా వస్తోంది నొప్పి.. చచ్చిపోతానేమో అనిపిస్తోంది. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే పోతానేమో అని భయంగా ఉందని అనగా.. చంపేస్తాను.. నీకేం కాదని భవాని ఎమోషనల్ గా అంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. రేవతి కూడా కృష్ణకు ధైర్యం చెబుతుంది. ఆ పానకం, వడపప్పు తినడం వల్ల ఏమైనా.. అంటు భవాని అనుమానం వ్యక్తం చేస్తుండగానే.. మీరా అడ్డుపడుతుంది. అయ్యో ప్రసాదం వల్ల ఏమవుతుంది మేడమ్.. మనందరం తిన్నాం కదా.. మనకేం కాలేదు కదా? వేరే ఏదో సమస్య అయ్యి ఉంటుంది . కాకపోతే పండుగ రోజు ఇలా జరగడమే బాధగా ఉందని మీరా డైవర్ట్ చేస్తుంది.

ప్రాబ్లమ్ లేదు ఏం లేదు.. ఉపవాసం ఉండి ఆకలి తట్టుకోలేక వడపప్పు రెండు పిడికలు ఎక్కువ తినేసి ఉంటుందిలే అని రజినీ అంటుంది. అంత బాధపడుతుంటే మీకు వెటకారం వస్తుందా? ఆపండి పిన్నిగారు..అని కావాలనే రజినీని మీరా తిడుతుంది. మధు.. నేను కారు డ్రైవ్ చేస్తా.. కీస్ ఇవ్వంటూ కృష్ణ కూర్చున్న కారు కీస్ మీరా అందుకుంటుంది. కారు తనే డ్రైవ్ చేసి.. ఆసుపత్రికి తీసుకుని వెళ్తుంది. అంతా చూసిన ఆదర్శ్‌కి అనుమానం వస్తుంది. తన ఫ్రెండ్‌ ముకుంద చావుకి కృష్ణే కారణమని చాలా కోపంగా ఉంది కదా ఈ మీరా.. కృష్ణ మీద..? కానీ కడుపులో నొప్పి రాగానే తను ఎందుకు అంతలా అల్లాడిపోయి.. తనే ఆసుపత్రికి తీసుకెళ్తుందేంటని మనసులో అనుకుంటాడు. ఇక కృష్ణను డాక్టర్ పరిమళ ఆసుపత్రికే తీసుకుని వెళ్తారు. అక్కడ పరిమళ.. కృష్ణకు ఏమైంది.. ఉదయం నుంచి ఏం తిందంటూ ఆరా తీస్తుంది. ఉదయం నుంచి ఏం తినలేదు. పూజ తర్వాత పానకం, వడపప్పు తింది అంతే అని మురారి అంటాడు. అవి మేము కూడా తిన్నాం.. మాకేం కాలేదు. తనకు వేరే ప్రాబ్లమ్ ఉన్నట్లుందంటూ ముకుంద అలియాస్ మీరా కవర్ చేస్తుంది. ఇక కృష్ణ విలవిలాడిపోతుంటే.. లోపలికి తీసుకుని వెళ్లమంటుంది పరిమళ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.