English | Telugu
జబర్దస్త్ వర్షకు కొవిడ్ పాజిటివ్.. ఇమ్మానియేల్ జాగ్రత్త అంటూ కామెంట్స్!
Updated : Apr 20, 2021
జబర్దస్త్‌లో ఇమ్మాన్యుయేల్ జోడీగా పాపులర్ అయిన వర్ష కొవిడ్-19 బారినపడింది. టెస్ట్‌లో ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఓ వీడియో ద్వారా ఆమె తెలియజేసింది. రెండు రోజుల నుంచీ తనకు లక్షణాలు కనిపిస్తున్నాయనీ, ఈరోజు వచ్చి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందనీ ఆమె వెల్లడించింది. అంతేకాదు, తాను టెస్ట్ చేయించుకున్న కరోనా సెంటర్‌లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో కూడా ఆమె తెలియజేసింది.
"రెండు రోజుల నుంచీ మరీ ఎక్కువగా కాకపోయినా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఓకే ఓకే అనుకుంటూ వచ్చాను. బయట పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. అందుకే ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకుందామని వచ్చాను. టెస్టులో పాజిటివ్ వచ్చింది. ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ జరుగుతోంది బయట ఎవరికీ తెలీడం లేదు. ఇక్కడ గనక చూస్తే ఎవరికైనా చాలా టెన్షన్ వస్తుంది. మొదట భయపడతారు. చనిపోయినవాళ్లను ప్యాక్‌చేసి అలా విసిరేస్తున్నారు. అది చూడగానే లైవ్‌కు వచ్చి చెప్పాలనుకున్నాను. ప్లీజ్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి." అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది వర్ష.
ఆ వీడియోతో పాటు #varshajabardasth #jabardasthvarsha #varshaemmanuel అనే హ్యాష్‌టాగ్స్‌ను ఆమె జోడించింది. ఇమ్మాన్యుయేల్ పేరును తనతో కలిపి జోడించడం ద్వారా తన లైఫ్‌లో అతనికి ఎంత ప్రాముఖ్యం ఉందో తేల్చేసింది వర్ష. అందుకే కామెంట్ సెక్షన్‌లో వర్ష తర్వగా కోలుకోవాలని కోరుకుంటూనే జాగ్రత్తరా రేయ్ ఇమ్మానియేల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు వర్ష ఫాలోయర్స్.