English | Telugu
నటుడు చందన్‌పై దాడి చేసిన సీరియల్ యూనిట్
Updated : Aug 2, 2022
తెలుగు బుల్లితెరపై 'శ్రీమతి శ్రీనివాస్' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర నటుడు చందన్ పై దాడి జరిగింది. కన్నడ ఇండస్ట్రీలో చందన్ కుమార్ కి మంచి పేరు ఉంది. ఐతే చందన్ కుమార్ ఎపిసోడ్ షూటింగ్ టైంలో టీంలో ఒక సభ్యుడితో తప్పుగా ప్రవర్తించాడనే నెపంతో యూనిట్ మొత్తం చందన్ మీద తిరగబడింది. అతని చెంపపై కొట్టి తిట్టేసరికి చందన్ ఆ వ్యక్తికి సారీ చెప్పక తప్పలేదు. లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా యూనిట్ అతడిపై దాడికి దిగారు. "నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా?" అంటూ దుర్భాషలాడారు. జరిగిన విషయానికి చందన్ సారీ కూడా చెప్పాడు.
ఐతే ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి చందన్ మీడియాకి వివరణ ఇచ్చాడు. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగోని కారణంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు చెప్పాడు. ఐతే వాళ్ళ అమ్మ దగ్గర ఉండాల్సి రావడంతో సరిగా నిద్ర లేక బాగా అలసటగా ఉండేసరికి "ఒక ఐదు నిమిషాల రెస్ట్ తీసుకుని తర్వాత షూటింగ్ కి వస్తానని డైరెక్టర్ గారికి చెప్పమని అసిస్టెంట్ డైరెక్టర్ కు చెప్పు" అంటూ ఒక కుర్రాడికి విషయం చెప్పి పంపాడట. అసలు తాను చెప్పిన విషయం ఎలా పెడర్థానికి దారి తీసిందో తెలీదు కానీ యూనిట్ మొత్తం వచ్చి అతని మీద దాడికి దిగారట. "ఇదంతా నేను మనసులో పెట్టుకోను. నా పని నేను చేసుకుపోతాను" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.