English | Telugu

సీక్రెట్‌గా బిగ్‌బాస్‌ షూటింగ్‌.. అడ్డుకున్న పోలీసులు

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ లు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే సీనియర్ హీరో మోహన్‌ లాల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మలయాళం బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌ షూటింగ్ మాత్రం రహస్యంగా చేస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వాళ్ళు షూటింగ్ ని నిలిపివేశారు.

మలయాళం బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఇంతలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో అన్ని షూటింగ్ లకు బ్రేక్ పడింది. అయితే మలయాళం బిగ్‌ బాస్‌ నిర్వాహకులు మాత్రం షో మధ్యలో ఉండటంతో షూటింగ్‌ ఆపేయకుండా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి షో నిర్వహిస్తున్నారు.

షూటింగ్ లపై నిషేధం ఉన్నప్పటికీ, ఈ షోలో పని చేసే 8 మంది సిబ్బంది కరోనా బారిన పడినప్పటికీ షో వాయిదా వేయకుండా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో వారు చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో బిగ్‌ బాస్‌ సెట్‌ కు వెళ్లి షూటింగ్ ను నిలిపివేశారు. కంటెస్టెంట్లతో సహా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని అక్కడ నుంచి పంపించారు. అనంతరం సెట్‌ ను సీల్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం షూటింగ్‌ లపై నిషేధం విధించినప్పటికీ రహస్యంగా షూటింగ్ జరిపిన నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.