English | Telugu
12న బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్ హంగామా
Updated : Jun 7, 2022
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఏ స్థాయిలో పాపులర్ గా మారిందో అందరికి తెలిసిందే. బిగ్గెస్ట్ క్రేజీ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వాలని ఇప్పటికీ సెలబ్రిటీలు, టీవీ స్టార్ లు, యూట్యూబర్స్, సామాన్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఓటీటీ మొట్ట మొదటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ విజయవంతంగా ముగిసింది. తొలి సారి మహిళా కంటెస్టెంట్ బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు సీజన్ 6 కు సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టేశారు.
దీనికి సంబంధించిన ప్రోమోని కూడా తాజాగా హోస్ట్ నాగార్జున పై చిత్రీకరించి రిలీజ్ చేశారు. సీజన్ 6 లో అనూహ్యంగా సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నామంటూ ప్రకటించారు. దీంతో చాలా మంది ఈ షోలోకి ప్రవేశించే గోల్డెన్ ఛాన్స్ కోసం ఆసక్తిని చూపిస్తూ తమలోని టాలెంట్ ని ప్రదర్శించడానికి రెడీ అయిపోతున్నారు. ఇదిలా వుంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ పాపులర్ టీవీ సీరియల్స్ కు చెందిన 16 నటీనటుల్ని టీమ్ లుగా మార్చి బిగ్ బాస్ హౌస్ లో 24 గంటల పాటు రచ్చకు ప్లాన్ చేసింది స్టార్ మా.
`బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్` పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఇప్పటికే స్టార్ మా లో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్స్ లోని నటీనటుల్ని ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసి ఒక్క రోజులో వీరంతా చేసిన హంగామాని చూపించబోతోంది. దీనికి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ని ఈ ఆదివారం జూన్ 12న మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రసారం చేయబోతోంది. ఈ షోలో స్టేజ్ పై యాంకర్ రష్మీ, శేఖర్ మాస్టర్ చేయబోతున్న హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా వీరికి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు. `మందులోడా ఓరి మాయలోడా` అంటూ రష్మీ ఓ రేంజ్ లో స్టేజ్ ని అదరగొట్టేసింది. శేఖర్ మాస్టర్ `మమ్మ మ్మా మమ్మా మహేష్ ... ` అనే పాటకు డ్యాన్స్ ఫ్లోర్ ని ఇరగదీసేశాడు.