English | Telugu
ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్...పవిత్రపై ఆషిక ఎమోషనల్ పోస్ట్
Updated : May 15, 2024
బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రీసెంట్ గా కారు యాక్సిడెంట్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. జీ తెలుగులో ప్రసారమయ్యే 'త్రినయని' సీరియల్ లో తిలోత్తమ రోల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది పవిత్ర. ఆమె ఇక తిరిగి రాదనే వాస్తవం నుంచి, ఆ బాధ నుంచి ఆమె అభిమానులు, తోటి నటీనటుల్ని ఇంకా బయటకు రాలేదు. ఆమె మృతి విషయాన్ని అసలుజీర్ణించుకోలేకపోతున్నారు త్రినయని సీరియల్ టీమ్. ఎందుకంటే త్రినయనిలో హీరోయిన్ కంటే కూడా తిలోత్తమ రోల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇక ఈ సీరియల్ హీరోయిన్ ఆషికా పదుకొణె బాధపడుతూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోస్ ని పిక్స్ ని అన్నీ కలిపి ఒక పోస్ట్ గా పెట్టుకుంది.
"తిలోతమ్మగా మా షోకి ఎంతో ప్రాణం పోసావ్. పవిత్ర జయరామ్‌గా మా సెట్స్‌కి హై ఎనర్జీని అందించావ్. ఇంతలోనే మమ్మల్ని వదిలేసి పని మధ్యలోనే వదిలేసి అర్దాంతరంగా వెళ్లిపోయావ్. నీతో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ముడి పడి ఉన్నాయి. నువ్వు లేని ఈ సీరియల్ సెట్ లోకి రావాలంటే కష్టంగా ఉంది. భోజనం చేసేటప్పుడు నువ్వు మా ఎదురుగా లేకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నాం. నాలుగేళ్లుగా కలిసి ఎన్ని ఆనందకర క్షణాలను గడిపామో గుర్తొస్తే ఏడుపొస్తోంది. అలాంటి క్షణాలు ఇక లేవని గుర్తొచ్చిన ప్రతిసారి చాలా కష్టంగా ఉంది. నీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం. నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు. నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఒక్కసారి మా కోసం తిరిగిరా ప్లీజ్." అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఆషికా పదుకొణె. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె ప్లేస్ మరొకరిని ఊహించుకోలేము అని బాధపడుతున్నారు.