English | Telugu

తను సైలెంట్‌, నేను వయొలెంట్.. అయినా మా ప్రయాణం అద్భుతం!

సీరియల్‌ నటి కరుణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె బుల్లితెర మీద ఒక వెలుగు వెలిగిన నటి. 'మొగలి రేకులు' సీరియల్‌ ద్వారా కరుణకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం పలు సీరియల్స్‌లో యాక్ట్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. సీరియల్స్‌, ఫోటోషూట్స్‌లో ఆమె వేసుకునే కాస్ట్యూమ్స్‌ కి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పింది. "నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. 30 సినిమాల్లో యాక్ట్ చేసాను. ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోస్ అందరితో నేను నటించాను. "ఆహా" మూవీ ద్వారా నేను స్క్రీన్ మీద కనిపించాను. ఆ తర్వాత ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేసాను. చిరంజీవి గారితో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ మూవీలో కూడా కనిపించాను. నా భర్త ఒక డైరెక్టర్‌. 2007లో తొలిసారి తను నాకు ప్రపోజ్‌ చేశాడు. ఐ లవ్యూ అని చెప్పలేదు.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. నేను ఆ మాటకు షాకయ్యాను. ఎందకంటే తను చాలా సైలెంట్‌, నేను చాలా వయొలెంట్. మా రిలేషన్‌ ఎలా సాగుతుంది అనుకున్నాను. కానీ.. 15 ఏళ్లుగా మా ప్రయాణం అద్భుతంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.

‘‘నా భర్త తెలుగబ్బాయే.. మేం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు.. ఆ తర్వాత మధ్యలో ఒకసారి మిస్‌ క్యారేజ్‌ అయ్యింది. ఆ సమయంలోనే నేను ఒక సీరియల్‌ నుంచి తప్పుకున్నాను. సినిమాల్లోకి రాకపోయుంటే.. డాక్టర్‌ని అయ్యుండేదాన్ని.నన్ను జీవితంలో చాలామంది మోసం చేశారు. ఆ టైములో ఎంతో బాధపడ్డాను. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకుని.. ముందుకు సాగుతున్నాను. ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. నా భర్తకు నేనంటే చాలా ఇష్టం. నా జీవితం సంతోషంగా సాగుతుంది.. చేయాలనుకున్నది జీవితంలో చేసేయడమే’’ అని చెప్పింది కరుణ. తాజాగా కరుణ ఎక్స్‌పోజ్డ్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది.