English | Telugu
వేటూరి గారిది సమ్మోహనత్వం.. ఆ తర్వాత వాళ్లది ఉత్త కవిత్వం!
Updated : Jul 27, 2022
జొన్నవిత్తుల రామలింగేశ్వరావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గేయ రచయితగా మూవీస్ లో ఎన్నో హిట్ సాంగ్స్ రాసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. "అవార్డులు ఏవీ రాకపోయినా ఎక్కడైనా నా పాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.. అంతకన్నా నాకు అవార్డులు ఏం కావాలి" అని అంటారు జొన్నవిత్తుల. తన లైఫ్ లో వాళ్ళ నాన్న గారు అడిగిన కొన్ని విషయాలను అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చా జొన్నవిత్తుల.
"ఏరా జీవితంలో నేనేమన్నా నీకు ఇచ్చానా?" అని 90 ఏళ్ల వయసులో తనని అడిగారట. "ఏతండ్రి ఇవ్వనంత సంపద నాకు ఇచ్చావ్.. అంతకన్నా నాకు ఏం కావాలి నాన్నా" అన్నారట జొన్నవిత్తుల. తాను రాసే పాటలే కాదు, తన కంఠస్వరం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చాలా మంది అనేవారట. ఐతే వాళ్ళ నాన్నగారి వాయిస్ లో పది శాతం తనకు అలాంటి కంఠస్వరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నారాయన. ఇక తన బాబాయి జెవిఎస్ రావు. ఆయన హిందుస్తానీ సంగీతంలో మహా విద్వాంసులు. ఆయన విజయవాడ సంగీత కళాశాలలో హిందుస్తానీ సంగీతం లెక్చరర్ గా కూడా పని చేసారని జొన్నవిత్తుల వెల్లడించారు.
అలాగే చిన్న తాతయ్య ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు గారి కంఠ స్వరం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు. "మా అమ్మకి అన్నయ్య ఐన దైతా గోపాలం గారు నాకు మావయ్య అవుతారు. ఆయన, మా చిన్న తాతయ్య కలిసి కొన్ని పౌరాణిక నాటకాలు వేశారు. అలా అమ్మ తరపు వైపు, నాన్న తరపు కూడా సంగీత నేపథ్యం ఉన్న కుటుంబాలు కావడంతో నాకు సంగీతం కాస్త అబ్బింది" అని చెప్పారు జొన్నవిత్తుల.
అలాగే తాను సరిగమపలతో రాసిన పాట విన్న ఆరుద్ర గారు తనని మెచ్చుకున్నారని చెప్పారు. పాటకు పరాకాష్ట వేటూరి గారు అంటే ఇష్టం అని చెప్పారు. "పాటకు సమ్మోహనత్వం సమకూర్చడం అనేది నారాయణరెడ్డి గారి తర్వాత వేటూరి గారికే అంతటి శక్తి ఉంది అని అనుకుంటాను. ఆ సమ్మోహనత్వం అంటే బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది. మనసును పాట వైపు అలా లాగేస్తుంది. కావాల్సింది అదీ. మిగాతా వాళ్ళు రాసే పాటల్లో కవిత్వం మాత్రమే ఉంటుంది" అంటూ మనసులో మాట చెప్పారు జొన్నవిత్తుల.