English | Telugu
భీమ్ పాటని మందు పాటగా మార్చేసిన చలాకీ చంటి
Updated : Jun 6, 2022
హాస్య ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో `జబర్దస్త్`. గత కొంత కాలంగా ఈటీవిలో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో టాప్ టీఆర్పీ రేటింగ్ తో కొనసాగుతోంది. ఈ షోకు ప్రముఖ గాయకుడు మనో, నటి ఇంద్రజ జడ్జిలుగా, అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక టీమ్ లీడర్స్ గా తాగుబోతు రమేష్, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, సునామీ సుధాకర్, రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ప్రస్తుతం జబర్తస్త్ షోలో స్కిట్ లు చేస్తున్నారు. ఈ గురువారం రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.
రాకెట్ రాఘవ `వాన జల్లు గిల్లుతుంటే..` అనే పాటతో ప్రోమో మొదలైంది. బామ్మగా తాగుబోతు రమేష్ చేసిన ఫీట్లు నవ్వులు పూయిస్తున్నాయి. రాకెట్ రాఘవ రెయిన్ సాంగ్ చేసి వస్తే అతని భార్య ప్లేట్ తో ఎంట్రీ ఇస్తుంది. 'ఏంటీ నువ్వు దిష్టి తీయడానికి రాలేదా?' అంటే 'నీ బెండు తీయడానికి వచ్చాను రా?' అంటూ రాఘవని చెడుగుడు ఆడుకోవడం... తన ఫ్రెండ్ పెళ్లి కోసం బామ్మగా మారిన తాగుబోతు రమేష్ చేసిన ఫీట్లు.. వేసిన వేషాలు నవ్వులు పూయించేలా వున్నాయి.
ఇక వీళ్ల తరువాత స్టేజ్ పై కొచ్చిన చలాకీ చంటీ తాగుబోతుల స్కిట్ తో నవ్వులు పూయించాడు. 'మందేస్తూ చిందెయ్ రా'.. అనే సాంగ్ తో తన టీమ్ తో ఎంట్రీ ఇచ్చిన చలాకీ చంటీ 'అందరికీ ఓ దినముంది.. మాక్కూడా ఓ దినం కావాలే' అంటాడు. దీంతో చంటి పక్కనే వున్న వ్యక్తి 'తాగుబోతుల దినోత్సవమా?' అనగానే అతని చెంప పగలగొట్టిన చలాకీ చంటి.. 'తాగుబోతు అంటావుర నన్ను.. ఎంపీపీ మధ్య పాన ప్రియుడు అనాల'న్నాడు.
ఆ తరువాత `ఆర్ ఆర్ ఆర్` సినిమాలోని `కొమురం భీముడో..` పాటని మందు పాటగా మార్చేశాడు. `విస్కీదేవాలా బ్రాండీ దేవాలా... గ్లాసుల ఐసేసీ మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. బుట్ట పక్కనా కోడిని చూడాలా.. కోడిని దీసుకొచ్చీ కోసీ వండాలా.. సుక్క సుక్కకీ ముక్క ముక్కతో జుర్రుకోవాలా... దొబ్బితాగాలా..` అంటూ కొమురం భీముడో పాటని చలాకీ చంటి తాగుబోతుల పాటగా మార్చేశాడు. దీంతో ఈ ప్రోమో నెట్టింట సందడి చేస్తూ వైరల్ గా మారింది.