English | Telugu
రిషి ఇంకా దేవయాని గుప్పిట్లోనే ఉన్నాడా!
Updated : Mar 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-702 లో.. కాలేజీలో జరిగిన ప్రెస్ మీట్ లో అందరి ముందు వసుధార తన భార్య అని ఒప్పుకున్నాడని, ఇంటికి వచ్చాక రిషితో దేవయాని మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తనని చూసిన రిషి.. 'ఏంటి పెద్దమ్మ అలా వెళ్ళిపోతుంది' అని, తన వెనకాలే వెళ్లి 'నాతో మాట్లాడవా పెద్దమ్మ' అని అడుగుతాడు. "ఈ పెద్దమ్మతో నీకు పనేంటి? చిన్నప్పటి నుండి ఈ చేతులతో పెంచి గోరు ముద్దలు తినిపించాను. ఇప్పుడు ఈ పెద్దమ్మ ఎవరో అన్నట్లుగా.. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ వసుధారని అందరి ముందు.. నా భార్య అని చెప్పావు" అని దేవయాని అంటుంది. "లేదు పెద్దమ్మ నీకు అంతా వివరించే పరిస్థితిలో లేను నేను. మీరు కావాలంటే జగతి మేడంని అడగండి. నేను ఇప్పటికీ ఎప్పటికీ మీరు చెప్పిందే వింటాను. నేను మీ రిషినే" అని అనగానే.. "ఇంకా రిషి నా గుప్పెట్లోనే ఉన్నాడన్న మాట" అని హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవయాని.
మరోవైపు రిషి అన్న మాటలు జగతితో చెప్తూ బాధ పడుతుంది వసుధార. "కాలేజీలో అందరి ముందు భార్యగా ఒప్పుకొని.. నాలుగు గోడల మధ్య నువ్వు నా భార్యవి కాదు.. నేను నీ భర్తని కాదని చెప్పి నా మనసు ముక్కలు చేసాడు" అంటూ వసుధార ఎమోషనల్ అవుతుంది. "రిషి త్వరలోనే అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకు" అని జగతి అంటుంది. అలా అనగానే.. "మీరు మీకు తెలియకుండానే మీ కొడుకుకి సపోర్ట్ చేస్తున్నారు మేడమ్" అని వసుధార అంటుంది. ఈ ప్రాబ్లమ్ ని నేనే సాల్వ్ చేస్తానని జగతి చెప్పేసి వెళ్తుంటుంది. అలా తను వెళ్ళిపోతుంటే "మేడం.. రిషి సర్ ని ఏం అడగకండి. నేను తన మీద మీకు చాడీలు చెప్పానని అనుకుంటాడు" అని వసుధార అంటుంది. "అబ్బో మీ MD సర్ ని ఒక్కమాట అననివ్వవు అన్నమాట.. అదే ప్రేమంటే" అని జగతి అంటుంది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
రిషి అన్న మాటలు వసుధార గుర్తు చేసుకుంటుంది. మరోవైపు రిషి కూడా వసుధార గురించే ఆలోచిస్తుంటాడు. నేను అందరి ముందు చెప్పింది.. నీకు చెప్పింది రెండు నిజమే కదా వసుధార అని రిషి తన మనసులో అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.